Share News

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో.. 5.5కోట్ల మంది పుణ్యస్నానాలు

ABN , Publish Date - Jan 15 , 2025 | 10:01 AM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో సంగం నది ఒడ్డున నిర్వహించబడుతున్న మహా కుంభమేళాలో ఈరోజు మూడవ రోజు. ఇప్పటి వరకూ 5.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు..

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో.. 5.5కోట్ల మంది పుణ్యస్నానాలు
Maha Kumba Mela 2025

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో సంగం నది ఒడ్డున నిర్వహించబడుతున్న మహా కుంభమేళాలో ఈరోజు మూడవ రోజు. జనవరి 13 నుండి ప్రారంభమైన మహా కుంభమేళాలో ప్రతిరోజూ కోట్లాది మంది త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచే వివిధ అఖాడాల నుంచి సాధువులు వేలాదిగా తరలివచ్చారు. తొలి రోజున 1.75 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేయగా.. సంక్రాంతి ఒక్కరోజునే మొత్తం 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేశారు. రెండు రోజుల్లోనే 5.5 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన కుంభమేళా కావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు భారీగా తరలివస్తున్నారు. 45 రోజుల పాటు జరగనున్న మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది.


వణికించే చలిని, దట్టమైన పొగమంచునీ లెక్కచేయకుండా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు మూడోరోజున పెద్ద ఎత్తున హాజరయ్యారు భక్తులు. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా బ్రహ్మముహూర్తంలో "అమృత స్నానం" కోసం తెల్లవారుజామున 3 గంటల సమయంలోనే లక్షలాదిగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తారు. ముందుగా శంభు పంచాయతీ అటల్‌ అఖాడా, పంచాయతీ అఖాడా మహానిర్వాణీకి చెందిన సాధువులు అమృత స్నానాలు ఆచరించారు. తర్వాత వివిధ అఖాడాల నుంచి ఊరేగింపుగా తరలివచ్చిన సాధువులు, నాగసాధువులు, అఘోరాలు పవిత్ర స్నానాలు చేశారు.


మహాకుంభంలో అమృత స్నానం ప్రాముఖ్యత

మహాకుంభ సమయంలో చేసే అమృత స్నానాలు ప్రత్యేక తేదీల్లో చేస్తారు. ఈ ప్రత్యేక తేదీలు గ్రహాల కదలిక, ప్రత్యేక స్థానం ఆధారంగా నిర్ణయించబడతాయి. మహాకుంభ సమయంలో ఎవరైతే అమృతంలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ నశించి పుణ్యఫలితాలను పొందుతారు. ఈ సమయంలో అమృతంతో స్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుంది ప్రతీతి.


45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26 వరకూ జరగనున్న మహా కుంభమేళాలో మొత్తం 6 పుణ్యస్నానాలు ఉంటాయి. వాటిలో మూడు అమృత స్నానాలు. వీటిని షాహీ స్నాన్ అని వ్యవహరిస్తారు.

మహా కుంభమేళా 2025 అమృత స్నానం తేదీలు

1. మొదటి రాజ స్నానం జనవరి 13న పుష్య పూర్ణిమ నాడు. ఇప్పటికే ముగిసింది.

2. రెండవది జనవరి 14 మకర సంక్రాంతి. ఇప్పటికే ముగిసింది.

3. మూడవది మౌని అమావాస్య జనవరి 29 నాడు జరుగుతుంది .


4. నాలుగవది వసంత పంచమి పురస్కరించుకుని ఫిబ్రవరి 3న జరుగుతుంది.

5. ఐదవ రాజ స్నానం మాఘ పూర్ణిమ సందర్భంగా ఫిబ్రవరి 12న జరుగుతుంది.

6. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు చివరి రాజ స్నానం జరుగుతుంది.

Updated Date - Jan 15 , 2025 | 10:05 AM