మన చుట్టూ చూస్తే అవకాశాలెన్నో!
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:23 AM
తరచి చూస్తే మన చుట్టూ అనేక అవకాశాలు ఉంటాయి. వాటిని అందిపుచ్చుకుంటే.. ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించటమే కాదు.. ఇతరులకు సాయం చేయటానికి వీలవుతుంది...

తరచి చూస్తే మన చుట్టూ అనేక అవకాశాలు ఉంటాయి. వాటిని అందిపుచ్చుకుంటే.. ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించటమే కాదు.. ఇతరులకు సాయం చేయటానికి వీలవుతుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపాలి మురా కథ కూడా ఇదే.. దీపాలి తన చుట్టూ పక్కల ఉచితంగా దొరికే సబాయి గడ్డితో పర్యావరణహితమైన గృహఅలంకారాలను చేసి విక్రయించటం ప్రారంభించింది. తనలాంటి అనేక మంది గిరిజన మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తోంది. దీపాలి ప్రస్థానం ఆమె మాటల్లోనే...
‘‘నేను పదోతరగతి వరకు చదువుకున్నాను. నాకు చిన్నతనంలోనే వివాహమైంది. నా భర్త తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసేవాడు. గట్ల మీద సబాయి గడ్డిని పండించేవాడు. సబాయి గడ్డి చాలా గట్టిగా ఉంటుంది. సాధారణంగా ఈ గడ్డితో తాళ్లను పేనుతారు. నా భర్త చేసే వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం మా కుటుంబానికి సరిపోయేది కాదు. దాంతో నేను కూడా ఏదో ఒక పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. నాకు చదువు రాదు కాబట్టి ఏ ఉద్యోగంలోను చేరలేను. కానీ ఎంతో కొంత సంపాదించకపోతే కుటుంబం గడవని పరిస్థితి. ఆ సమయంలో సబాయి గడ్డి నాకు ఉపకరించింది. గడ్డితో తాళ్లను పేనటం నేర్చుకున్నా. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత తాళ్లను పేనేదాన్ని. రోజుకు 50 రూపాయలు వచ్చేవి. కానీ ఆ డబ్బులు సరిపోయేవి కావు. ఆ సమయంలో- నా కోసమే అన్నట్లుగా- యునెస్కో సంస్థ స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి- ఒక వర్క్‌షా్‌పను నిర్వహించింది. ఈ వర్క్‌షా్‌పలో సబాయి గడ్డిని ఉపయోగించి రకరకాల గృహాలంకరణ వస్తువులను తయారు చేయడం నేర్పించారు. జ్యూవెలరీ బాక్స్‌లు, బుట్టలు, హ్యాంగింగ్ ప్లాంటర్లు, వాల్ మౌంటెడ్ సాల్వర్లు, ఫ్లవర్ వాజ్‌లు, పళ్లాలు వంటివి తయారుచేయటం ఎలాగో నేర్పించారు. వాటిపై అందమైన పువ్వులు, పక్షులు, జంతువుల బొమ్మలు కుట్టడం నేర్పారు.
రకరకాలు...
ఈ ప్రకృతిలో ప్రతి వస్తువు మనకు పనికి వస్తుంది. మనం వాటిని గుర్తించి ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలంతే! సబాయి గడ్డి చూడటానికి గరుకుగా ఉన్నా- దానితో రకరకాల వస్తువులు తయారుచేయవచ్చు. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు వేటిని ఇష్టపడతారో గమనించి- ఆ వస్తువులు తయారుచేయటం మొదలుపెట్టా. ఈ ప్రయాణ ప్రారంభంలోనే- ఎదురయిన తొలి సవాల్- తగినంత సబాయి గడ్డి దొరకకపోవటం. మా పొలంలో పండిన గడ్డి- ఎక్కువ వస్తువులకు సరిపోయేది కాదు. దాంతో ఇతరుల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చేది. గడ్డితో పాటుగా సహజసిద్ధమైన రంగులను కూడా కొని తయారు చేసిన వస్తువులపై బొమ్మలు వేసేదాన్ని. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. సబాయి గడ్డితో చేసే వస్తువుల తయారీకి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఉదాహరణకు ఒక అందమైన బుట్ట అల్లాలంటే 40 గంటల దాకా పడుతుంది. దాంతో నేను ఎదగాలంటే ఎక్కువ మంది పనివారు అవసరమవుతారని అర్ధమయింది. ఆ లోపులో నేను తయారుచేసిన వస్తువులకు గిరాకీ పెరిగింది. దాంతో మా గ్రామంలోనే ఉన్న కొద్ది మంది మహిళలకు ఉపాధి కల్పించాను. ప్రస్తుతం నా దగ్గర 50 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరందరూ నెలకు 600 దాకా రకరకాల వస్తువులు తయారుచేస్తూ ఉంటారు. వీటిని దేశంలో వివిధ నగరాల్లో జరిగే కళాప్రదర్శనలలో ఉంచుతాము. గత ఏడాది కొపెన్‌హెగెన్‌లో జరిగిన ఒక ఉత్సవంలో కూడా పాల్గొన్నాం.
ఒకప్పుడు నెలకు 1500 సంపాదించటానికి కష్టపడిన నేను ప్రస్తుతం ఏడాదికి కొన్ని లక్షలు సంపాదిస్తున్నా! దీనికి ప్రధానమైన ముడివస్తువు గడ్డే! అనేక ప్రాంతాల్లో ఉచితంగా దొరికే ఈ గడ్డితో అందరూ వస్తువులు తయారుచేయవచ్చు. సంపాదించుకోవచ్చు. దీనికి నేనే ఉదాహరణ. నా ఉదాహరణ అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నా!’’.
నాకు చదువు రాదు కాబట్టి ఏ ఉద్యోగంలోను చేరలేను. కానీ ఎంతో కొంత సంపాదించకపోతే కుటుంబం గడవని పరిస్థితి. ఆ సమయంలో సబాయి గడ్డి నాకు ఉపకరించింది. గడ్డితో తాళ్లను పేనటం నేర్చుకున్నా. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత తాళ్లను పేనేదాన్ని. రోజుకు 50 రూపాయలు వచ్చేవి.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..