బతికుండగానే కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Mar 17 , 2025 | 02:56 PM
ఆ తల్లిదండ్రులు కూతురి విషయంలో దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. బతికుండగానే కూతురికి అంత్యక్రియలు నిర్వహించారు. పిండ ప్రధానం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో ఓ సీన్ ఉంటుంది. చిరంజీవి తమ్ముళ్ల కోసం ఆస్తి అంతా పోగొట్టుకుని మళ్లీ లారీ డ్రైవర్‌గా చేరతాడు. అదే సమయంలో సౌందర్య చెల్లెళ్లు ఆమెను కాదని చిరంజీవి తమ్ముళ్లతో వెళ్లిపోతారు. వెళ్లిపోయే ముందు సౌందర్యకు జీవిత సత్యాల్లాంటి డైలాగులు చెబుతారు. సౌందర్య, చిరంజీవి కోసం క్యారియర్ తీసుకెళ్లినపుడు బాగా ఏడుస్తుంది. చెల్లెళ్లు తనను అన్న మాటల్ని చిరుకు చెబుతుంది. అప్పుడు చిరు కొన్ని మానవ సంబంధాల సత్యాలను వివరిస్తాడు. ‘ నిజంగా మనం వాళ్లను ప్రేమించే వాళ్లమే అయితే.. వారినుంచి ఏమీ ఆశించకూడదు. వాళ్లు ఇలా ఉండాలి. అది చేయాలి అని ఆశించినపుడే మనకు నిరాశ ఎదురవుతుంది.వాళ్లను ప్రేమించే హక్కు మనకుంది.. తిరిగి మిమ్మల్ని ప్రేమించండి అనే అధికారం మనకు లేదు’ అంటాడు. ఈ డైలాగు ప్రతీ రిలేషన్‌కు వర్తిస్తుంది. అది ఏ బంధమైనా సరే. తల్లిదండ్రులు తాము తిన్నా, తినకపోయినా బిడ్డల కోసం పరితపిస్తుంటారు. పిల్లలకు అన్నీ చేసి.. రిటర్న్ గిఫ్ట్‌గా తాము చెప్పినట్లు చేయాలని ఆశిస్తుంటారు.
పిల్లలు తాము చెప్పినట్లు చేయకపోతే నిరాశకు గురవుతుంటారు. మా కడుపున చెడ బుట్టావు అంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో తల్లిదండ్రులు మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. తమకు నచ్చిన వాళ్లను పిల్లలు పెళ్లి చేసుకోవాలని ఆశిస్తారు. అది జరగనప్పుడు పిల్లలపై విపరీతమైన కోపం, పగ పెంచుకుంటారు. పిచ్చి పిచ్చి పనులకు తెరతీస్తూ ఉంటారు. తాజాగా, తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపంతో తల్లిదండ్రులు కన్న కూతురికి కర్మ కాండలు నిర్వహించారు. అది కూడా బతికుండగానే కూతురికి పిండ ప్రదానం చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని చోప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. గువాకూరీ అగ్నిబారీ ఏరియాకు చెందిన శ్రద్ధ అనే అమ్మాయి అదే ప్రాంతానికి చెందిన యువకుడ్ని ప్రేమించింది. అతడ్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కూతురి ప్రేమ విషయం తెలిసిన శ్రద్ధ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో శ్రద్ధ ఇంటినుంచి పారిపోయి ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది.
శ్రద్ధను ఇంటికి తిరిగి రమ్మని తల్లిదండ్రులు చాలా సార్లు బతిమాలారు. అయినా ఆమె తిరిగిరాలేదు. దీంతో వారు ఓ దారుణమైన నిర్ణయానికి వచ్చారు. ‘మాకు కూతురు లేదు. చచ్చిపోయింది’ అంటూ కర్మకాండలకు సిద్ధం చేశారు. ఓ మనిషి చనిపోయిన తర్వాత ఎలా అయితే అంత్యక్రియలు, పిండ ప్రదానం చేస్తారో అదే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులందర్నీ పిలిచారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బంధువులు వచ్చారు. శ్రద్ధ అంత్యక్రియల సందర్భంగా కుటుంబసభ్యులు, బంధువులు గట్టిగా ఏడ్చారు కూడా. శ్రద్ధ తండ్రి గుండు కొట్టించుకుని కూతురికి పిండం పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బతికుండగానే కూతురికి అంత్యక్రియలు నిర్వహించటం, పిండం పెట్టడంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ ఉన్నారు. కొంత మంది ఆ తల్లిదండ్రులు చేసిన పనిని పొగుడుతూ ఉంటే, మరికొంతమంది తిడుతూ ఉన్నారు.
Read Also : Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Ayodhya: 400 కోట్ల పన్ను చెల్లించిన అయోధ్య రాముడు
Kharge: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం