Share News

India Trade Edge: మనకిదే మంచి తరుణం

ABN , Publish Date - Apr 04 , 2025 | 05:33 AM

భారత్‌పై అమెరికా తక్కువ సుంకాలు విధించడంతో ఇది మనకు పెట్టుబడులు ఆకర్షించే అవకాశం. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ పై అధిక సుంకాలతో, బహుళజాతి కంపెనీలు భారత్ వైపు ఆకర్షితమయ్యే అవకాశం ఉంది

India Trade Edge: మనకిదే మంచి తరుణం

  • భారత్‌తో పోలిస్తే ఆసియాలోని పలు దేశాలపై ట్రంప్‌ అధిక సుంకాలు

  • అక్కణ్నుంచీ తరలివచ్చే ఎంఎన్‌సీలను ఆకర్షించేందుకు మనకు చాన్స్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: ట్రంప్‌ ఆసియాలోని ఇతర దేశాలన్నింటికన్నా భారత్‌పై విధించిన సుంకాలే తక్కువ. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలోనూ ట్రంప్‌ సర్కారు చైనా ఉత్పత్తులపై రెండు విడతలుగా 20 శాతం సుంకం విధించింది. తాజాగా విధించిన 34 శాతంతో చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు 54 శాతానికి చేరతాయి. కంబోడియాపై 49%, వియత్నాంపై 46%, మయన్మార్‌పై 44%, బంగ్లాదేశ్‌పై 37%, థాయ్‌లాండ్‌పై 36%, తైవాన్‌పైన, ఇండోనేసియాపై 32%, పాకిస్థాన్‌పై 29% సుంకాలు విధించారు. జపాన్‌, దక్షిణకొరియా, సింగపూర్‌, మలేసియా తదితర దేశాల సుంకాలు మనకన్నా తక్కువున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సరైన వ్యూహంతో వ్యవహరిస్తే చైనా నుంచి ఇతర దేశాలకు తరలి రావాలనుకునే బహుళజాతి కంపెనీలను (ఎంఎన్‌సీ) భారత్‌కు ఆకర్షించేందుకు ఎంతో ఉపకరిస్తుందని భావిస్తున్నారు. గ్లోబల్‌ ట్రేడ్‌ రిసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) నివేదిక ప్రకారం భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో ఆసియాలోని ఇతర దేశాలతో సమానంగా 25శాతం సుంకాలు పడేది.. స్టీలు, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌ ఉత్పత్తులపైనే. భారత్‌ నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో అత్యధికం.. ఫార్మా ఉత్పత్తులు. తాజా పెంపులో ట్రంప్‌ వాటిని మినహాయించారు. మిగిలిన ఉత్పత్తులపై 27% సుంకాలు పడతాయి. వాటి విషయంలో ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే మనమే మెరుగైన స్థితిలో ఉన్నందున ప్రభుత్వం మేకిన్‌ ఇండియాకు ఊతమిస్తే అమెరికాకు మన ఎగుమతుల వాటాను గణనీయం గా పెంచుకోవచ్చని జీటీఆర్‌ఐ నివేదికలో అభిప్రాయపడింది. టెక్స్‌టైల్‌ రంగంలో మనకు పోటీగా ఉన్న చైనా, బంగ్లాదేశ్‌పై సుంకాలభారం భారీగా పెరిగింది.


ప్రస్తుతం ఈ దేశాల్లోని గ్లోబల్‌ బ్రాండ్లు తమ ఉత్పత్తిని భారత్‌కు తరలించే ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్‌ రంగాల్లోనూ భారత్‌కు ప్రధాన పోటీదారులైన వియత్నాం, థాయ్‌లాండ్‌పై విధించిన సుంకాలు.. భారత్‌పై విధించిన సుంకాల కన్నా ఎక్కువ. ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌ స్కీమ్‌ వంటి వాటితో భారత్‌లో ఇప్పటికే యాపిల్‌, శాంసంగ్‌ వంటివి పెట్టుబడులుపెట్టాయి. ఇప్పుడీ సుంకాల ప్రయోజనాన్నీ అందుకుంటే మన ఎలక్ట్రానిక్స్‌ సప్లై చైన్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు. అమెరికాకు యంత్రాలు, ఆటోమొబైల్‌ విడిభాగాలు, బొమ్మల ఎగుమతుల్లో ప్రస్తుతం చైనా, థాయ్‌ ముందున్నాయి. ఇప్పుడీ అవకాశాన్ని సరిగ్గా వాడుకోగలిగితే ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించవచ్చని జీటీఆర్‌ఐ పేర్కొంది.


ఇది కూడా చదవండి:

ఉద్యోగుల కొంప ముంచిన ఏఐ.. ఆ కంపెనీలో వందల జాబ్స్ హుష్ కాకి

సిగరెట్‌ లేదన్నాడని.. ఎంతపని చేశాడో తెలిస్తే..

Updated Date - Apr 04 , 2025 | 05:33 AM