Share News

Baby AC Care: పిల్లలను ఏసీ గదిలో పడుకోబెడుతున్నారా

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:39 AM

చిన్న పిల్లలను ఏసీ గదిలో పడుకోబెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి చలిగాలి ప్రభావం నుంచి పిల్లల్ని కాపాడేందుకు నిపుణుల సూచనలు కీలకం

Baby AC Care: పిల్లలను ఏసీ గదిలో పడుకోబెడుతున్నారా

ఎండాకాలంలో వేడి, ఉక్కపోతల కారణంగా చిన్న పిల్లలు చికాకుగా ఏడుస్తూ అసలు నిద్రపోరు. దీంతో తల్లిదండ్రులు వాళ్లని ఏసీ గదిలో పడుకోబెడుతూ ఉంటారు. చల్లని గాలి తగలడంతో పిల్లలు హాయిగా నిద్రపోతారు. ఇలా పసి పిల్లలను ఏసీ గదిలో పడుకోబెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

  • చిన్న పిల్లల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వాళ్లకి చలి పుట్టకుండా హాయిగా ఉండేలా చూసుకోవాలి. గది ఉష్ణోగ్రత 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉండేవిధంగా ఏసీని నియంత్రిస్తే సరిపోతుంది.

  • పసి పిల్లలకు రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఏసీ గాలి నేరుగా పిల్లలకు సోకకుండా చూసుకోవాలి. చల్లటి గాలి వల్ల పిల్లలకు తలనొప్పి, జలుబు, కండరాల వాపు లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఏసీ గాలి దిశను మార్చి గదిలో చల్లదనం వ్యాపించేలా చూడాలి.

  • ఏసీ గదిలో ఉండడం వల్ల పిల్లలకు దాహంగా అనిపించదు కానీ వాళ్ల శరీరంలో తేమ శాతం తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో నిర్జలీకరణ సమస్యలు వస్తాయి. ఇలా కాకుండా తరచూ పిల్లలకు మంచినీళ్లు, కొబ్బరినీళ్లు లేదా పండ్ల రసాలు తాగిస్తూ ఉండాలి.


  • చాలామంది.... ఏసీ గాలి లేదా చల్లదనం బయటికి వెళ్లిపోతున్నాయనే ఉద్దేశంతో గది తలుపులు, కిటికీలు పూర్తిగా మూసేస్తూ ఉంటారు. దీనివల్ల గదిలోని గాలి కలుషితమై పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఏసి గదిలో కిటికీ లేదా వెంటిలేటర్‌ను కొద్దిగా తెరచి ఉంచడం మంచిది. దీనివల్ల బయటి నుంచి తాజా గాలి లోనికి ప్రవేశిస్తుంది.

  • పిల్లలను ఏసి గదిలో పడుకోబెట్టేటప్పుడు వాళ్లకి పలుచని కాటన్‌ దుస్తులు వేయాలి. వీటికి ఉండే సన్నని రంధ్రాల నుంచి చల్లని గాలి పిల్లల చర్మానికి సోకుతుంది. దీంతో పిల్లలు చికాకు పడకుండా హాయిగా పడుకుంటారు.

  • ఏసీ ఫిల్టర్లలో ఎక్కువగా దుమ్ము, ధూళి చేరుతూ ఉంటాయి. వీటిని తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. లేకుంటే పిల్లలకు తుమ్ములు, దగ్గు, ముక్కు కారడం, డస్ట్‌ అలెర్జీ లాంటి సమస్యలు వస్తాయి.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 12 , 2025 | 12:39 AM