Actor Sapthagiri: సినిమా జీవితం నేర్పిన పాఠాలివే
ABN , Publish Date - Mar 16 , 2025 | 02:07 AM
ఈ తరం హాస్యనటుల్లో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి జీవితంలో ఎవరూ ఊహించని కొన్ని కోణాలున్నాయి. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘పెళ్లికాని ప్రసాద్’ చిత్రంతో హీరోగా వస్తున్న సప్తగిరితో ‘నవ్య’ ఇంటర్వ్యూ.

వెంకట ప్రభు ప్రసాద్... ఈ పేరు అంతగా ఎవరికీ గుర్తుకురాకపోవచ్చు. కానీ ‘సప్తగిరి’ అనగానే ప్రేక్షకులు వెంటనే గుర్తుపట్టేస్తారు. సప్తగిరి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పదిహేనేళ్లు అవుతోంది. ఈ తరం హాస్యనటుల్లో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి జీవితంలో ఎవరూ ఊహించని కొన్ని కోణాలున్నాయి. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘పెళ్లికాని ప్రసాద్’ చిత్రంతో హీరోగా వస్తున్న సప్తగిరితో ‘నవ్య’ ఇంటర్వ్యూ.
హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మీరు ఈ మధ్య తెర మీద తక్కువగా కనిపిస్తున్నారు. కారణం ఏమిటి?
నాకే కాదు పరిశ్రమలోకి వచ్చిన పది, పదిహేనేళ్ల తర్వాత ఎవరికైనా కెరీర్ పరంగా కొంత గ్యాప్ రావడం సహజం. అప్పుడు ఆత్మపరిశీలన చేసుకొని, అడుగు ముందుకు వేస్తే మళ్లీ విజయాలు అందుకోవచ్చు. కెరీర్ పరంగా ఎలా ముందుకు వెళ్లాలా? అనే కొంత అయోమయ పరిస్థితే నా గ్యాప్‌నకు కారణం. రకరకాల కథలు, పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి కానీ వాటిని ‘అంగీకరించాలా? వద్దా?’ అనే కన్‌ఫ్యూజన్ వల్లే ఇలా జరిగింది. చేసిన కొన్ని పాత్రలు ఫలితాన్ని ఇవ్వకపోవడం మరో కారణం. అలాగే చేసుకుంటూ పోతే కన్‌ఫ్యూజన్ పెరుగుతుందనిపించింది. అందుకే కొంత విరామం తీసుకొని, రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులను మరికొంత కాలం అలరించాలనే అభిప్రాయంతో తీసుకున్న గ్యాప్ ఇది.
హీరో పాత్రలు, కామెడీ వేషాలు...
ఈ రెండు పడవల ప్రయాణం ఇబ్బందేనా?
ఒక దశలో అలా ఇబ్బంది పడిన మాట వాస్తవం. ‘రెండు పడవల ప్రయాణం చేస్తున్నాం. ఎటూ కాకుండా ఉన్నాం. ఇలాగైతే ఎలా?’ అని మధనపడిన సందర్భాలు ఉన్నాయి. పరిశ్రమలో నాకు ఎలాంటి నేపథ్యం లేదు కనుక ‘ధైర్యంగా నిలబడాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి’ అని నాకు నేనే చెప్పుకొన్నా. కొంత ఇబ్బంది పడినా చాలా మంచి కథలు వచ్చాయి. వాటిల్లో ‘పెళ్లికాని ప్రసాద్’ ఒకటి.
‘ఇక సినిమా ఫీల్డ్ వద్దు... ఇంటికి వెళ్లిపోదాం’ అని ఎప్పుడైనా అనిపించిందా?
ఆ ఏడుకొండలస్వామి దయ వల్ల నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. ‘ఏది ఏమైనా ఇక్కడే ఉండాలి, సాధించాలి’ అని ఎప్పుడూ అనుకుంటాను. ఇది నాకు ఇష్టమైన రంగం, కష్టపెట్టే రంగం కాదు. ఇక్కడ ఎంత కష్టమైనా చాలా ఇష్టంతో ముందడుగు వేస్తాను. అందుకే ‘వెనక్కి తిరిగి వెళ్లిపోదాం’ అనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు, రాదు కూడా.
