Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..
ABN, Publish Date - Jan 15 , 2025 | 11:37 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇంకొన్ని వారాల్లో ఓటింగ్ జరగనుండగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ కేసు నమోదుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతినిచ్చారు. తర్వాత వెను వెంటనే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాప్రతినిధులను ప్రాసిక్యూట్ చేయాలంటే దర్యాప్తు సంస్థలు అధికార యంత్రాంగం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఆప్‌ను చిక్కుల్లో పడేసింది.
ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. మద్యం పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై విచారణ చేపట్టేందుకు ఈడీకి కేంద్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, తర్వాత కేంద్ర హోం శాఖ నుంచి అనుమతి పొందింది ఈడీ. దీంతో కేజ్రీవాల్‌ను వివాదాస్పద మద్యం పాలసీపై విచారించేందుకు ఈడీకి ఉన్న అడ్డంకులు తొలగిపోయనట్లయింది. అలాగే ఆప్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈడీ త్వరలోనే విచారించే అవకాశముంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమ నగదు చలామణీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ గతేడాది మార్చి 21న అప్పటి సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. తర్వాత సీబీఐ కూడా కేసు నమోదు చేసి గతేడాది జూన్‌లో అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో ఆప్ ముఖ్యనేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కవిత అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరంతా బెయిలుపై విడుదలయ్యారు.
గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంతో బయటకొచ్చిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి పూర్తి పార్టీ కార్యకలాపాలపైనే దృష్టి పెట్టారు. ఎలాగైనా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. మరో మూడు వారాల్లో పోలింగ్ జరగనుండగా.. ఈ తరుణంలో మద్యం కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఉచ్చు బిగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ 70 శాసనసభ సీట్లకు గాను ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
Updated Date - Jan 15 , 2025 | 11:37 AM