Mahakumbha Mela : మహా కుంభమేళాలో.. విచిత్ర సాధువులు..
ABN, Publish Date - Jan 13 , 2025 | 05:02 PM
ఒక సాధువు 32 ఏళ్లుగా స్నానం చేయలేదు.. మరొకరు 14 ఏళ్లుగా కుడిచేయి పైకి ఎత్తే ఉంచారు.. ఇంకొకరు 45 కిలోల రుద్రాక్ష తలపాగాతో కనిపిస్తారు. ఈ విచిత్ర సాధువులంతా మహా కుంభమేళాకు హాజరై భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు..
ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాకు సామాన్య భక్తులతో పాటు సాధువులు లక్షలాదిగా తరలివస్తున్నారు.144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమం 45 రోజులు పాటు జరగనుంది. తొలిరోజు ఉదయానికే సుమారు 60 లక్షల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు అంచనా. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‍కు హాజరైన కొందరు విచిత్ర సాధువులు తమ అసాధారణ ఆహార్యం, పద్ధతులతో భక్తులను అమితంగా ఆకర్షిస్తున్నారు. ఒక సాధవు 32 ఏళ్లుగా స్నానం చేయకపోతే.. మరొకరు 14 ఏళ్లుగా కుడిచేయి పైకి ఎత్తే ఉంచారు.. ఇంకొకరు 45 కిలోల రుద్రాక్ష తలపాగాతో కనిపిస్తారు. కనివినీ ఎరుగని విధంగా అసాధారణ ఆధ్యాత్మిక కట్టుబాట్లు ఆచరిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్‌లో ఈ రోజు ప్రారంభైన మహా కుంభమేళాకు హాజరైన 57 ఏళ్ల సాధువు గంగాపురి మహారాజ్ 32 ఏళ్లుగా స్నానం చేయలేదు. మధ్యప్రదేశ్‌కు చెందిన రాధేపురి మహారాజ్ అనే సాధువు హఠయోగి(అంటే సంకల్పం లేదా ప్రతిజ్ఞ).14 ఏళ్లుగా పైకెత్తిన కుడి చేయి దించనేలేదు.ఆవాహన్ అఖారా కార్యదర్శి మహంత్ గీతానంద్ గిరి 45 కిలోల బరువున్న 1.25 లక్షల రుద్రాక్ష పూసల తలపాగా ధరించి త్రివేణి సంగమానికి అమృత స్నానం ఆచరించేందుకు వచ్చాడు. వీరే కాక అసాధారణ అలవాట్లు, అభ్యాసాలు కొనసాగిస్తున్న ఎంతో మంది సన్యాసులు ప్రయాగ్‌రాజ్‌లో కనిపించారు.
32 ఏళ్లుగా స్నానం చేయని గంగాపురి మహారాజ్..
తొమ్మిదేళ్ల వయసులో తల్లిదండ్రులు మరణించిన తర్వాత "గురు మా" తనను దత్తత తీసుకున్నాడని గంగాపురి చెప్పారు. 1992లో అకస్మాత్తుగా ఇక స్నానం చేయనని ప్రమాణం చేశాడు. 2016లో ఉజ్జయిని కుంభమేళా సందర్భంగా గంగాపురి తన ప్రస్తుత గురువు మహంత్ రాజ్‌పురిని కలిశాడు. షాహి స్నాన్ (రాచరిక స్నానం) సమయంలో అతడు తన తలపై గురువు జుట్టు నుంచి ఒక చుక్క నీటిని తీసుకొని ఈ ఆచారాన్ని పూర్తి చేశాడు. 32 ఏళ్లు గడిచినా ఒక్కరోజు కూడా స్నానం చేయలేదు. ఇతడు ఐదు అంగుళాల ఎత్తయిన చెప్పులు, ఎక్కువగా కుట్టని దుస్తులను ధరిస్తాడు. ఎల్లప్పుడూ ఒక చిన్న త్రిశూలం, గురువు ఇచ్చిన శివలింగాన్ని వెంట తీసుకెళుతుంటాడు. పగటిపూట సాధారణ సాధనతో పాటు కొన్నిసార్లు స్మశాన వాటికలో ధ్యానం కూడా చేస్తాడు.
14 ఏళ్లుగా కుడి చేయి పైకెత్తి..
రాధేపురి మహారాజ్ దేశ సంక్షేమం, భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చడమే ధ్యేయంగా హఠ యోగా ఆచరిస్తున్నాడు. దీంతోఅతడి ఎడమ చేయితో పోలిస్తే కుడి చేయి సన్నగా మారింది. అంతకుముందు, రాధేపురి కొన్నాళ్ల పాటు నిలబడే ఉండే హఠయోగా చేశాడు. అప్పట్లో ఆ స్థితిలోనే నిద్రపోయేవాడు
రుద్రాక్ష బాబా..
మహంత్ గీతానంద్‌ను "రుద్రాక్ష బాబా" అని కూడా పిలుస్తారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లోని కొట్కాపురా నుంచి ప్రయాగ్‌రాజ్‍కు వచ్చారు. మానవత్వాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించడానికి ప్రతిరోజు 12 గంటలపాటు అత్యంత బరువైన రుద్రాక్ష తలపాగా ధరిస్తాడు. ఆయన ప్రతిజ్ఞ పూర్తి కావడానికి ఇంకా ఆరేళ్ల సమయం ఉంది.
Updated Date - Jan 13 , 2025 | 05:02 PM