Ugadi 2025: సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా.. పురాణాలు ఏం చెబుతున్నాయంటే..
ABN , Publish Date - Mar 30 , 2025 | 09:32 AM
శ్రీ మహా విష్ణువును దర్శించుకునేందుకు నారదుడు ఓసారి వైకుంఠానికి వెళ్లాడు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికరమైన విషయం చర్చకు వస్తుంది. అదేంటంటే విష్ణు లీలల గురించి.

ఇంటర్నెట్ డెస్క్: నేటి(ఉగాది) నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైంది. తెలుగు సంవత్సరాల్లో ఇది 39వ సంవత్సరం. అయితే ప్రభవ నుంచి అక్షయ వరకూ వచ్చే సంవత్సరాల పేర్ల వెనక పెద్ద కథే ఉంది. అసలు సంవత్సరాలకు పేర్లేంటి అనే విషయం తెలియాలంటే కచ్చితంగా ఓ కథ తెలుసుకోవాల్సిందే. శ్రీ మహా విష్ణువు, నారదుడికి మధ్య జరిగి సంవాదం కాస్త తెలుగు సంవత్సరాలకు దారి తీసిందని తెలుసా. అసలు వారి మధ్య జరిగిన సంభాషణ ఏంటి? తెలుగు సంవత్సరాలకు విష్ణువు, నారదుడికి మధ్య సంబంధం ఏంటో తెలియాలంటే ఈ కథ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే.
శ్రీ మహా విష్ణువును దర్శించుకునేందుకు నారదుడు ఓసారి వైకుంఠానికి వెళ్లాడు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికరమైన విషయం చర్చకు వస్తుంది. అదేంటంటే విష్ణు లీలల గురించి. ఆ లీలలు, మాయలకు ఎవరైనా లోనవుతారేమో కానీ తనపై మాత్రం పని చెయ్యవంటూ విష్ణువుతో నారదుడు చెప్తాడు. ఒక్కసారిగా నవ్వేసిన విష్ణువు.. భూ లోకంలోని ఓ అడవిలో ఉన్న సెలయేరును చూపించి అందులో స్నానం చేయమని నారదుడికి సూచిస్తాడు. విష్ణువు చెప్పినట్లుగానే నారదుడు ఆ సెలయేరులో స్నానం చేస్తాడు. దీంతో ఒక్కసారిగా స్త్రీ రూపంలోకి మారిపోతాడు. అయితే తనకు గతమేమీ గుర్తుండదు. ఏమీ అర్థం కాని స్థితిలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా.. వేట కోసం అడవికి వచ్చిన ఓ రాజు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని చూసి మోహిస్తాడు.
ఆమెను ఒప్పించి వివాహం చేసుకుంటాడు. ఈ క్రమంలో వారికి 60 మంది కుమారులు జన్మిస్తారు. వారిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. కొన్నాళ్లకు వేరొక రాజ్యంతో వీరిపై యుద్ధం ప్రకటిస్తారు. ఈ మేరకు రాజుతో సహా 60 మంది కుమారులు యుద్ధ భూమిలో ప్రత్యర్థి రాజు చేతిలో ప్రాణాలు కోల్పోతారు. విషయం తెలుసుకున్న రాణి రోదిస్తూ విష్ణువును ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై.. ‘‘నారదా.. నువ్వు ఎవరనేది ఇంకా గుర్తుకురాలేదా?’’ అంటాడు. తక్షణమే నారదుడు స్త్రీ రూపాన్ని వదిలి తన పూర్వ రూపంలోకి మారిపోయాడు. తనపై విష్ణు లీలలు పని చేయవని చెప్పిన నారదుడు.. విష్ణువు ఎదుట సిగ్గుతో తల వంచుతూ ‘‘దేవా.. నాపై ఎలాంటి లీలలు, మాయలు పని చేయవని అన్నందుకు గొప్ప గుణపాఠం నేర్పావు" అని అంటాడు.
బ్రహ్మచారినైన తాను స్త్రీగా మారి మాతృత్వాన్ని రుచి చూశానని, ఇప్పుడు ఆ కుమారుల మరణాన్ని భరించలేకపోతున్నట్లు మెురపెట్టుకుంటాడు. వారి జ్ఞాపకం శాశ్వతంగా నిలిచేలా చెయ్యమని శ్రీహరిని కోరతాడు. దీంతో ఆ అరవై మంది కుమారుల పేర్లు అరవై సంవత్సర నామాలుగా చిరస్థాయిగా నిలిపోతాయనే వరాన్ని నారదుడికి ఇస్తాడు. ప్రభవ నుంచి అక్షయ వరకూ 60 సంవత్సరాలను వారి పేర్లతోనే పిలుస్తారని చెప్తాడు. ఈ అరవై పూర్తయిన తర్వాత మరోసారి ప్రభవతో సంవత్సరాల చక్రం పునఃప్రారంభం అవుతుందని వరం ఇస్తాడు. కాగా, 60 సంవత్సరాల్లో 39వది అయిన విశ్వావసు నామ సంవత్సరంలోకి ఉగాది పర్వదినం నుంచి అడుగుపెట్టాం.
ఈ వార్తలు కూడా చదవండి:
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi 2025 Wishes: కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం