Tariff Shockwaves: 26 కాదు.. 27 శాతం
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:54 AM
ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై ప్రభంజనం సృష్టిస్తోంది. ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు లభించినప్పటికీ ఆటో, టెక్స్‌టైల్ రంగాలపై భారత్‌కు మిశ్రమ ప్రభావం ఉంటుంది

భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం
అన్ని దేశాలపైనా కనీసం 10 శాతం టారిఫ్.. విదేశీ ఆటోమొబైల్స్ ఉత్పత్తులపై 25%
ఫార్మా, సెమీకండక్టర్స్, ఇంధన రంగాలకు సంబంధించిన ఉత్పత్తులకు మినహాయింపు
అమెరికా పన్నుచెల్లింపుదార్లు 50 ఏళ్లుగా దోపిడీకి గురయ్యారు.. ఇకపై అలా కుదరదు
మా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై అందులో సగమే వేస్తున్నాం: ట్రంప్
భారత్‌పై సుంకాల ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం: కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటన
ట్రంప్ ప్రకటనతో అమెరికా మార్కెట్ల క్రాష్.. రూ.లక్షల కోట్ల మేర ఆవిరైన సొమ్ము
వాషింగ్టన్, ఏప్రిల్ 3: తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ప్రతి దేశంపైనా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ప్రతీకార సుంకాల’ కత్తిదూశారు! తమపై 52 శాతం సుంకాలు విధిస్తున్న భారతదేశంపై తాము అందులో సగం, అంటే 26 శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఆ తర్వాత వైట్‌హౌస్ వర్గాలు విడుదల చేసిన పత్రాల్లో.. భారత్‌పై విధించే సుంకం 27 శాతంగా పేర్కొనడం గమనార్హం. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వైట్‌హౌస్‌లోని రోజ్‌గార్డెన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ సుంకాల ప్రకటన చేశారు. ‘‘అమెరికన్ ప్రజలారా.. ఇది (ఏప్రిల్ 2) మీరు చాలాకాలంగా ఎదురుచూస్తున్న విముక్తి దినం. అమెరికన్ పరిశ్రమలు పునర్జన్మించిన రోజుగా, మన భవితవ్యాన్ని మనం పొందిన రోజుగా, అమెరికాను మళ్లీ సుసంపన్నదేశంగా మార్చే ప్రక్రియను మొదలుపెట్టినరోజుగా చరిత్రలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది.’’ అంటూ మొదలుపెట్టి వివిధ దేశాలు అమెరికాపై ఎంతెంత సుంకాలు విధిస్తున్నదీ వివరించారు. అమెరికాతో వాణిజ్యసంబంధాలున్న అన్ని దేశాలపైనా కనిష్ఠంగా 10 శాతం సుంకం విధించిన ట్రంప్.. తమపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై 10 శాతానికి మించి టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించారు. చైనాపై 34% (ఇప్పటికే విధించిన 20 శాతంతో కలిపి మొత్తం 54 శాతం), యూరోపియన్ యూనియన్ దేశాలపై 20 శాతం, వియత్నాంపై 46%, థాయ్‌ల్యాండ్‌పై 36%, కంబోడియాపై 49%, తైవాన్‌పై 32%, జపాన్‌పై 24%, బంగ్లాదేశ్‌పై 37%, పాకిస్థాన్‌పై 29%, శ్రీలంకపై 44%.. ఇలా పలు దేశాలపై భారీగా సుంకాలు విధిస్తున్నట్టు వెల్లడించారు.
ఇన్నాళ్లుగా అధిక సుంకాలతో చాలా దేశాలు అమెరికాను దోచుకున్నాయని ఆరోపించారు. కానీ తాము మాత్రం చాలా దయగా వ్యవహరిస్తున్నామని.. ఆయా దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో సగం మాత్రమే విధిస్తున్నామని పేర్కొన్నారు. అమెరికా పన్నుచెల్లింపుదారులు 50 ఏళ్లకు పైగా ఈ దోపిడీకి గురయ్యారని, ఇకపై అలా జరగదని.. ఇన్నాళ్లుగా జరుగుతున్న ఈ అన్యాయానికి అడ్డుకట్ట వేసి, అమెరికా ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చేందుకే ఈ సుంకాలను విధిస్తున్నట్టు ఆయన తెలిపారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని కార్లపైనా 25 శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఫార్మా, సెమీకండక్టర్లు, ఇంధన రంగాలకు సంబంధించిన ఉత్పత్తులను పూర్తిగా మినహాయించారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం (ఏప్రిల్ 5) అర్ధరాత్రి 12.01 గంటల నుంచి బేస్‌లైన్ సుంకం 10% అమల్లోకి వస్తుందని, ఆ తర్వాత దేశాలవారీగా విధించిన అదనపు సుంకాలు ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచీ అమలవుతాయని వైట్‌హౌస్ వర్గాలు వివరించాయి. అమెరికాకు అధికంగా ఎగుమతులు చేస్తూ, అక్కడి ఉత్పత్తులను తక్కువగా దిగుమతి చేసుకునే దేశాలపై ప్రభావం భారీగా ఉండేలా అమెరికా ఈ సుంకాలను విధించినట్టు ఆర్థిక నిపుణులు వెల్లడించారు.
స్నేహితుడేగానీ..
తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఒక్కొక్క దేశం గురించి చెబుతూ వచ్చిన ట్రంప్.. ఇండియా పేరు రాగానే మోదీ గురించి ప్రస్తావించారు. భారత ప్రధాని (మోదీ) తనకు గొప్ప స్నేహితుడేగానీ.. భారత్ అమెరికాతో సరిగ్గా వ్యవహరించట్లేదని, ఇదే విషయాన్ని తాను మోదీతో కూడా చెప్పానని వెల్లడించారు. భారత్ తమపై 52 శాతం సుంకాలు విధిస్తోందని.. కానీ, అమెరికా కొన్ని దశాబ్దాలుగా భారత్ ఉత్పత్తులపై పెద్దగా సుంకాలే విధించట్లేదని పేర్కొన్నారు. భారత్‌పై ట్రంప్ ప్రకటించిన 26 శాతం సుంకం.. మొత్తం భారత ఉత్పత్తులపై విధించే సగటు టారిఫ్. ప్రత్యేకంగా ఏ రంగంపై/ఏ ఉత్పత్తులపై ఎంత సుంకం విధించేదీ వివరాలు తెలపలేదు. కాగా.. ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావం ఎంతమేరకు ఉంటుందనే అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర వాణిజ్యశాఖ, ఆర్థిక శాఖ వెల్లడించాయి. దీనిపై దేశీ పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర భాగస్వాములందరితో చర్చలు జరుపుతున్నామని వాణిజ్య శాఖ ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల నిమిత్తం అమెరికాతో కలిసి సన్నిహితంగా పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఇక.. ట్రంప్‌కు అమెరికా ముఖ్యమైతే, ప్రధాని మోదీ ప్రథమ ప్రాధాన్యం భారతదేశమేనని, ఈ నేపథ్యంలో సుంకాల ప్రభావాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తున్నామని కేంద్ర మంత్రి పంకజ్ చౌధరి తెలిపారు.
భారత్‌పై మిశ్రమ ప్రభావం
ట్రంప్ తన సుంకాల నుంచి పార్మా రంగాన్ని మినహాయించడం భారత్‌కు పెద్ద ఊరట. ఎందుకంటే మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో దాదాపు మూడోవంతు వాటా ఫార్మా రంగానిదే! అమెరికాకు అవసరమైన జనరిక్ ఔషధాల్లో 40 శాతం మనదేశం నుంచే ఎగుమతి అవుతాయి. ఆ ఉత్పత్తుల విలువ ఏకంగా 8.7 బిలియన్ డాలర్లు. అంటే దాదాపుగా రూ.75 వేల కోట్లకు పైమాటే. ఈ రంగాన్ని మినహాయించడమంటే మన ఎగుమతుల్లో మూడో వంతుపై ఎలాంటి సుంకాలూ లేనట్టే. తర్వాతి స్థానంలో రత్నాలు, ఆభరణాలు ఉంటాయి. అమెరికాకు మన ఎగుమతుల్లో దాదాపు 30% దాకా ఈ రత్నాలు, ఆభరణాలు ఉంటాయి. వీటిపై సుంకాలు పెంచినా.. వాటి విలువ ఎప్పటికప్పుడు పెరిగేదే కాబట్టి, ఎగుమతులు తగ్గినా ఆదాయం గణనీయంగా తగ్గకపోవచ్చని అంచనా. అయితే, ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరించి ఈ రంగంలో అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక.. ఆటోమొబైల్స్ విడిభాగాలపై ట్రంప్ విధించిన సుంకాల భారం మాత్రం భారత్‌పై బాగానే ప్రభావం చూపించవచ్చనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. అమెరికాకు మన ఎగుమతుల్లో 16 శాతం.. ఆటోమొబైల్ ఉత్పత్తులదే. ఏటా సగటున దాదాపు రూ.21 వేల కోట్ల విలువైన కార్ల విడిభాగాలు మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతాయి. అలాగే