Share News

Health Tips : బాస్ బాధలు భరించలేకపోతున్నారా?.. ఇలా చేయండి..

ABN , Publish Date - Jan 01 , 2025 | 02:27 PM

ఎంత సంపాదిస్తున్నా ఏదో కోల్పోయామనే వెలితి మిమ్మల్ని వేధిస్తోందా? నిత్యం నిరాశా నిస్పృహలు వెంటాడుతున్నాయా? ఇంట్లో పరిస్థితులు సవ్యంగానే ఉన్నా మానసిక ఒత్తిడికి గురవుతున్నారా? అయితే అందుకు ఇదే కారణం కావచ్చు..

Health Tips : బాస్ బాధలు భరించలేకపోతున్నారా?.. ఇలా చేయండి..
Stress Management Tips

ఎంత సంపాదిస్తున్నా ఏదో కోల్పోయామనే వెలితి మిమ్మల్ని వేధిస్తోందా? నిత్యం నిరాశా నిస్పృహలు వెంటాడుతున్నాయా? ఇంట్లో పరిస్థితులు సవ్యంగానే ఉన్నా మానసిక ఒత్తిడికి గురవుతున్నారా? అయితే అందుకు ఇదే కారణం కావచ్చు. సాధారణంగా ఎవరూ పెద్దగా పట్టించుకోరు గానీ మనం పనిచేసే వాతావరణం మానసిక ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుంది. రోజులో కనీసం 9 గంటలైనా ఆఫీసులో గడుపుతుంటారు ఉద్యోగులు. మొత్తంగా ఇంట్లో కంటే ఆఫీసుకే జీవితంలో ఎక్కువ సమయం వెచ్చిస్తుంటారు. అందుకే చేసే ఉద్యోగంలో సంతృప్తి దొరక్కపోతే అసహనం, చిరాకు పెరిగిపోతూ ఉంటాయి. టార్గెట్ల వెంట పరుగులు పెడుతూ కుటుంబానికి సమయం కేటాయించకపోతే సంబంధాలు దెబ్బతినేందుకు ఆస్కారం ఎక్కువ. అందుకే ఒత్తిడి వాతావరణంలో పనిచేస్తే ఆందోళన పెరిగి ఉద్యోగం చేయాలనే ఆసక్తి సన్నగిల్లుతుంది. ఇది తెలియక బలవంతంగా నచ్చని ఉద్యోగం చేస్తూ పోతే అది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదముంది.


స్ఫూర్తిని దెబ్బతీస్తుంది..

ఆఫీసులో బాస్ పదేపదే పని విషయంలో తిట్టడం, ఒత్తిడితో సమయానికి లక్ష్యాలను పూర్తిచేయలేకపోవడం మీ స్ఫూర్తిని మందగింపజేస్తాయి. సహోద్యోగులు మీ పట్ల చిన్నచూపు చూస్తున్నారనే భావన మీలో బలపడి ఆత్మన్యూనతకు లోనవుతారు. కొన్ని సందర్భాల్లో కొందరు సహోద్యోగులు చాటుగా పక్క వారి గురించి ఎగతాళిగా మాట్లాడుతూ అవహేళన చేస్తుంటారు. ఆ వ్యక్తి మీరే అయితే మానసిక ఒత్తిడితో నిరుత్సాహానికి గురవుతారు. నెగటివ్ ఫీలింగ్ మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మీ సామర్థ్యంపై ప్రశ్న తలెత్తి మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటారు. పనిలో ఏకాగ్రత తగ్గి సమయానికి లక్ష్యాలను పూర్తిచేయలేకపోతారు. దీంతో ఆఫీస్‌కు వెళ్లడాన్ని ఒక కష్టసాధ్యమైన విషయంగా తెలియకుండానే మనసుపై ముద్ర పడిపోతుంది.


బయపడే మార్గముందా?

అచ్చం బ్రేకప్ తర్వాత ఎలా అయితే బాధపడతారో.. మాజీ బాసుల వల్ల ఎదురైన అనుభవాలు మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి అంటున్నారు సైకాలజిస్టులు. బాస్ మారినా పాత జ్ఞాపకాల్లోంచి బయటపడలేక కొందరు వృత్తిగత ఇబ్బందులు పడుతుంటారని చెబుతున్నారు. అయినా, ఇదేమంత పెద్ద సమస్య కాదని... వాస్తవాలను గ్రహించి మీ సామర్థ్యంపై నమ్మకముంచితే తప్పక ఈ సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. చిన్న చిన్న లక్ష్యాలు ఒక్కటొక్కటిగా సాధిస్తూ వెళితే ఈజీగా వృత్తిగత సమస్యలను ఎదుర్కోవచ్చు.


ఈ విషయం గుర్తుంచుకోండి..

మీ బాస్ లేదా సహోద్యోగుల్లో ఎవరైనా మీ ఏకాగ్రతను దెబ్బతీసేలా మీతో ప్రవర్తించినా, మిమ్మల్ని పదిమందిలో తక్కువ చేసి మాట్లాడుతూ కించపరిచినా ఎంత మాత్రం లెక్కచేయవద్దు. మీ సామర్థ్యంపై విశ్వాసముంచితే అదే అందమైన భవిష్యత్తుకు వారధి అవుతుందనే ఒక్క విషయం జ్ఞాపకముంచుకోండి.

Updated Date - Jan 01 , 2025 | 02:47 PM