Global Combat Air Programme: ఆరో తరం ఫైటర్ జెట్‌పై భారత్ దృష్టి
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:38 AM
ఆరో తరం ఫైటర్ జెట్‌ల అభివృద్ధి కోసం యూకే, జపాన్, ఇటలీ చేపట్టిన గ్లోబల్ కాంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్‌లో భారత్ చేరేందుకు ఆసక్తి చూపిస్తోంది. అయితే రష్యాతో భారత్ ఉన్న బలమైన సంబంధాల కారణంగా జపాన్ భారత్‌ను చేర్చుకునే విషయంలో తడబడుతోంది.

జపాన్, యూకే, ఇటలీ సంయుక్త ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తి
భారత్ నుంచి రష్యాకు రహస్యాలు వెళ్తాయని జపాన్ అనుమానం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: అత్యాధునిక ఆరో తరం ఫైటర్ జెట్‌ల అభివృద్ధిపై భారత్ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి యునైటెడ్ కింగ్‌డమ్(యూకే), జపాన్, ఇటలీ సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్లోబల్ కాంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ (జీసీఏపీ) ప్రాజెక్టులో చేరేందుకు భారత్ ఆసక్తి చూపిస్తోంది. కానీ, రక్షణ రంగంలో భారత్, రష్యా మధ్య ఉన్న బలమైన బంధం నేపథ్యంలో జీసీఏపీలో భారత్‌ను చేర్చుకునే అంశంలో జపాన్ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. జపాన్ మీడియాలో ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి. ఆరో తరం ఫైటర్ జెట్‌లను కలిసి అభివృద్ధి చేసేందుకు యూకే, జపాన్, ఇటలీ.. 2022 డిసెంబరులో జీసీఏపీ ప్రాజెక్టును చేపట్టాయి. 2035 నాటికి అత్యాధునిక ఫైటర్ జెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలనేది లక్ష్యం. అడ్వాన్స్‌డ్ స్టెల్థ్(రాడార్లకు చిక్కకుండా ప్రయాణించే సామర్థ్యం), అడ్వాన్స్‌డ్ వార్‌ఫేర్ వ్యవస్థ వంటి సామర్థ్యాలతోపాటు ఏఐ అనుసంధానంతో పని చేసే అత్యాధునిక ఆరో తరం ఫైటర్‌జెట్‌లను భవిష్యత్తు అవసరాల కోసం జపాన్, యూకే, ఇటలీ అభివృద్ధి చేస్తున్నాయి. జపాన్ తమ మిత్సుబుషి ఎఫ్-2ఫ్లీట్, యూకే తమ యూరో ఫైటర్ టైపూన్‌ల స్థానంలో ఈ ఫైటర్ జెట్లను ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి
Read Latest and International News