Share News

Grapes: ద్రాక్షతో కొత్తగా... నోరూరేలా..!

ABN , Publish Date - Mar 15 , 2025 | 01:56 AM

ద్రాక్షపండ్లను చూడగానే చటుక్కున నోట్లో వేసుకోనివారు ఉండరు. పుల్లగా, తియ్యగా ఉంటూ ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ద్రాక్షతో నోరూరించే సరికొత్త వంటకాలు మీ కోసంం

Grapes: ద్రాక్షతో కొత్తగా... నోరూరేలా..!

కట్టా మీఠా కూర

కావాల్సిన పదార్థాలు

పుల్లని ద్రాక్ష పండ్లు- అర కేజీ, నూనె- రెండు చెంచాలు, జీలకర్ర- పావు చెంచా, ఆవాలు- పావు చెంచా, మెంతులు- పావు చెంచా, సోంపు- పావు చెంచా, ఇంగువ- చిటికెడు, అల్లం తరుగు- ఒక చెంచా, పచ్చి మిర్చి ముక్కలు- ఒక చెంచా, ఎండు మిర్చి- నాలుగు, పసుపు- పావు చెంచా, ఉప్పు- అర చెంచా, ఖర్జూరాలు- ఎనిమిది, జీడిపప్పు పలుకులు- రెండు చెంచాలు, కారం- ఒక చెంచా, బెల్లం పొడి- మూడు చెంచాలు, నల్ల ఉప్పు- చిటికెడు

trf.jpg

తయారీ విధానం

ద్రాక్ష పండ్లను నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఖర్జూరాలను చిన్న ముక్కలుగా కోయాలి.

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, ఇంగువ, ఎండు మిర్చి, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం తరుగు వేసి బాగా కలపాలి. తరవాత ద్రాక్ష పండ్లు, పసుపు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మగ్గించాలి. అయిదు నిమిషాల తరవాత ఖర్జూరం ముక్కలు, జీడిపప్పు పలుకులు, కారం, బెల్లం వేసి కలపాలి. మూడు నిమిషాల తరవాత చిటికెడు నల్ల ఉప్పు వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. తియ్యగా, పుల్లగా, కారంగా ఉండే ఈ కూర వేడి అన్నం, చపాతీ, పుల్కా, పరాటాల్లోకి బాగుంటుంది.

జాగ్రత్తలు

ద్రాక్ష పండ్లు అంత పుల్లగా లేని పక్షంలో కొద్దిగా చింతపండు గుజ్జు కలుపుకుంటే కూర రుచి బాగుంటుంది.

ఎండు ఖర్జూరాలు తీసుకున్నట్లయితే వాటిని మంచినీటిలో పది నిమిషాలు నానబెట్టాలి. అదే ముద్ద ఖర్జూరమైతే నేరుగా వాడుకోవచ్చు.

ద్రాక్ష పండ్లను మరీ మెత్తగా ఉడికించకూడదు.


ff.jpg

ద్రాక్ష హల్వా

కావలసిన పదార్థాలు

ద్రాక్ష పండ్లు- ఒక కేజీ, కార్న్‌ఫ్లోర్‌- ఒక కప్పు, పంచదార- రెండు కప్పులు, ఫుడ్‌ కలర్‌(గ్రీన్‌)- చిటికెడు, నెయ్యి- మూడు చెంచాలు, బాదం పలుకులు- ఒక చెంచా, కర్బూజా గింజలు- ఒక చెంచా, జీడిపప్పు పలుకులు- ఒక చెంచా

తయారీ విధానం

ముందుగా ద్రాక్షపండ్లను ఉప్పు నీటితో కడగాలి. బాదం, జీడిపప్పులను సన్నని పలుకుల్లా కోయాలి. ఒక పళ్లేనికి నెయ్యి రాసి దాని మీద బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, కర్బూజా గింజలు చల్లి ఉంచాలి.

మిక్సీ గిన్నెలో ద్రాక్ష పండ్లు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫిల్టర్‌ సహాయంతో వెడల్పాటి గిన్నెలోకి వడబోసి రసాన్ని సిద్దం చేసుకోవాలి. ఇందులో కొద్దికొద్దిగా కార్న్‌ఫ్లోర్‌ వేస్తూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలపాలి.

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి పంచదార వేసి అర కప్పు నీళ్లు పోసి చిన్న మంట మీద మరిగించాలి. పంచదార మొత్తం కరిగాక ఇందులో కార్న్‌ఫ్లోర్‌-ద్రాక్షపళ్ల రసాన్ని మెల్లగా పోస్తూ కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాల వరకూ గంటెతో తిప్పుతూనే ఉండాలి. తరవాత ఫుడ్‌ కలర్‌, నెయ్యి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం గిన్నెకు అంటుకోకుండా హల్వా మాదిరి తయారైన తరవాత స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ హల్వాని ముందుగా సిద్దం చేసుకున్న పళ్లెంలోకి తీసి సమంగా పరచాలి. పది నిమిషాల తరవాత ఈ పళ్లేన్ని మరోదానిపై బోర్లించి పైన తడితే కేక్‌ మాదిరి వచ్చేస్తుంది. దీన్ని ముక్కలుగా కోసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.

జాగ్రత్తలు

తియ్యగా ఉండే సీడ్‌లెస్‌ ద్రాక్ష పండ్లను ఎంచుకుంటే హల్వా రుచి బాగుంటుంది.

ఫ కార్న్‌ఫ్లోర్‌లో కొద్దిగా ద్రాక్షరసం చిలకరిస్తూ గంటె జారుడు మిశ్రమంలా కలపాలి. దీన్ని ద్రాక్షరసం గిన్నెలో పోస్తూ కలిపితే రెండూ చక్కగా కలుస్తాయి.


ద్రాక్ష పచ్చడి

కావాల్సిన పదార్థాలు

పుల్లని ద్రాక్ష పండ్లు- పావు కేజీ, పచ్చి మిర్చి- రెండు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, నల్ల ఉప్పు- అర చెంచా, మిరియాల పొడి- అర చెంచా, కొత్తిమీర- అయిదు రెమ్మలు, ఉప్పు- తగినంత

తయారీ విధానం

వెల్లుల్లి రెబ్బలకు పొట్టు తీసి ఉంచుకోవాలి. కొత్తిమీర రెమ్మలను నీటితో కడిగి కాడలు తుంచి పెట్టుకోవాలి.

మిక్సీ గిన్నెలో పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నల్ల ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, ద్రాక్ష పండ్లు, చిటికెడు ఉప్పు వేసి కొన్ని నీళ్లు చిలకరించి మెత్తగా గ్రైడ్‌ చేయాలి. తరవాత గిన్నెలోకి తీయాలి. పుల్లగా ఘాటుగా ఉండే ఈ పచ్చడి పులావు, పరాటా, పుల్కా, చపాతీల్లోకి బాగుంటుంది.

జాగ్రత్తలు

వెల్లుల్లి అంటే ఇష్టం లేనివారు దాన్ని వేసుకోనక్కర్లేదు

పచ్చడి కమ్మగా కావాలనుకుంటే కొద్దిగా పుట్నాలపప్పు లేదా కొన్ని వేయించిన పల్లీలు వేసి గ్రైండ్‌ చేయాలి.


ఇవి కూడా చదవండి..

BS Yediyurappa: పోక్సో కేసులో మాజీ సీఎంకు స్వల్ప ఊరట

Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Bengaluru: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. విషయం ఏంటంటే..

Divya: నటుడు సత్యరాజ్‌ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

Updated Date - Mar 15 , 2025 | 01:56 AM