Manoj Kumar: బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు, నటుడు కన్నుమూత
ABN , Publish Date - Apr 04 , 2025 | 08:03 AM
Manoj Kumar: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు మనోజ్‌కుమార్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతితో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు అభిమానులు, చిత్ర ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.

ముంబై: బాలీవుడ్ నటుడు డైరెక్టర్ మనోజ్ కుమార్ (87) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యలు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన నటుడిగా, డైరెక్టర్‌గా అనేక చిత్రాలు నిర్మించారు. ఉపకార్, రోటీ కపడా ఔర్ మకాన్, జైహింద్ సినిమాలకు మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఎక్కువుగా దేశభక్తి చిత్రాలను రూపొందించడంతో ఆయనను భారత్ కుమార్‌గా పిలిచేవారు. విలక్షణ నటుడిగా ఆయనకు పేరుంది. బాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. మనోజ్ కుమార్ మృతితో భారతీయ సినిమా ఒక యుగాన్ని కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.
సినీ ప్రస్థానం
మనోజ్ కుమార్ పూర్తిపేరు హరికృష్ణ గిరి గోస్వామి. ఆయన 1937 జులై 24వ తేదీన అబాటాబాద్ (ప్రస్తుతం పాకిస్తాన్)లో జన్మించారు. 1947 దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది. 1957లో ఫ్యాషన్ చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. హరియాలీ ఔర్ రాస్తా (1962), షహీద్ (1965) వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. 1967లో విడుదలైన ఉప్కార్ చిత్రంతో ఆయనకు భారత్ కుమార్ అనే బిరుదు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఎక్కువుగా దేశభక్తి ఆధారిత చిత్రాలకు మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు.
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
మనోజ్ కుమార్ సినీ పరిశ్రమలో అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను 1992లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2016లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనను వరించింది. దేశభక్తి చిత్రాల ద్వారా యువతలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు మనోజ్ కుమార్ ప్రయత్నించారు. మేరే దేశ్ కీ దర్తీ వంటి పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాయి. మనోజ్ కుమార్ తమకు స్ఫూర్తి ప్రధాత అని చిత్రపరిశ్రమలో ఆయన సహచరుడైన దర్శకుడు అశోక్ పండిత్ పేర్కొన్నారు. మనోజ్ కుమార్ మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటుగా పేర్కొన్నారు.
ప్రముఖుల సంతాపం
మనోజ్ కుమార్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు మనోజ్ కుమార్ మృతి తీరనిలోటని పేర్కొన్నారు. మనోజ్ కుమార్ చిత్రాలు భారతీయ విలువలు, సంస్కృతిని ప్రపంచానికి చాటాయని మోదీ ఎక్స్‌లో తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ తెలిపారు. మనోజ్ కుమార్ వారసత్వం ఎప్పటికీ ఉంటుందని, దేవభక్తి చిత్రాల్లో ఆయన తమకు స్ఫూర్తి అని నటుడు అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Fighter Jet Crash: అయ్యో పాపం.. పది రోజుల క్రితమే నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి.. ఇంతలోనే
EPF Withdrawal Simplified: ఈపీఎఫ్ విత్‌డ్రా మరింత సులువు
సనోజ్ మిశ్రాపై రేప్ కేసు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నటి
ఉదయం పరగడుపున ఈ వాటర్ తాగితే ఆరోగ్యం..
Read Latest Telugu News and National News