Wife Harassment: భార్య వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన బెంగళూరు టెకీ..
ABN , Publish Date - Mar 20 , 2025 | 02:29 PM
బెంగళూరుకు చెందిన టెకీ శ్రీకాంత్‌కు 2022లో ఓ యువతితో వివాహం జరిగింది. కొన్ని రోజులు బాగానే ఉన్న తన భార్య ఆ తర్వాత నుంచి వేధించడం మెుదలు పెట్టిందని బాధితుడు శ్రీకాంత్ తెలిపారు.

బెంగళూరు: భార్య బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు భర్తలు వేధిస్తున్నారంటూ భార్యలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. భార్యలే వేధిస్తున్నారంటూ భర్తలు ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో భార్య వేధింపులు తాళలేక మగవారు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే తాజాగా మరో భార్య బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నానంటూ పోలీసులు ఎదుట ఆవేదన వెల్లగక్కారు.
బెంగళూరుకు చెందిన టెకీ శ్రీకాంత్‌కు 2022లో ఓ యువతితో వివాహం జరిగింది. కొన్ని రోజులు బాగానే ఉన్న తన భార్య ఆ తర్వాత నుంచి వేధించడం మెుదలు పెట్టిందని బాధితుడు శ్రీకాంత్ తెలిపారు. పిల్లలు వద్దని, 60 ఏళ్ల వయసులో ఎవరినైనా దత్తత తీసుకుందామని చెప్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తనతో కలిసి ఉండాలంటే రోజుకు రూ.5,000 ఖర్చుల కోసం ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని వెల్లడించారు. తాను అడిగిన కోర్కెలు తీర్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి, సూసైడ్ నోట్లు రాస్తూ బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నానని, అయితే ఉద్దేశపూర్వకంగానే పెద్దఎత్తున మ్యూజిక్ పెట్టి డాన్సులు చేస్తోందని వెల్లడించారు. భార్య వల్ల పనిపై దృష్టి పెట్టలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని కోల్పోయినట్లు చెప్పారు. మరో ఉద్యోగంలో జాయిన్ అయినా ఇదే విధంగా ప్రవర్తిస్తోందని ఆవేదన వెల్లగక్కారు. ఆమెతో పెళ్లయ్యాక జీవితంలో సంతోషాన్ని కోల్పోయినట్లు తెలిపారు శ్రీకాంత్. విడాకులు ఇద్దామని అనుకుంటే ఏకంగా రూ.45 లక్షలు డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు తన భార్య వేధింపుల నుంచి రక్షించాలని పోలీసులను ఆశ్రయించినట్లు శ్రీకాంత్ వెల్లడించారు.
అయితే శ్రీకాంత్ భార్య వాదన మరోలా ఉంది. ప్రతి రోజూ అతనే తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపించింది. భర్త వేధింపులకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపింది. వాటిని పోలీసులకు సైతం అందిస్తానని పేర్కొంది. ప్రతి రోజూ కొట్టేవాడని, తిట్టేవాడని, అదనపు కోసం డిమాండ్ చేసేవాడని వెల్లడించింది. ఇంట్లో జరిగే ప్రతి క్షణాన్నీ ఫోన్‌లో రికార్డ్ చేసేవాడని, ఆ విషయం తనకు వింతగా ఉండేదని చెప్పుకొచ్చింది. అతని ప్రవర్తనతో విసిగిపోయి వ్యాలీకల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. కాగా, వీరిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Picture Puzzle: మీది నిజంగా హెచ్‌డీ చూపు అయితే.. ఈ గదిలో బ్రష్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనుక్కోండి..
Danish tourists clean sikkim roads: భారతీయ వీధులు శుభ్రం చేసిన విదేశీ టూరిస్టులు!