Share News

Osmania University: చైతన్యఝరి ఓయూ పై ఆంక్షలొద్దు

ABN , Publish Date - Apr 12 , 2025 | 02:03 AM

ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రలో విద్యార్థి ఉద్యమాలు, మేధావుల చర్చలు, రాజకీయ నేతల ఆవిర్భావం కేంద్ర బిందువుగా నిలిచాయి. నేటి ఆంక్షల వాతావరణంలో ఆ గౌరవనీయ వారసత్వాన్ని పరిరక్షించాలన్న అవసరం ఎక్కువైంది

Osmania University: చైతన్యఝరి ఓయూ పై ఆంక్షలొద్దు

ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అన్ని రకాల ఆందోళనలను నిషేధించిన అధికారులు, ఆ చర్యకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలను ఏమాత్రం పరిగణన లోకి తీసుకోకుండా, మరొక్క అడుగు ముందుకు వేసి, ఇకముందు కాంపస్ పరిధిలో నిర్వహించ తలపెట్టిన సదస్సులకు అతిథులుగా ఆహ్వానం అందుకునే వారి విషయంలోను, ఆ కార్యక్రమ సమయపాలన విషయం లోను, వాటి పత్రికా ప్రకటనలపై పోస్టర్లపై ముద్రించే పేర్ల విషయంలోను కొన్ని అసంబద్ధమైన ఆంక్షలు విధించడం దురదృష్టం. ఉస్మానియా యూనివర్శిటీ భారత విద్యా, రాజకీయ చరిత్రలో చెరగని ముద్రవేసిన విద్యా వ్యవస్థ. ఇక్కడి విద్యార్థి ఉద్యమాలు, మేధో చర్చలు ఎందరో నాయకుల ఆవిర్భావానికి దారితీశాయి. ఇక్కడ నుండి ఉద్భవించిన విద్యార్థి నాయకులు నాయకత్వంలో లెక్కలేనన్ని విద్యార్థి ఉద్యమాలు రూపుదిద్దుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలి, మలి దశల్లో ఓయూ కీలక పాత్ర పోషించింది. ఆర్ట్స్‌ కళాశాలలోని 57 నంబర్ గదికి ఓయూ చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. ఎందరో రచయితలు, కవులు, సామాజిక–సాంస్కృతిక మేధావులు విద్యార్థులతో అనుభవాలను పంచుకుని మమేకమయ్యారు. వివిధ సిద్ధాంతాలలో నిష్ణాతులైన మేధావుల ఉపన్యాసాలకు, తదనంతర మేధో చర్చలకు కేంద్రంగా పేరుగాంచింది ఈ గది.


