విదేశీ స్నాక్స్ తెగ తినేస్తున్నారు..
ABN , Publish Date - Feb 09 , 2025 | 10:59 AM
బడికెళ్లే పిల్లలకు చిరుతిళ్లు అంటే పది పైసల పిప్పరమెంట్లు, నిమ్మతొనలు, చక్కిలాలు, బర్ఫీలు, పుల్లఐస్‌క్రీమ్‌లు ఇవే!. కానీ, ఇప్పుడు తిండి మారింది. ఇంటర్‌నెట్ యుగంలో.. ఇంటర్నేషనల్ స్నాక్స్ ఇంటిముంగిటకు వచ్చేశాయిప్పుడు!. నగరాలు, పట్టణాల్లోని ఎవరిని కదిపినా.. డోనట్లు, బర్గర్లు, వఫెల్స్, మొమోస్ వంటి చిరుతిళ్లనే ఇష్టపడుతున్నట్లు చెబుతున్నారు.

బడికెళ్లే పిల్లలకు చిరుతిళ్లు అంటే పది పైసల పిప్పరమెంట్లు, నిమ్మతొనలు, చక్కిలాలు, బర్ఫీలు, పుల్లఐస్‌క్రీమ్‌లు ఇవే!. కానీ, ఇప్పుడు తిండి మారింది. ఇంటర్‌నెట్ యుగంలో.. ఇంటర్నేషనల్ స్నాక్స్ ఇంటిముంగిటకు వచ్చేశాయిప్పుడు!. నగరాలు, పట్టణాల్లోని ఎవరిని కదిపినా.. డోనట్లు, బర్గర్లు, వఫెల్స్, మొమోస్ వంటి చిరుతిళ్లనే ఇష్టపడుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సంప్రదాయ చిరుతిళ్లు ఉన్నప్పటికీ.. కొత్తతరం మాత్రం విదేశీస్నాక్స్ రుచి మరిగారు..
‘‘ఎందుకమ్మా ఆ చెత్త తిండి తింటావు? ఆరోగ్యానికి మంచిది కాదు. ఊరి నుంచి నీ కోసం ప్రత్యేకంగా వండుకుని స్నాక్స్ తీసుకొచ్చాను. మురుకులు, చేగోడీలు, సకినాలు, జంతికలు, కజ్జికాయలు.. ఇవన్నీ ఎంత రుచిగా ఉంటాయో తెలుసా? ఒక్కసారి తిని చూడు.. మళ్లీ వదలవు. అందులోనూ ఇవన్నీ మన సంప్రదాయ చిరుతిళ్లు’’ డోనట్ తింటున్న మనవరాలిని ఉద్దేశించి.. పల్లె నుంచి వచ్చిన అమ్మమ్మ చెప్పిన మాటలు ఇవి. ‘‘అయ్యో అదేం చెప్పినా వినదు అమ్మా.. ఎప్పుడు చూడు ఆ డోనట్స్, బర్గర్లు, వఫెల్స్, కప్‌కేక్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్.. ఇవే తింటుంది.. వద్దంటే ఏడుస్తుంది. ఆ మాటకొస్తే మన పిల్లనే కాదు.. ఈ అపార్ట్‌మెంట్‌లోని పిల్లలంతా ఇవే తింటుంటారు. మీ కాలంలో వండే సంప్రదాయ చిరుతిళ్ల వైపు ఈ కాలం పిల్లలు కన్నెత్తి చూడటం లేదు..’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిది కూతురు.
ఇష్టమైన స్నాక్స్ ఏంటంటే..
