Tollywood: ఒక్క హిట్.. ఫ్లీజ్!
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:53 AM
ప్రతి శుక్రవారం టాలీవుడ్‌లో అనేక మంది రాతలు మారిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద అంచనాలతో వచ్చిన చిత్రాలు ఫట్ మంటాయి. కథబలం ఉన్న చిన్న సినిమాలు ఆడేస్తుంటాయి. ఈ క్రమంలో కొందరు స్టార్ హీరోలు కూడా హిట్‌ల కోసం పరితపిస్తూ ఉంటారు. మళ్లీ మంచి రోజులు రాకపోతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అలాంటి హీరోలెవరున్నారో చూద్దాం..

విజయం కోసం...
పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం చిత్రాల హ్యాట్రిక్ హిట్‌లతో కెరీర్ ప్రారంభించిన విజయ్ దేవరకొండకు ఈ మధ్యకాలంలో విజయాలు దక్కలేదు. లైగర్ పూర్తిగా నిరాశపరిస్తే.. ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఇది మేలో విడుదలయ్యే అవకాశముంది. వరుస ఫ్లాప్‌ల బారిన పడిన విజయ్‌ని ఈ చిత్రమైన గట్టెక్కిస్తుందో లేదో చూడాలి.
ఆరేళ్ల నుంచి...
గత ఆరేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నటుడు వరుణ్‌తేజ్. 2019లో వచ్చిన ‘గద్దల కొండ గణేశ్’ తరవాత వరుణ్‌కు చెప్పుకోదగిన విజయం లభించలేదు. ఈ మధ్యనే విడుదలైన ‘మట్కా’ ప్రేక్షకులను బాగా నిరాశపరిచింది. ప్రస్తుతం వరుణ్ ఒక ఇండో కొరియన్ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు.
ఇంకా దక్కని అదృష్టం...
అక్కినేని కుటుంబం నుంచి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్‌కు ఇప్పటి దాకా ఒక్క సూపర్ హిట్ కూడా దక్కలేదు. ఎంతో శ్రమకోర్చి తీసిన ‘ఏజెంట్’ తీవ్ర నిరాశనే మిగిల్చింది. అఖిల్ త్వరలోనే రెండు ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని వార్తలు వినబడుతున్నాయి.
రాబిన్‌హుడ్ అలరిస్తాడా?
2020లో వచ్చిన ‘భీష్మ’ తరవాత నితిన్‌కి ఒక్క హిట్ కూడా లేదు. ‘చెక్’, ‘రంగ్ దే’, మాస్ట్రో, ‘మాచర్ల నియోజకవర్గం’ మొదలైనవన్నీ నిరాశే మిగిల్చాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబిన్‌హుడ్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
నిరాశలే ఎక్కువ...
గోపిచంద్‌కు ‘సౌఖ్యం’ తరవాత ఒక్క హిట్ కూడా పడలేదు. ఆక్సిజన్, పంతం, సీటిమార్, అరడగుల బుల్లెట్, పక్కా కమర్షియల్, రామబాణం, భీమా, విశ్వం చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. తాజాగా ‘ఐబీ 71’, ‘ఘాజీ’ వంటి చిత్రాలతో గుర్తింపుతెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఇది ఏ మేరకు ప్రేక్షకులకు అలరిస్తుందో చూడాలి.