Indoor Plants: ఇంట్లో ఇంపుగా...
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:56 AM
కొన్ని రకాల మొక్కలను ఎండ ఎక్కువగా తగిలే ప్రాంతాల్లోనే కాకుండా ఇంట్లో నీడలో కూడా పెంచుకోవచ్చు. ఇలాంటి మొక్కల వల్ల ఇంటి అందం ఇనుమడిస్తుంది. అలాంటి మొక్కల గురించి.. వాటిని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకుందాం..

మొక్కలు ఇవే...
స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, పీస్ లిల్లీ వంటి మొక్కలకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం ఉండదు. అందువల్ల వీటిని నీడలో ఉంచినా బాగా పెరుగుతాయి.
ఎక్కువ నీళ్లు పోయకపోయినా కొన్ని మొక్కలు పెరుగుతాయి. సక్యులెంట్స్ జాతికి చెందిన ఎఖివెరియా, లేస్ అలో, జీబ్రా హవోర్తియా మొదలైన మొక్కలు ఈ కోవకు చెందినవి. ఇవి ఇప్పుడు అన్ని నర్సరీలలో దొరుకుతున్నాయి.
కొబ్బరి మొక్కల జాతికి చెందిన చైనీన్ ఫ్యాన్, సాగో పామ్ వంటి వాటిని బాల్కనీలలో పెట్టుకుంటే బావుంటుంది. వీటికి ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం కూడా ఉండదు.
అలంకరణ ఇలా...
ఇంటి అలంకరణలో మొక్కలకు స్థానం కల్పించాలనుకున్నప్పుడు.. వ్యక్తిగత అభిరుచికి తగినట్లుగా తొట్లు ఎంచుకోవాలి. మట్టి తొట్లకు బదులుగా ఇత్తడి, రాగి లోహపు తొట్లను ఎంచుకుంటే ఆధునికత ఉట్టిపడుతుంది. పింగాణీ తొట్లను ఇష్టపడేవారు లేత రంగులను ఎంచుకోవాలి.
ఈ మధ్యకాలంలో మొక్కలను అలంకరించుకొనేందుకు వీలుగా స్టాండ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని వాడి మొక్కలను వేర్వేరు ఎత్తుల్లో అమర్చుకోవచ్చు.
వేర్వేరు ఆకారాల్లో... పరిమాణాల్లో... రంగుల్లో ఉన్న మొక్కలను ఎంచుకుంటే అవి వినూత్నంగా కనిపిస్తాయి. కాబట్టి రెండు మూడు రకాల మొక్కలను ఎంచుకుని వేర్వేరు ప్రదేశాల్లో అలంకరించుకోవాలి.
గాజు సీసాలు, గ్లాసులు, పాత్రలను కూడా మొక్కల పెంపకానికి వాడుకోవచ్చు. వెదురు బుట్టలు, చేతి సంచులను కూడా మొక్కల పెంపకానికి వాడుకోవచ్చు.
కాలుష్యాన్ని తగ్గించే మొక్కలు
పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, అలొవెరా, స్పైడర్ ప్లాంట్, బోస్టన్ ఫెర్న్స్ మొదలైనవి గాలిలో కాలుష్యాన్ని తగ్గిస్తాయి. అందుకే వీటిని ఇంటిలోపల అలంకరించు కోవచ్చు. ఇవి గాలిలోని కార్బన్ మోనాక్సైడ్, ట్రైక్లోరోఎథిలీన్ లాంటి కలుషితాలను తొలగిస్తాయి.