మీరు స్ట్రగుల్ అయ్యే రోజుల్లో ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏవీ లేవా?
మనకు సంబంధం లేకుండా కొంతమంది మనమీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంటుంది. ‘వాళ్లను ఎలా తట్టుకోవాలి, ఆ పరిస్థితుల్ని ఎలా అధిగమించాలి?’ అని అర్థం కాని రోజులు ఉన్నాయి. కొంతమంది నన్ను డీ గ్రేడ్ చేయాలని చూడడం, అవకాశాలు రాకుండా అడ్డుకోవడం కూడా జరిగింది. ‘‘హీరోగా నటిస్తున్నా కమెడియన్ వేషాలు కూడా చేస్తాను’’ అని ప్రకటించాను. పెద్దలను కలిసి వివరించాను. అయినా దాన్ని కూడా కొందరు చులకన చేసి మాట్లాడారు. నేను పట్టించుకోలేదు. మనం నిజాయితీగా ప్రయత్నాలు చేస్తే దేవుడి అండదండలు తప్పకుండా ఉంటాయని నమ్మాను. అలాగే అడుగులు వేస్తున్నాను.
హీరో కావాలనే కోరిక మీకెందుకు కలిగింది?
పదేళ్లు కమెడియన్‌గా నటించాను. వైవిధ్యం ఏదీ లేకుండా చేసిన కొన్ని పాత్రలు నాకే విసుగ్గా అనిపించాయి. ‘విభిన్న పాత్రలు ఇస్తే అవి కూడా చేయగలను’ అనిపించినప్పుడు, ఇతరుల నుంచి అటువంటి అవకాశాలు రానప్పుడు నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి కనుక హీరోగా నటించాలని అనుకున్నాను. సరిగ్గా అప్పుడే ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ కథలు దొరికాయి. ఎమోషన్, సెంటిమెంట్ కూడా బాగా పండించగలననే పేరు వచ్చింది. అలా నన్ను నేను నిరూపించుకోక పోతే కమెడియన్‌గా కూడా కొనసాగడం కష్టం. ‘అరే... సప్తగిరి ఇవి కూడా చెయ్యగలడా? ఇతనిలో ఈ టాలెంట్ కూడా ఉందా?’ అనిపించుకోవడం కోసమే హీరోనయ్యాను. కేవలం కమెడియన్ కాదు, మంచి నటుడు కూడా అనిపించుకోవాలనే తాపత్రయంతోనే అప్పుడప్పుడు హీరో వేషాలు వేస్తున్నాను. ఆ రోజు ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ చిత్రాలతో బీజం వేశాను కనుకే నాకు ‘పెళ్లికాని ప్రసాద్’ సినిమా వచ్చింది. హీరోగా మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇన్నాళ్లుగా నేను చేయాలనుకుంటున్న హీరో పాత్ర ‘పెళ్లికాని ప్రసాద్’ లో దొరికింది. రెగ్యులర్‌గా కనిపించే సప్తగిరి ఇందులో ఉండడు. ఇది వినోదంతో నిండిన సినిమా. ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రం.
హీరోగా నటిస్తున్నప్పుడు మిస్ అయిన వేషాలు ఉన్నాయా?
నేను మిస్సయ్యాను అనడం కంటే ‘మిస్ అయ్యేలా చేశారు’ అని చెప్పడం బెస్ట్. నా బాధ కూడా అదే!
అటువంటి పరిస్థితుల్లో మీకు మద్దతుగా ఎవరున్నారు?
దర్శకుడు మారుతి అన్న గురించి మొదట చెప్పాలి. నన్ను సొంత తమ్ముడిలా ఆయన చూస్తాడు. ‘‘ఏం పరవాలేదు నేనున్నా’’ అని ధైర్యం ఇస్తాడు. అలాగే అనిల్ రావిపూడి కూడా కొండంత అండగా ఉంటాడు.