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి, వరంగల్, ఖమ్మం వంటి నగరాలు, పట్టణాలే కాదు.. ఓ మోస్తరు చిన్న టౌన్లలో కూడా విదేశీ ఫుడ్ అవుట్‌లెట్లు అయిన మెక్‌డోనాల్డ్, కేఎఫ్‌సీ, బర్గర్‌కింగ్ లాంటివన్నీ వచ్చేశాయిప్పుడు. ఒకవేళ అవి లేకపోయినా.. అలాంటి ఫుడ్‌ఐటమ్స్ విక్రయించే కెఫేలు, బేకరీలు బోలెడు వెలిశాయి. మెయిన్‌రోడ్డుపైన వెళుతుంటే మనల్ని ఆపేస్తాయవి. ఎంత నోరుకట్టుకున్నా సరే.. అందులోకెళ్లి ఏదో ఒక స్నాక్ తినందే ముందుకు కదల్లేని పరిస్థితి. పిల్లలైతే మరీ!. తల్లిదండ్రులు కూడా కాదనలేక వారి ముచ్చట తీరుస్తున్నారు. ఇప్పటి తరం పిల్లలను ఎక్కాలు అడిగితే చెబుతారో లేదో కానీ.. మీకిష్టమైన స్నాక్స్ ఏంటని అడిగితే మాత్రం గుక్కతిప్పుకోకుండా వల్లె వేసినట్లు చాంతాడంత జాబితా చెప్పేస్తారు.
అలా ‘‘మీరేం తింటారు?’’ అంటూ కొంతమంది పిల్లలను అడిగితే వాళ్లు చెప్పిన జాబితా ఇలా ఉంది.. ‘‘డోనట్స్, బర్గర్స్, వఫెల్స్, పాన్‌కేక్, కప్‌కేక్స్, హాట్ చాకొలెట్స్, దుబాయ్ చాకొలెట్స్, మఫిన్స్, హాట్‌డాగ్స్, చికెన్‌నగెట్స్, పొకీస్టిక్స్, టాకిస్, చీటోస్, మఫిన్స్, మొమోస్, చీజ్‌బాల్స్, నుటెల్లా స్టిక్స్, ఐస్‌క్రీమ్‌శాండ్‌విచ్, ప్రింగిల్స్, మఖానా, చాకోస్, కెల్లోగ్స్, క్యాండీబార్స్, కుకీస్, చాకొలెట్ చిప్ కుకీస్, స్లుషీస్, మార్ష్‌మాలోస్... ఇలా ఒకటికాదు.. రెండు కాదు.. ఆపకుండా ఓ వంద చెప్పేశారు. పాత తరానికైతే ఇందులో ఓ రెండు మూడు తప్పిస్తే.. ఏవీ తెలీదు. ఇవన్నీ విదేశీ స్నాక్స్. అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు వేలకోట్ల రూపాయలు వెచ్చించి తయారుచేస్తున్న ఆహారపదార్థాలు. మన దేశంతోపాటు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కుమ్మరించేస్తున్నాయి. ఊహకు అందనంత వ్యాపారం చేస్తున్నాయని చెప్పొచ్చు.
భారతీయ చిరుతిళ్ల మార్కెట్ ఎంత పెద్దది? అనే అంశం మీద ఇటీవల ఐఎంఎఆర్‌సి అనే సంస్థ ఓ అధ్యయనం చేసింది. 2023 ఏడాదిలో మన దేశంలో కేవలం చిరుతిళ్ల కోసమే రూ.42,694 కోట్లు ఖర్చు పెట్టారు. ఏటా తొమ్మిది శాతం వృద్ధితో 2032 నాటికి ఇండియన్ స్నాక్ మార్కెట్ రూ.95,521 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు అధ్యయనకారులు.. మన దేశంలో స్నాక్స్ మార్కెట్‌కు ఊహించనంత భవిష్యత్తు ఉందన్నది వ్యాపార సంస్థల అంచనా. ఎందుకంటే ఇక్కడి ప్రజలకు టీవీలు, సినిమాలు వీక్షిస్తూనో, క్రికెట్ ఆట చూస్తూనో, పుస్తకాలు చదువుతూనో, బద్దకంగా కబుర్లు చెప్పుకుంటూనో చిరుతిళ్లు తినే అలవాటు చాలామందిలో ఉంది. తీరిక దొరికితే నోట్లో నాలుగు చిరుతిళ్లు వేసుకోనిదే చేతులు ఊరుకోవు. ఆ భారతీయ మనస్తత్వమే ఇన్నేసి స్నాక్స్ తయారీకి కారణం అయ్యింది. వ్యాపారపరంగా కంపెనీలకు ఇదొక వరమంటున్నారు నిపుణులు.