అమెరికాకు మన ఎగుమతుల్లో 7% వాటా టెక్స్‌టైల్స్ రంగానిది. ఏటా దాదాపు రూ.42 వేల కోట్ల విలువైన టెక్స్‌టైల్ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతాయి. తాజా సుంకాలతో ఈ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. కానీ.. ఈ రంగంలో మనకు పోటీ బంగ్లాదేశ్, వియత్నాం. వాటిలో వియత్నాంపై 46%, బంగ్లాదేశ్‌పై 37% సుంకాలను ట్రంప్ విధించారు. ఫలితంగా ఆయా దేశాల కంటే మన ఉత్పత్తులే చౌకగా అమెరికన్లకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మన టెక్స్‌టైల్ ఎగుమతులు పెరిగే అవకాశమే ఉంటుంది తప్ప తగ్గవు.
మొత్తమ్మీద.. తాజా సుంకాల ప్రభావం భారత్‌పై మిశ్రమంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
రష్యాకు ఎందుకు వదిలేశారు?
అమెరికాతో వాణిజ్య బంధం ఉన్న అన్ని దేశాలపైనా సుంకాల పెంపును ప్రకటించిన ట్రంప్.. ఆ జాబితాలో రష్యా, ఉత్తరకొరియా, క్యూబా, మెక్సికో, కెనడా, బెలారస్ దేశాలను మాత్రం చేర్చలేదు. దీనికి కారణమేంటి? అంటే.. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా, బెలార్‌సపై ఇప్పటికే పలు ఆంక్షలు విధించామని, ఆ దేశంతో వాణిజ్యం చాలా తక్కువగా ఉందని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చెప్పారు. అందుకే రష్యాను ఈ జాబితాలో చేర్చలేదన్నారు. అయితే.. ఉక్రెయిన్‌లో అరుదైన నిక్షేపాలను సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్న ట్రంప్, అందుకు పుతిన్ సహకారం తీసుకునే యోచనలో ఉన్నారు కాబట్టే రష్యాపై సుంకాలు విధించలేదనే వాదన కూడా వినపడుతోంది. ఇక.. కెనడా, మెక్సికో దేశాలపై ట్రంప్ ఇప్పటికే 25% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఉత్తరకొరియా, క్యూబా దేశాలపై ఇప్పటికే పలు ఆంక్షలున్నందున వాటిపైనా సుంకాలు విధించలేదని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
14 దేశాల సుంకాల్లో తేడాలు!
భారతదేశంపై 26% సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించగా... ఆ తర్వాత వైట్‌హౌస్ దీనికి సంబంధించి విడుదల చేసిన అనుబంధ పత్రంలో మాత్రం 27% సుంకం విధించనున్నట్టు ఉంది. ఒక్క భారత్ విషయంలోనే కాక.. మరో 13 దేశాల విషయంలోనూ ఈ తేడా కనిపించింది. ఉదాహరణకు.. దక్షిణకొరియాపై 25% సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించగా వైట్‌హౌస్ అనెక్సర్‌లో అది 26 శాతంగా ఉంది. ఇదే తరహాలో బోట్సువానా, కామెరూన్, మలావీ, నికరాగువా, నార్వే, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, సెర్బియా, దక్షిణాఫ్రికా, థాయ్‌ల్యాండ్, వనువాటు, ఫాక్‌లాండ్ ఐలండ్స్‌పై సుంకాల్లో ఈ తేడాలు కనిపించాయి. అలాగే.. వివిధ దేశాల ఆధీనంలో ఉన్న భూభాగాలపై విధించే సుంకాలను కూడా తొలుత వైట్‌హౌస్ తమ చార్టుల్లో పొందుపరచింది. కానీ, తర్వాత విడుదల చేసిన అనెక్సర్‌లో ఆ భూభాగాల వివరాలే లేకపోవడం గమనార్హం.
Read Also: Trump Tariffs: ట్రంప్ దెబ్బ.. భారీగా పెరగనున్న వీటి ధరలు
India vs Pakistan Army: ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే.. ఎవరిది గెలుపు.. బలాబలాలు, బలహీనతలు ఇవే..
Earth Poles Video: భూభాగం అంతరించిపోతుందా.. మస్క్ వీడియో నిజమేనా

బట్టలు కుడుతున్న ట్రంప్, ఫోన్ల పరిశ్రమలో మస్క్..వీడియోలు వైరల్

భారీగా పెరిగిన సిలిండర్ ధర.. ఎలా బతకాలి

ఈ దేశంపై ట్రంప్ సుంకాల రేటు 145 శాతం..మరోవైపు ఆ దేశం తగ్గేదేలే అంటూ..

నదిలో కూలిన హెలికాప్టర్..సీఈఓ ఫ్యామిలీ సహా ఆరుగురు మృతి ..

యూదు వ్యతిరేక పోస్టులు పెడితే.. వీసా రద్దు!
