Share News

BLF: పాక్‌లో మిలిటరీ కాన్వాయ్‌పై దాడి

ABN , Publish Date - Mar 17 , 2025 | 04:59 AM

ఈ దాడిలో 90 మంది వరకు సైనికులు చనిపోయినట్టు ది బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ(బీఎల్‌ఏ) ప్రకటించగా, 11 మంది సైనికులు చనిపోయారని, మరో 20 మందికిపైగా గాయాలపాలయ్యారని అధికారులు చెబుతున్నారు. బలూచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి టఫ్టాన్‌కు 8 బస్సుల కాన్వాయ్‌లో సైనికులు వెళ్తుండగా నోష్కీలో రోడ్డు పక్కన బాంబు దాడి జరిగింది.

BLF: పాక్‌లో మిలిటరీ కాన్వాయ్‌పై దాడి

90 మంది సైనికుల మృతి?

మళ్లీ చెలరేగిన బలూచ్‌ వేర్పాటువాదులు

ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో వరుస దాడులు

కరాచీ, మార్చి 16: పాకిస్థాన్‌లో బలూచ్‌ వేర్పాటువాదులు మరోసారి చెలరేగిపోయారు. ఆదివారం మిలిటరీ కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 90 మంది వరకు సైనికులు చనిపోయినట్టు ది బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ(బీఎల్‌ఏ) ప్రకటించగా, 11 మంది సైనికులు చనిపోయారని, మరో 20 మందికిపైగా గాయాలపాలయ్యారని అధికారులు చెబుతున్నారు. బలూచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి టఫ్టాన్‌కు 8 బస్సుల కాన్వాయ్‌లో సైనికులు వెళ్తుండగా నోష్కీలో రోడ్డు పక్కన బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఒక బస్సు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు పదార్థాలు(ఐఈడీ) నింపిన ఒక వాహనం ఆ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చి ఒక బస్సును ఢీకొందని, అది ఆత్మాహుతి దాడి అని, అలాగే రాకెట్‌ ప్రొపెల్లెడ్‌ గ్రనేడ్లతో మరో బస్సుపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తమ ఫిదాయీ విభాగం మజీద్‌ బ్రిగేడ్‌ ఈ దాడికి పాల్పడినట్టు బీఎల్‌ఏ ప్రకటించింది. కాగా, ఇటీవలి రైలు హైజాక్‌ ఘటన అనంతరం పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో అరడజనుకుపైగా ఉగ్రవాద దాడులు జరిగాయి.

fgj.jpg

శనివారం జరిగిన ఆ ఉగ్ర దాడుల్లో సైనికులు, రైల్వే సిబ్బంది, పౌరులు సహా 31 మంది మరణించారు. ఈ దాడులు తమపనేనని తెహ్రీక్‌-ఐ-తాలిబన్‌ పాకిస్థాన్‌(టీటీపీ) ప్రకటించింది. మరోవైపు రెండు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 9 మంది ఉగ్రవాదులను హతమార్చామని భద్రతా దళాలు శనివారం ప్రకటించాయి.


హఫీజ్‌ సయీద్‌ అనుచరుడు హతం

లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది అబూ ఖతల్‌ శనివారం రాత్రి పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. భారతదేశంలోని జమ్మూకశ్మీర్‌లో అతడు అనేక ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు అతడు ముఖ్య అనుచరుడు. లష్కరే తోయిబా చీఫ్‌ ఆపరేషన్స్‌ కమాండర్‌గా అతడిని సయీద్‌ నియమించాడు. మరోవైపు, ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో నిషేధిత లష్కర్‌-ఐ-ఇస్లాం సంస్థ వ్యవస్థాపకుడు, రాడికల్‌ ఇస్లామిస్ట్‌ బోధకుడు ముఫ్తీ మునీర్‌ షకీర్‌ హతమయ్యాడు. షకీర్‌ లక్ష్యంగా పెషావర్‌ జిల్లాలో ఓ మసీదు ఎదుట దుండగులు ఐఈడీని పేల్చారని పోలీసులు తెలిపారు.

చైనా నుంచి పాక్‌కు రెండో జలాంతర్గామి

అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లతో కూడిన రెండో జలాంతర్గామిని చైనా తన మిత్ర దేశమైన పాకిస్థాన్‌కు అందజేసింది. పాకిస్థాన్‌ రూ.500 కోట్లు వెచ్చించి చైనా నుంచి 8 అత్యాధునిక హ్యాంగర్‌ క్లాస్‌ జలాంతర్గాములను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. వీటిలో నాలుగింటిని బీజింగ్‌లో తయారు చేసి పాక్‌కు పంపేందుకు చైనా అంగీకరించగా, మరో నాలుగింటిని సాంకేతికత బదిలీ ద్వారా కరాచీలో రూపొందించనున్నట్లు పాక్‌ నేవీ వర్గాలు తెలిపాయి. ఒప్పందంలో భాగంగా రెండో జలాంతర్గామిని చైనా తాజాగా పాకిస్థాన్‌కు అందించింది.

హఫీజ్‌ సయీద్‌ కాల్చివేత?

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను గుర్తుతెలియని వ్యక్తి కాల్చి చంపినట్టు పాకిస్థాన్‌లో సోషల్‌ మీడియా పోస్టులు వెల్లువెత్తాయి. పంజాబ్‌ రాష్ట్రంలోని ఝెలుం ప్రాంతంలో అతడు పర్యటిస్తుండగా ఈ దాడి జరిగినట్టు ‘ఎక్స్‌’లో పలువురు వెల్లడించారు. ఈ దాడిలో అతడి అనుచరుడు అబూ ఖతల్‌ సింధీతోపాటు డ్రైవర్‌ కూడా ఘటన స్థలంలోనే చనిపోయినట్టు మరికొన్ని పోస్టులు తెలిపాయి. తీవ్ర గాయాలైన హఫీజ్‌ను రావల్పిండి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారని ‘ఎక్స్‌’లో ఒక వ్యక్తి తెలిపారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2025 | 04:59 AM