Share News

వీధికుక్కలకు ‘వీల్‌’ పవర్‌

ABN , Publish Date - Apr 13 , 2025 | 09:57 AM

సాధారణంగా వీధిలోనో, రోడ్డు పక్కనో కాలు విరిగిన కుక్క కనిపిస్తే... నూటికి 99 మంది ‘మనకెందుకులే’ అని చూసీ చూడనట్టుగా వెళ్లిపోతారు. ఎవరో ఒక్కరు మాత్రం ‘అయ్యో పాపం’ అంటూ సపర్యలు చేసే ప్రయత్నం చేస్తారు.

వీధికుక్కలకు ‘వీల్‌’ పవర్‌

వీధికుక్కలను చేరదీసి ఆశ్రయం కల్పించి, ఆహారం పెడతారు కొందరు. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన మైఖేల్‌ జె బెయిన్స్‌ మాత్రం వాటితో పాటు... కాలు కోల్పోయిన శునకాలకు వీల్‌చైర్‌ అమర్చి తిరిగి నడిచేలా చేస్తాడు. అలా ఇప్పటిదాకా 2 వేల కుక్కలను చేరదీసి వాటి బాగోగులు చూస్తున్నాడు. మైఖేల్‌ ‘డాగ్‌ కేర్‌టేకర్‌’గా మారి... తన జీవితాన్ని మూగజీవాలకు అంకితం చేశాడు.

సాధారణంగా వీధిలోనో, రోడ్డు పక్కనో కాలు విరిగిన కుక్క కనిపిస్తే... నూటికి 99 మంది ‘మనకెందుకులే’ అని చూసీ చూడనట్టుగా వెళ్లిపోతారు. ఎవరో ఒక్కరు మాత్రం ‘అయ్యో పాపం’ అంటూ సపర్యలు చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి ఒక్కడే మైఖేల్‌ జె బెయిన్స్‌. థాయ్‌లాండ్‌లో జంతువుల పట్ల జనం పెద్దగా శ్రద్ధ చూపరు. ముఖ్యంగా వీధి కుక్కలను అస్సలు పట్టించు కోరు. అయితే ఆ పనిని తన భుజాల కెత్తుకున్నాడు మైఖేల్‌. స్వీడన్‌కు చెందిన మైఖేల్‌ చెఫ్‌గా పనిచేస్తూ... థాయ్‌లాండ్‌లోని చోన్‌బురిలో స్థిరపడ్డాడు.


రెస్టారెంట్‌ నడిపే ఆయన ఆ ప్రాంతంలో వీధి కుక్కలు ఎక్కువగా ఉండటం చూశాడు. తరచుగా అవి రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, నడవలేని స్థితిలో ఉండటం గమనించాడు. వాటి బాధను చూసి చలించిపోయాడు. గాయపడిన కుక్కలను చేరదీసి వైద్యం అందించడం, ఆహారం పెట్టడం చేశాడు. ఆ తరువాత ‘ద మాన్స్‌ దట్‌ రెస్క్యూస్‌ డాగ్స్‌’ పేరుతో ఒక యానిమల్‌ షెల్టర్‌ ప్రారంభించాడు. ఇప్పటి వరకు 2 వేలకు పైగా కుక్కలు, పిల్లులను రెస్క్యూ చేసి వాటికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు.


విరాళాలతో షెల్టర్‌

పదేళ్ల క్రితం మైఖేల్‌ వీధి కుక్కలు, పిల్లుల కోసం షెల్టర్‌ను ఏర్పాటు చేశాడు. మొదట్లో ఒక్కడే కుక్కలకు కావలసిన వైద్యం, ఆహారం అందించడం వంటివి చూసుకునేవాడు. అయితే క్రమక్రమంగా బాధ్యత పెరుగుతుంటే అందుకు అనుగుణంగా సిబ్బందిని కూడా పెంచుకున్నాడు. ఇప్పుడు ఆయన షెల్టర్‌లో 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వాళ్లందరూ కుక్కలకు ఆహారం పెట్టడం, వాకింగ్‌కి తీసుకెళ్లడం, క్లీనింగ్‌, ఫిజియో చేయించడం, ప్రత్యేక అవసరాలున్న కుక్కలకు హైడ్రోథెరపీ చేయించడం వంటి పనులన్నీ చేస్తుంటారు. ప్రస్తుతం ‘ద మాన్స్‌ దట్‌ రెస్క్యూస్‌ డాగ్స్‌’ షెల్టర్‌లో 600 కుక్కలు ఉన్నాయి.