ప్రముఖ విద్యావేత్తలు, రాజకీయ ప్రముఖులు, తత్త్వవేత్తలు, ఆలోచనాపరులు, భాషావేత్తలు తదితరులు తమ సిద్ధాంతాలను–ధోరణులను ఎలాంటి ఆంక్షలూ లేకుండా విద్యార్థులతో పంచుకున్నారు. పీవీనరసింహరావు, కుష్వంత్ సింగ్, జార్జ్ ఫెర్నాండెజ్, రామ్ మనోహర్ లోహియా వంటి మహనీయులు వారిలో కొందరు. 57 నంబర్‌ గది కేవలం తరగతి గది మాత్రమే కాదు; అది సామాజిక రాజకీయ అంశాలకు, సాహిత్యానికి, తాత్విక చర్చలకు వేదికగా మారిన ఫోరం. ఇక్కడ జరిగిన చర్చలు, చైతన్య ప్రసంగాలు విద్యార్థుల్లో కొత్త దిశలను మలిచాయి. 1960ల మధ్యకాలంలో న్యూ సైన్స్ కళాశాలలో బీఎస్సీ, 1970ల ప్రారంభంలో ఓయూ క్యాంపస్‌లో లైబ్రరీ సైన్స్ చదివేటప్పుడు నేను తరచుగా ఓయూ బి–హాస్టల్‌కు వెళ్ళేవాడిని. ఈ హాస్టల్ గురించి నెహ్రూ ఒకప్పడు ఎంతో ఆసక్తికరంగా ప్రస్తావించారు. విద్యార్థుల ఉత్సాహాన్ని అభినందిస్తూ, భవిష్యత్ భారత నాయకులు ఇక్కడ నుంచే తయారవుతారని చెప్పారు. బి–హాస్టల్‌ను బ్రిటన్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌తో పోల్చారు. ఓయూ ఎ–హాస్టల్ కూడా సామాజిక–రాజకీయ చర్చలకు కీలక వేదికగా నిలిచింది. తొలి, మలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలతో పాటు, జాతీయ స్థాయిలో జరిగిన అనేక ఉద్యమాల్లో ఇక్కడి విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థి నాయకత్వం, ఉద్యమాలు, ప్రగతిశీల ఆలోచనల కేంద్రంగా మారిన ఈ హాస్టల్ ప్రాంతీయ, జాతీయ రాజకీయాలపై దీర్ఘకాల ప్రభావం చూపింది. ఈ రెండు హాస్టళ్లలో వెల్లువెత్తిన వామపక్ష, అతివాద, మితవాద, మధ్యేవాద రాజకీయ సిద్ధాంతాలు విద్యార్థి సంఘాల ఎన్నికలను ప్రభావితం చేశాయి. విశ్వవిద్యాలయ విద్యార్థి రాజకీయాలు సిద్ధాంతాల ప్రాతిపదికగా, మేధోపరంగా తీవ్రంగా సాగేవి. వామపక్ష కమ్యూనిస్టు (ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ) విద్యార్థి సంఘాలు సమాజవాద సిద్ధాంతాలతో అనుసంధానమై సామాజిక న్యాయం, విద్యార్థి హక్కులు, సామ్రాజ్యవాద వ్యతిరేకత వంటి అంశాలను ముందుకు తెచ్చేవి. మరోవైపు ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) అనుబంధ మితవాద విద్యార్థి సంఘం జాతీయవాదం, సాంస్కృతిక పరంపర తదితర విలువలకు మద్దతుగా ఉండేది. విద్యార్థి సంఘాల ఎన్నికలు తరచుగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ – ఏబీవీపీ మధ్య తీవ్ర పోటీతో సాగేవి. ఇవి కేవలం క్యాంపస్ పరిధిలో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పోరాటాల ప్రతిబింబంగా ఉండేవి. ఓయూలో ప్రతిభావంతమైన విద్యార్థి నాయకుడిగా వెలుగొందిన ఎస్. జైపాల్ రెడ్డి సూక్ష్మ రాజకీయ అవగాహన, ఆకర్షణీయమైన ప్రసంగశైలి ద్వారా విద్యార్థి రాజకీయాల్లో గొప్ప శక్తిగా మారాడు.


