Share News

Udta Kerala: కేరళ ప్రభుత్వానికి సవాల్‌గా మారిన మరో మహమ్మారి.. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కగలదా..

ABN , Publish Date - Mar 09 , 2025 | 05:03 PM

Udta Kerala:చరిత్రలో ఎన్నో పెద్ద సంక్షోభాలకు విజయవంతంగా అడ్డుకట్ట వేయగలిగిన కేరళ రాష్ట్రం ముంగిట మరో కొత్త సవాల్ నిలిచింది. ఇప్పుడు ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రాన్ని మించిపోయింది కేరళ. ఇది కేరళ ప్రజల భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారింది. ఇది దక్షిణాదిలోని పక్క రాష్ట్రాల వారికి..

Udta Kerala: కేరళ ప్రభుత్వానికి సవాల్‌గా మారిన మరో మహమ్మారి.. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కగలదా..
Kerala Drugs Narcotic Cases

Kerala Narcotic Cases : ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం పెరిగినప్పటికీ కేరళ రాష్ట్రంలోకి వీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేసింది. ఇదొక్కటే కాదు, నిఫా లాంటి ప్రాణాంతక వైరస్‌నూ వ్యాప్తి చెందకుండా నిరోధించగలిగిన కేరళను డ్రగ్స్ మాఫియా కమ్మేసింది. అదీ ఎంతలా అంటే..ఈ దక్షిణాది రాష్ట్రం ఇప్పుడు పంజాబ్ కంటే దారుణంగా మాదకద్రవ్యాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గాడ్స్ ఓన్ కంట్రీలో దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా మాదకద్రవ్యాల హింసలో భయంకరమైన పెరుగుదల నమోదైంది. ఇప్పుడు సింథటిక్ మాదకద్రవ్యాలు కేరళ పాఠశాలల్లోకి చొచ్చుకుపోయి భావితరాల బతుకును నాశనం చేస్తున్నాయి.


4 ఏళ్లలో 330% పెరిగిన కేసులు..

కేరళలో మాదకద్రవ్యాల వినియోగం భయంకర స్థాయికి చేరుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా మత్తు పదార్థాల ప్రభావం పెరిగిపోతూ.. ఇప్పుడు రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు, ఇళ్లు..ఇలా అందరికీ ప్రాణహానిగా మారింది. 2024లో కేరళలో 24,517 మాదకద్రవ్య కేసులు నమోదవగా, 2025 మొదటి నెలలోనే 2,000 కేసులు వచ్చాయి. గత నాలుగేళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. 93,599 మందిని అరెస్ట్ చేశారు. ఇది కేరళ చరిత్రలోనే అతి పెద్ద డ్రగ్ సంక్షోభంగా మారింది. డ్రగ్స్ ప్రభావం తీవ్రంగా ఉండే పంజాబ్ కంటే ఎక్కువ కేసులు కేరళలో నమోదవడం దక్షిణాది రాష్ట్రాలను కలవరపెడుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో మాదకద్రవ్యాలపై ప్రత్యేకంగా చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ వీ.జి. అరుణ్ మాట్లాడుతూ 2021 నుండి 2024 మధ్య డ్రగ్ కేసుల సంఖ్య 330% పెరిగిందని.. గంజాయికి బదులు సింథటిక్ డ్రగ్స్—ముఖ్యంగా MDMA,మెత్ వంటి పదార్థాల వినియోగం విపరీతంగా పెరిగాయని అన్నారు.


డ్రగ్స్ మత్తులో తల్లినే చంపారు..

డ్రగ్స్ వాడకంతో మానవ సంబంధాలు తారుమారవుతున్నాయి. ఇటీవల కాలంలో తల్లిదండ్రులను హత్య చేసిన సంఘటనలు కలచివేస్తున్నాయి. కోజికోడ్ జిల్లాలో ఓ యువకుడు తన తల్లిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. "నాకు జన్మనిచ్చినందుకు శిక్ష వేశాను" అని పోలీసులు చెప్పిన మాటలు అందరినీ భయాందోళనకు గురిచేశాయి. మరో సంఘటనలో 25 ఏళ్ల వ్యక్తి తన తల్లికి గొంతు కోసి చంపాడు. మత్తులో ఉన్న కొంత మంది పిల్లలు తల్లిదండ్రులను డబ్బుల కోసం హింసిస్తుండటంతో.. తల్లిదండ్రులే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.


డ్రగ్స్ హబ్‌లుగా విద్యాలయాలు..

పాఠశాలలు, కళాశాలలు డ్రగ్స్ హబ్‌లుగా మారిపోతున్నాయి. విద్యార్థులు గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. కొంత మంది ఉపాధ్యాయులను బెదిరించే స్థాయికి చేరుకున్నారు. ఇటీవల ఒక హైస్కూల్ విద్యార్థుల బృందం పొరపాటున ఎక్సైజ్ కార్యాలయంలోకి వెళ్లి గంజాయి బీడీ తాగడానికి మ్యాచ్ అడిగిన ఘటన అధికారులు షాక్‌కు గురి చేసింది. దీంతో తల్లిదండ్రులు పిల్లలపై గట్టి నిఘా పెట్టేందుకు డ్రగ్ టెస్ట్ కిట్స్ కొనుగోలు చేస్తున్నారు.


సూపర్ బైక్స్‌లో డెలివరీ..

డ్రగ్ సరఫరా విస్తృతంగా విరుచుకుపడుతోంది. బెంగళూరు, చెన్నై డ్రగ్ మార్కెట్‌లుగా మారాయి. అంతర్జాతీయంగా, జర్మనీ, థాయిలాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి డ్రగ్స్ కేరళకు చేరుతున్నాయి. డార్క్ వెబ్, క్రిప్టోకరెన్సీ ద్వారా లావాదేవీలు జరుగుతుండటంతో పోలీసులు కనీసం సరైన ఆధారాలు కూడా సేకరించలేకపోతున్నారు. ఇంటర్నెట్ ద్వారా ఆర్డర్ ఇచ్చి QR కోడ్ ద్వారా డబ్బులు చెల్లించి సూపర్ బైక్స్ ద్వారా కొంత మంది విపరీత వేగంతో డ్రగ్స్ డెలివరీ చేస్తున్నారు.


ఈ పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కలసి విస్తృత ఆపరేషన్లు చేయాలని.. విద్యార్థులకు సరైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు కేవలం కేసులు తగ్గించడంపైనే కాకుండా మాదకద్రవ్య వినియోగం పూర్తిగా తగ్గేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే సమాజం మరింత నాశనానికి గురికావడం ఖాయం.


Read Also : Tariff Cuts: ట్రంప్‌కు భయపడి కాదు.. ఇందువల్లే టారిఫ్‌లు తగ్గించాం.. భారత ప్రభుత్వం..

Delimitaion: పార్లమెంటును తాకనున్న డీలిమిటేషన్ సెగ .. డీఎంకే ఎంపీలు తీర్మానం

MK Stalin meet MPs: పార్లమెంట్ సమావేశాల వేళ డీఎంకే ఎంపీలతో స్టాలిన్ అత్యవసర భేటీ.. ఆ అంశాలపై దిశానిర్దేశం..

Updated Date - Mar 09 , 2025 | 05:07 PM