ఇంటర్‌నెట్ ప్రభావం..
మన దేశంలో చిరుతిళ్లు ఇక్కడ పండే పంటలు, వాతావరణ స్థితిగతులు, ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పుట్టుకొచ్చాయి. బియ్యం, గోధుమలు, నువ్వులు, గింజలతో రకరకాల స్నాక్స్‌ను తయారుచేస్తున్నారు. అవన్నీ సంప్రదాయ వంటలే!. మన పండుగలప్పుడు కూడా వీటిని వండుకోవడం సంప్రదాయంగా వస్తున్నది. ఇలా వండుకున్న చిరుతిళ్లను కొన్ని రోజుల పాటు నిల్వ చేసుకుని తినే అవకాశం ఉంది. రెండు దశాబ్దాల కిందట స్వదేశీ, స్వగృహఫుడ్స్‌కు విపరీతమైన గిరాకీ ఉండేది. అందుకే ఆ తరహా అవుట్‌లెట్స్ ఎక్కువగా వచ్చేశాయి. ఇప్పటికీ వాటి హవా తగ్గలేదు కానీ.. వేగం పుంజుకోలేదు. ఈ క్రమంలో.. ప్రపంచీకరణలో భాగంగా అనేకమార్పులు వచ్చాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరిగింది.
పర్యాటకం విస్తరించింది. ఇంటర్‌నెట్ అందరి చేతుల్లోకి వచ్చాక కొత్తకొత్త ఆహారపదార్థాలతో పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌లలో సెలబ్రిటీలు, యూట్యూబర్లు, టూరిస్టులు.. విదేశీ స్నాక్స్‌ను పరిచయం చేయడం, వాటి గురించి వివరంగా చెప్పడం వంటి పరిణామాలు వేగంగా జరిగాయి. ఆధునికతరం జీవనశైలి కూడా మారింది. సరికొత్త ఆహార అభిరుచులు అలవడ్డాయి. నిమిషాల్లో ఫుడ్‌ఐటమ్స్ పొందే వీలు కలిగింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వ్యవస్థలు ప్రజలకు చేరువకావడంతో విదేశీస్నాక్స్ హవా మరింత పెరిగింది. ‘‘ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ వచ్చాక యువతరం ప్రపంచానికి చాలా దగ్గరైంది. ఏ మూల ఏ కొత్త పుట్టుకొచ్చినా స్వీకరించే ఆసక్తి మొదలైంది. ఇది ఆహారపదార్థాలకు కూడా వర్తిస్తుంది. అలా బాగా ప్రాచుర్యం పొందిన స్నాక్స్‌ను తినడానికి ఎవరైనా ఆసక్తి చూపిస్తారు. అందులోనూ అంతర్జాతీయ బ్రాండ్ కలిగిన ఫుడ్‌అవుట్‌లెట్స్ ఎక్కడ చూసినా వచ్చేశాయి. సంపాదనవర్గాలు కూడా ఎక్కువయ్యాయి. అందుకే స్నాక్స్ కొనుగోళ్లు పెరిగాయి..’’ అన్నారు ప్రముఖ చెఫ్ సరబ్.
పోటాపోటీగా అవుట్‌లెట్స్..
