Manmohan Singh Fellowship: రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు ఫెలోషిప్
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:33 AM
కొత్త తరానికి రాజకీయ నాయకులను తయారుచేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ పేరిట ఫెలోషిప్ ప్రారంభించింది. ఈ ఫెలోషిప్‌లో ఎంపికైన నిపుణులకు రాహుల్ గాంధీ, శశిథరూర్ వంటి ప్రముఖులు మెంటార్లుగా మారనున్నారు.

మన్మోహన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యక్రమం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: కొత్త తరం రాజకీయనాయకులను తయారుచేసే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఒక ఫెలోషిప్ ప్రొగ్రాం ప్రారంభించింది. వివిధ వృత్తిపరమైన నేపథ్యాల నుంచి వచ్చిన 50 మంది నిపుణులను ప్రతిభావంతులైన ప్యానెల్ ఓ ప్రత్యేకమైన పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. వారికి రాహుల్ గాంధీ, శశిథరూర్, అజయ్ మాకెన్ వంటి ప్రముఖులు మెంటార్స్‌గా వ్యవహరిస్తారని ఏఐసీసీ తెలిపింది. ఆధునిక, ప్రగతిశీల భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని పేర్కొంది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ నేతలు ప్రవీణ్ చక్రవర్తి, కొప్పుల రాజు ఈ ఫెలోషిప్ వివరాలను వెల్లడించారు. ఫెలోషిప్ దరఖాస్తుకు విద్యార్హతలేమీ అవసరం లేదని, కానీ అభ్యర్థులకు ఏదో ఒక వృత్తిలో 10 ఏళ్ల అనుభవం ఉండాలని ఆయన పేర్కొన్నారు.