ఆ తర్వాత భారత రాజకీయాల్లో అగ్రస్థాయికి ఎదిగి కేంద్ర మంత్రిగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదుల పరిరక్షకుడిగా గుర్తింపు పొందాడు. కె. కేశవరావు ఇక్కడి నుంచే మరో ప్రభావశీల విద్యార్థి నాయకుడిగా వెలుగొందాడు. ఆయన రాజకీయ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశలోనే స్పష్టమయ్యాయి. సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన, భారత జాతీయ కాంగ్రెస్‌లో కీలక వ్యూహకర్తగా ఎదిగి, అనంతరం బీఆర్‌ఎస్‌లో ముఖ్య నేతగా మారాడు. రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. ఓయూ విద్యార్థి ఉద్యమస్ఫూర్తి, మేధోసామర్థ్యం రాజకీయాల్లో ఎలా ప్రభావం చూపిస్తుందో వీరి ఎదుగుదల స్పష్టంగా చూపిస్తోంది. ఇక జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీ విప్లవాత్మక చరిత్రలో ఒక సువర్ణాక్షరం. సామాజిక న్యాయంపై ప్రగాఢమైన నమ్మకంతో ఆయన విద్యార్థులను సాధికారత వైపుగా, అసమానతలు, కుల వివక్షలకు వ్యతిరేకంగా ఐక్యం చేశారు. అయితే, ఆయన విప్లవ భావజాలం, విద్యార్థుల్లో పెరిగిన ఆదరణ మితవాద విద్యార్థి సంఘాలకు నచ్చలేదు. ఈ నేపథ్యంలో, 1972 ఏప్రిల్ 14న ఓయూ క్యాంపస్‌లో ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. మరో మేధావి నేతగా నిలిచిన వూటుకూరి వరప్రసాద్ ఒకప్పటి ఆర్ట్స్ కాలేజ్ అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. యువజన నాయకత్వం ఎదుగుదలలో విశేషంగా దోహదపడ్డారు. 86 ఏళ్ల వయసులో ఆధ్యాత్మికవేత్తగా శేషజీవితాన్ని నిరాడంబరంగా గడుపుతున్నారు. ఓయూ రూపొందించిన గౌరవనీయ వ్యక్తుల్లో ప్రొఫెసర్ జి. హరగోపాల్, ప్రొఫెసర్ రాఘవేంద్రరావు, వాసిరెడ్డి శివలింగ ప్రసాద్, డాక్టర్ ఎం. శ్రీధర్ రెడ్డి తదితరులు తమ రంగాల్లో విశేష కృషి చేశారు. ముఖ్యంగా హరగోపాల్ నిస్వార్థ నాయకత్వంతో, నిబద్ధతతో పౌరహక్కుల ఉద్యమంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ప్రొఫెసర్ రాఘవేంద్రరావు సామాజిక శాస్త్రాలలో విశేష ప్రతిభ కలిగిన మేధావిగా (విద్యార్థిగా–అధ్యాపకుడిగా) విశ్వవిద్యాలయంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించారు.


ప్రొఫెసర్ వి.ఎస్ ప్రసాద్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీ పూర్తిచేసి సమాజ శాస్త్రవేత్తగా తన విద్యా జీవితం ప్రారంభించారు. నాలుగు దశాబ్దాలకు పైగా విద్యా రంగంలో వివిధ హోదాల్లో సేవలందించారు. ప్రొఫెసర్‌గా, విద్యా పరిపాలనాధికారిగా, చివరికి వైస్ ఛాన్సలర్ హోదాలో ఆయన విద్యా వ్యవస్థకు విశేషంగా తోడ్పడ్డారు. తెలంగాణ చరిత్రలో ఓ కీలక సమయంలో డాక్టర్ ఎం. శ్రీధర్ రెడ్డి ఆశాజ్యోతిగా నిలిచారు. ఓయూలో విద్యార్థి నాయకుడిగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తొలి దశకు నాంది పలికిన ఘనత ఆయన సొంతం. ఓయూ ఎ–హాస్టల్ నుంచి ఆందోళన జ్వాలలు రేగినప్పుడు, ఆయన ఉద్యమాన్ని ముందుండి నడిపారు. అదే సమయంలో, ఓయూ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న మల్లికార్జున్ కూడా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా ఎదిగారు. విద్యార్థి రాజకీయాలు, నిరసన కార్యక్రమాలు, వాదప్రతివాదాలు నేటి యువతకు, భవిష్యత్ యువతకు అమూల్యమైన పాఠాలను అందిస్తాయి. ఓయూలో ఈ తరతరాల చరిత్ర వ్యక్తిగత, సామాజిక, మేధో విప్లవాలుగా మారిన తీరు స్పష్టమైన సందేశాన్ని అందిస్తోంది. మేధో చర్చలు, రాజకీయ వాదనలు, న్యాయ సంరక్షణకు జరిపిన పోరాటాలు కాలాన్ని దాటి తరతరాలకు గుర్తుండే వారసత్వంగా మారతాయి. వాటిని హ్రస్వ దృష్టితో వీక్షించవద్దు. అలా చేస్తే సమాజం నష్టపోతుంది. ఉస్మానియాలో విద్యార్థి హక్కులను అణచివేసే నేటి ప్రయత్నాలు మాని, చరిత్ర నుంచి పాఠాలను నేర్చుకోవాలి. n వనం జ్వాలానరసింహారావు

Updated Date - Apr 12 , 2025 | 02:05 AM