అన్ని దేశాల్లో స్నాక్స్ ఉన్నట్లే విదేశాల్లోనూ ఉన్నాయి. మన భారతీయ చిరుతిళ్లు విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులకు అపురూపం.. కానీ స్వదేశంలోని వాళ్లకు మాత్రం విదేశీస్నాక్స్ ఆకర్షణీయం. ఇప్పుడు మనం చూస్తున్న పిజ్జాలు, బర్గర్‌లు, వఫెల్స్ ఈనాటివి కావు. వీటికి పెద్ద చరిత్రే ఉంది. ఒక్కో దేశంలో ఒక్కోటి ఫేమస్సు. బర్గర్లను తొలుత 20వ శతాబ్దంలో అమెరికాలో తయారుచేశారు. ఫాస్ట్‌ఫుడ్ మొదలైన తొలిరోజుల్లో మెక్‌డోనాల్డ్ (1940) బర్గర్లను విరివిగా అమ్మడం మొదలు పెట్టారు ఆ దేశ వ్యాపారులు. భారత్‌లో తొలిసారి ఢిల్లీలో (1996) మెక్‌డోనాల్డ్ అడుగుపెట్టింది. అప్పట్లో భారతీయులు తమ ఆహార ఉత్పత్తులను తింటారో లేదోనన్న సందేహం ఆ సంస్థకు ఉండేది. కానీ, వారి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెక్‌డోనాల్డ్ ఆరొందలకు పైగా అవుట్‌లెట్స్‌తో విస్తరించింది.
అమెరికాలో ఈ సంస్థ ఉత్పత్తి చేసే ఆహారపదార్థాలకు భారత్‌లో స్థానిక రుచులను అందించే దినుసులను జత చేసింది. అందులో మెక్ ఆలూ టిక్కీ ఒకటి. బంగాళాదుంపలు, బఠాణీ, పనీర్‌లను వాడుతోంది. పదార్థాలలో దేశీ మసాలాలను కూడా జోడించింది. అంతర్జాతీయ ఆహార ఉత్పత్తులకు స్థానిక రుచులను తీసుకురావడంతో కొత్తతరానికి నచ్చింది. మెక్‌డోనాల్డ్ విజయవంతం కావడంతో ఆ తర్వాత కేఎఫ్‌సీ అవుట్‌లెట్స్ వచ్చేశాయి. ఇందులో విక్రయించే చికెన్‌వేపుళ్లు అయితే యువతీయువకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. లొట్టలేసుకుంటూ తినేస్తున్నారంతా!. అందుకే దేశవ్యాప్తంగా 1191 అవుట్‌లెట్లను ఏర్పాటు చేసింది కేఎఫ్‌సీ. ఇక, స్నాక్స్‌లో అత్యధిక భారతీయ పిల్లలు ఇష్టపడేది డోనట్. ఇది మొదట నెదర్లాండ్‌లో వచ్చింది. పంతొమ్మిదవ శతాబ్దంలో అమెరికాలోకి ప్రవేశించింది.
డంకిన్ డోనట్స్, క్రిస్పీక్రీమ్ వంటి సంస్థలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇండియాలోకి ఇరవయ్యవ శతాబ్దంలో డోనట్స్ ప్రవేశించాయి. మొదట్లో పెద్ద పెద్ద నగరాల్లో లభించేవి.. ఇప్పుడు ఓ మోస్తరు పట్టణాల్లోని బేకరీల్లో కూడా డోనట్స్ లభిస్తున్నాయి. ఐరోపా వాసులు ఇష్టంగా తినే స్నాక్స్‌లో వఫెల్స్ ముఖ్యమైనవి. మధ్యయుగంలో ఉన్నప్పుడు బెల్జియంలో ప్రారంభమైన వఫెల్స్ ఐరోపా ఖండమంతా వ్యాపించాయి. భారత్‌లోకి 2001లో ప్రవేశించినట్లు ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. కేఫ్‌లు, డిజర్ట్ అవుట్‌లెట్స్‌లలో తీపితోపాటు రకరకాల రుచికరమైన ఫ్లేవర్లలో అమ్ముతున్నారిప్పుడు. బర్గర్లకు మెక్‌డోనాల్డ్, బర్గర్‌కింగ్, కేఎఫ్‌సీ పేరొందాయి. డోనట్స్‌కు డంకిన్ డోనట్స్, క్రిస్పీక్రీమ్, మ్యాడ్ ఓవర్ డోనట్స్‌లతో పాటు మరికొన్ని సంస్థలు ప్రత్యేకతను చాటుకున్నాయి. వఫెల్స్‌లో అయితే బెల్జియం వఫెల్స్ కొ, వఫెల్స్ హౌస్, ద వఫెల్ పాయింట్ వంటివన్నీ వచ్చేశాయి.
దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన అంతర్జాతీయ బ్రాండ్లు.. మెక్‌డోనాల్డ్‌తో పాటు బర్గర్‌కింగ్, కేఎఫ్‌సీ, చిలీస్ ఫర్ బర్గర్స్, పిజ్జాహట్, డొమినోస్, డన్కిన్‌డోనట్స్.. ఇలా అనేక ఫుడ్ అవుట్‌లెట్లు వస్తూనే ఉన్నాయి. ఇక, పెప్సీకో కంపెనీ తయారుచేసే లేస్, కుర్‌కురే, చీటోస్, డొరిటోస్ వంటివీ బాగా పాపులర్ అయ్యాయి. దేశీయ కంపెనీలైన హల్దీరామ్, బికాజీ, ఐటీసీ, రిలయన్స్ బాలాజీ వేఫర్స్, ప్రభూజీ, ప్రతాప్ స్నాక్స్ వంటి సంస్థలు కూడా చిరుతిళ్ల తయారీ, అమ్మకాల్లో దూసుకెళుతున్నాయి. వీటిలో చాలా కంపెనీలు విదేశాలకు సైతం తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. సంప్రదాయ మిఠాయిలు, చిరుతిళ్ల మార్కెట్‌లో ఇప్పటికీ హల్దీరామ్ ముందంజలో ఉంది. గతేడాది తొమ్మిదివేల కోట్ల రూపాయల పైచిలుకు వ్యాపారం చేసింది. పెప్సీకో ఆరువేల కోట్లు, బాలాజీ వేఫర్స్ ఐదువేల కోట్ల సరుకును విక్రయించాయి. తెలుగు రాష్ట్రాల్లోని స్థానిక బేకరీలు, మిఠాయికొట్లు, కెఫేలలో కూడా కొత్తతరం ఇష్టపడే స్నాక్స్ అందుబాటులోకి వచ్చాయి.
లోకల్ ఫ్లేవర్స్‌తో..
దేశం ఏదైనా, ఆహారపదార్ధాలు వేరైనా.. ఆకలి ఒక్కటే! అదే ఫుడ్ అవుట్‌లెట్ల అవకాశ మంత్రం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఒకే ఆహారపదార్థం.. ఒకే రుచి అనే సూత్రంతో వెళ్లకుండా... స్థానిక ప్రజల అభిరుచులను బేరీజు వేసుకుని.. అందుకు తగ్గట్టు ఫ్లేవర్స్‌ను జోడిస్తున్నాయి కంపెనీలు. బర్గర్లు, పిజ్జాలు, వఫెల్స్, మొమోస్ వంటివన్నీ స్థానికులు ఇష్టపడే రుచుల్లోనే ఫుడ్‌అవుట్‌లెట్లు అందిస్తున్నాయి. ఉదాహరణకు కేఎఫ్‌సీ అవుట్‌లెట్లలో ఒకప్పుడు ఫ్రైడ్‌చికెన్, ఫ్రెంచ్‌ప్రైస్‌లను నేరుగా అందించేవారు. దక్షిణాది రాష్ట్రాల్లో మసాలాలను ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి.. ఇప్పుడు ప్రత్యేక మసాలా ప్యాకెట్లను, చట్నీలను అందిస్తున్నారు. మెక్‌డొనాల్డ్ అందించే బర్గర్లలో కూడా పుదీనా, ఆలూ, మసాలా, పనీర్ వంటి పదార్థాలను జోడించి తయారుచేస్తున్నారు.