అనిల్ రావిపూడి సినిమాల్లో
మీకు కనిపించకపోవడానికి కారణం?
మేమిద్దరం మంచి స్నేహితులం. ఆయన సినిమాల్లో నేను లేకపోవడానికి ప్రత్యేకించి కారణాలు ఏవీ లేవు. సందర్భం కుదరలేదు అంతే! అయితే ఆ లోటు కూడా త్వరలోనే తీరుతుంది. నాకు ఓ మంచి పాత్ర ఇవ్వబోతున్నాడు. మరో విషయం ఏమిటంటే ‘పెళ్లికాని ప్రసాద్’ బిజినెస్ విషయంలో అనిల్ చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. ‘‘ఈ సినిమా బాగుంటుంది. మీరు రిలీజ్ చేయాలి’’ అని శిరీష్ అన్నతో మాట్లాడాడు. స్నేహానికి అంత విలువ ఇచ్చే వ్యక్తి అనిల్ రావిపూడి.
‘పెళ్లికాని ప్రసాద్’ ఎలా ఉంటాడు?
ఇంతకాలం కమెడియన్‌గా నవ్వించాను. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ లాంటి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాల్లో హీరోగా నటించాను. మొదటి సినిమాలో పోలీస్, రెండో సినిమాలో లాయర్ పాత్రలు పోషించాను. ఇక ఇప్పుడు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడం కోసమే చేసిన సినిమా ‘పెళ్లికాని ప్రసాద్’. పల్లెటూరులో జరిగే హిలేరియస్ ఎంటర్‌టైనర్ ఇది. అదృష్టవశాత్తూ కంటెంట్ బాగా కుదిరింది. సినిమాలో 54 సీన్లు ఉంటే అందులో 45 సీన్లలో సన్నివేశపరమైన హాస్యం అందరినీ నవ్విస్తుంది.
హీరోగా మీకు తోటి హాస్యనటుల సపోర్ట్ ఎలా ఉంది?
అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ‘’గిరీ... నువ్వు మళ్లీ విజృంభించాలి. నువ్వు కేవలం కమెడియన్‌వి మాత్రమే కాదు, మంచి నటుడివి’’ అని చెబుతున్నారు. ‘పెళ్లికాని ప్రసాద్’ బాగా ఆడాలని కోరుకుంటున్నారు.
పెళ్లి కాని ప్రసాద్’ పెళ్లి ఎప్పుడు?
చెబుతా. ఈ సినిమా తర్వాత అన్నీ శుభవార్తలే వింటారు.
-- వినాయకరావు
ఏ మనిషి జీవితంలోనైనా ఒడుదొడుకులు సహజం. ఆ స్ట్రగుల్ నాకూ ఉంది. ఓపిక, సహనం ఉండాలి. సినిమా జీవితం అదే నాకు నేర్పించింది. ఇక్కడకు వచ్చి పోగొట్టుకున్నది ఏదీ లేదు.
శత్రువులు నా జోలికి రాకుండా ఉంటే చాలు. అదే పదివేలు. నేను ఎదురు తిరిగే వ్యక్తిని కాదు, స్టేట్‌మెంట్లు ఇచ్చే రకాన్ని కూడా కాదు. ‘‘నా బతుకు నే బతుకుతాను. నా దారిన నన్ను పోనివ్వండి’’ అని బతిమాలుకునే మనిషిని నేను.
‘రాజాసాబ్’ చిత్రం హాస్యనటుడిగా నన్ను మళ్లీ నిలబెడుతుంది. ప్రభాస్ అన్న పక్కన దాదాపు సినిమా అంతా ఉంటా. ‘పెళ్లికాని ప్రసాద్ టీజర్ రిలీజ్ చేసింది ప్రభాస్ అన్నే. సినిమాలో కొన్ని సీన్స్ చూసి ఇష్టపడి ‘‘ఈ సినిమాను నేను ప్రమోట్ చేస్తా’’ అని ముందుకు వచ్చారు. మహారాజు లాంటి మనస్తత్వం ఆయనది.