TCS CEO Krithivasan: సుంకాల అనిశ్చితి కొద్ది కాలమే
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:21 AM
అమెరికా తాజా సుంకాల ప్రభావం తాత్కాలికమని, భారత ఐటీ రంగంపై దీని ప్రభావం పెద్దగా ఉండదని టీసీఎస్ సీఈఓ కృతివాసన్ అన్నారు. చైనా కంటే భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చౌకగా ఉండడం కూడా మనకు లాభం చేకూరుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

కొద్ది నెలల్లో అన్నీ సర్దుకుంటాయి టీసీఎస్ సీఈఓ కృతివాసన్
ముంబై: అమెరికా తాజా సుంకాల ప్రభావం భారత ఐటీ రంగంపై పెద్దగా ఉండదని దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భావిస్తోంది. ఈ సుంకాలతో నెలకొన్న అనిశ్చితి ప్రభావం తాత్కాలికమని టీసీఎస్ సీఈఓ,ఎండీ కృతివాసన్ చెప్పారు. వచ్చే కొద్ది నెలల్లోనే ఈ అనిశ్చితికి తెరపడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సుంకాల నేపథ్యంలో క్లయింట్లు ధరలు తగ్గించమని ఒత్తిడి చేస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. తమకైతే ఇప్పటి వరకు ఆ పరిస్థితి ఎదురు కాలేదన్నారు. నిజానికి తాము కొన్ని ప్రాజెక్టుల ధర స్వల్పంగా పెంచినట్టు కృతివాసన్ వెల్లడించారు.
జీడీపీ వృద్ధికి దెబ్బే మూడీస్
అమెరికా సుంకాలతో చైనా, భారత్‌తో సహా అనేక ప్రధాన ఆసియా దేశాల జీడీపీ వృద్ధి రేటు దెబ్బతినే ప్రమాదం ఉందని మూడీస్ రేటింగ్ హెచ్చరించింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ముదిరినా ఆ ప్రభావం ఆసియా దేశాలపై తప్పదని కూడా స్పష్టం చేసింది.
బీటీఏతో మేలే
ట్రంప్ సుంకాలతో భారత కార్ల పరిశ్రమకు పెద్దగా వాటిల్లే నష్టమేమీ లేదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ, ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. మన దేశం నుంచి అమెరికాకు కార్ల ఎగుమతులు లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. అయితే రూపాయి మారకం రేటు తగ్గటంతో దేశంలో లగ్జరీ కార్ల ధర మరింత పెరిగి ఆ ప్రభావం అమ్మకాలపై పడే ప్రమాదం ఉందన్నారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) దీర్ఘకాలంలో భారత్‌కు మేలు చేస్తుందన్నారు.
చైనా కంటే మన ఐఫోన్లే చౌక
ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు పక్కన పెడుతూ ట్రంప్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం కూడా మన దేశానికి మేలు చేయనుంది. దీంతో మన దేశం ఐఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టా్‌పలు, ఎలకా్ట్రనిక్ వినియోగ పరికరాలను చైనా కంటే 20 శాతం తక్కువ ధరకే అమెరికాకు ఎగుమతి చేయగలుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనాపై ఇంకా 20 శాతం దిగుమతి సుంకాలు కొనసాగడం, మన దేశ ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు లేకపోవడం ఇందుకు కారణం. అమెరికా ఏటా 2,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.16 లక్షల కోట్లు) విలువైన స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు దిగుమతి చేసుకుంటోంది. ఇది భారత్‌కు కలిసి వస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.