చాలా చోట్ల సాస్‌కు బదులు రెడీమేడ్ చట్నీలను సైతం అందిస్తున్నారు. ఇక, కేక్‌లపైన క్రీమ్‌లను, టాపింగ్‌లను కూడా స్థానిక రుచులను దృష్టిలో పెట్టుకుని తయారుచేస్తున్నారు. భారతీయ సంప్రదాయ చిరుతిళ్లలో మసాలా దినుసులు, గింజలు, తృణధాన్యాలకు ప్రాధాన్యం ఉంటుంది. కూరల్లో అయితే ఆకుకూరలు కూరగాయలను ఎక్కువగా తింటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విదేశీస్నాక్స్‌ను తయారుచేస్తున్నాయి ఫుడ్‌అవుట్‌లెట్లు. ఇందుకోసం ఆహారనిపుణులతో అనేక అధ్యయనాలు చేయించి.. ప్రయోగాత్మక వంటలను వండించి.. మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ‘‘ప్రపంచీకరణలో భాగంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లే ఆహారపదార్థాల తయారీ, అభిరుచుల్లోనూ మార్పులు వచ్చాయి. కొత్తతరం వెరైటీలను కోరుకుంటున్నది కానీ స్థానిక రుచుల్లో అత్యధికంగా ఇష్టపడుతోంది.. ఆ ఫ్లేవర్స్‌తో ఎలాంటి స్నాక్స్ వచ్చినా బాగా పాపులర్ అవుతున్నాయి...’’ అని వివరించారు దిల్లీలోని ఓ ఫుడ్ అవుట్‌లెట్‌లో పనిచేసే మనీష్‌గుప్తా.
ఆరోగ్యానికి హాని..
స్నాక్స్‌లో కేవలం ఒకే రకమైన ఆహారపదార్థాలు కాకుండా... హెల్దీ, ఫ్రైడ్, డీప్‌ఫ్రైడ్, బేక్డ్, గ్రిల్డ్, ఎయిర్ ఫ్రైడ్, రోస్టెడ్.. ఇలా అనేక వంట ప్రక్రియలతో చేసిన స్నాక్స్‌ను విక్రయిస్తున్నాయి కంపెనీలు. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలతో కూడా విదేశీస్నాక్స్ తయారవుతున్నాయి. భారత్‌లో మధుమేహం దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ తీపి పదార్థాలతో కూడా కొన్ని ఐటమ్స్ వచ్చాయి. ఇందులో అవకాడో, సాల్ట్, పెప్పర్, బటర్, చీజ్, మసాలాలు, మూలికలను కూడా వాడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా విదేశీస్నాక్స్ నాణ్యతపై దృష్టి పెట్టింది. ఆహారభద్రతపై ఏమాత్రం రాజీపడకుండా నిబంధనలు రూపొందించింది. ఇందుకు అనుగుణంగానే స్నాక్స్‌ను తయారుచేయాలి.
అందుకే నాణ్యత పెరిగింది. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే..మరోవైపు విదేశీస్నాక్స్‌లలో అత్యధిక తీపి, ఉప్పులతో పాటు ప్రిజర్వేటివ్స్ వంటివన్నీ ఉండటంతో పిల్లల ఆరోగ్యంపైన ప్రభావం పడుతోంది. ఎంత సురక్షితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ జంక్ ఫుడ్ కావడంతో.. చిన్న వయసులోనే అత్యధిక క్యాలరీల స్నాక్స్‌ను తినడం వల్ల ఊబకాయం, అధికకొవ్వు, ఉదర సంబంధిత జబ్బులు వస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. మితంగా తింటే అంత హాని ఉండదు కానీ.. మితిమీరి తింటే మాత్రం సమస్యలు కొని తెచ్చుకున్నట్లే! ఏదేమైనా విదేశీస్నాక్స్ హవా మాత్రం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో కూడా భారతీయ సంప్రదాయ స్నాక్స్ మార్కెట్ మరింత విస్తరించనుంది.
- సండే డెస్క్