book5.2.jpg


రోజూ ఉదయం 6 గంటలకు వీల్‌చైర్‌లు అమర్చిన కుక్కలను వాకింగ్‌కు తీసుకెళతారు. ఆ తరువాత వాటికి బ్రేక్‌ఫాస్ట్‌ అందిస్తారు. ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు వాకింగ్‌కు తీసుకెళతారు. ఈ కుక్కలకు అవసరమైన వైద్యం అందించేందుకు ఒక క్లినిక్‌ను ఏర్పాటు చేశాడు మైఖేల్‌. అందులో ఇద్దరు వెటర్నరీ వైద్యులు, ఒక సహాయకుడు పనిచేస్తుంటారు. ఈ షెల్టర్‌లో ఉండే ప్రతి కుక్కకు తప్పకుండా వ్యాక్సిన్‌ వేస్తారు. ప్యారలైజ్డ్‌ అయిన కుక్కలు 30 వరకు ఉన్నాయి. వాటికి ప్రత్యేకంగా తయారుచేయించిన వీల్‌చైర్‌లు అమర్చి నడిచేలా చేస్తున్నారు. ‘‘పక్షవాతంతో కాళ్లు కోల్పోయిన కుక్కకు మొదటిసారి వీల్‌చైర్‌ అమర్చి నడిచేలా చేసినప్పుడు కుక్క కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది’’ అంటారు మైఖేల్‌.


కొవిడ్‌ ప్రభావం నుంచి తేరుకుని...

చాలాకాలం నుంచి దేశ విదేశాలలోని యానిమల్‌ లవర్స్‌ పంపే విరాళాలతో షెల్టర్‌ నడుస్తూ వచ్చేది. అయితే కొవిడ్‌ తీవ్ర ప్రభావాన్ని చూపించింది. విరాళాలు తగ్గిపోయాయి. ‘‘కొవిడ్‌ ప్రభావం మాలాగా షెల్టర్‌లు నడుపుతున్న చాలామందిపై పడింది. కొవిడ్‌ కారణంగా విరాళాల్లో 40 శాతానికి పైగా తగ్గిపోయాయి. ఒకరకంగా క్లిష్ట సమయమే. అలాగని చూస్తూ చూస్తూ మూగజీవాలకు చేస్తున్న సేవలను ఆపలేం కదా. కొన్ని ఖర్చులు తగ్గించుకుని ఎలాగోలా నెట్టుకొచ్చాం. క్లినిక్‌ని 7 రోజులకు బదులు 5 రోజులే నడిపించాం. పనికి స్థానికుల సహాయం తీసుకున్నాం. వాళ్లు వలంటీర్లుగా పనిచేశారు. అతి కష్టం మీద ఆ క్లిష్ట పరిస్థితులను అధిగమించాం. ప్రస్తుతం షెల్టర్‌ కుదుటపడింది. చాలామంది దాతలు సాయం చేస్తున్నారు. మూగజీవాల చలనానికి సహకరించడం, వాటికి సేవ చేయడంలో తెలియని తృప్తి లభిస్తోంది’’ అంటున్నారు మైఖేల్‌. ఆయన పట్ల విశ్వాసం వాటి కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది.

book5.3.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్‌ కారు

ఇదేం ప్రభుత్వం.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్

Weather Alert: రాష్ట్రంలో మండుతున్న ఎండలు

Rahul Raj: కారడవిలో కాలి నడక

Read Latest Telangana News and National News

Updated Date - Apr 13 , 2025 | 09:57 AM