ఆ పల్లె ఇంట.. కవలల పంట
ABN , Publish Date - Apr 06 , 2025 | 10:29 AM
ఆ ఊర్లో మొత్తం కవల పిల్లలే. దాదాపు 120 మంది కవల జంటలున్నాయి. దీంతో ఆ గ్రామం ప్రముఖంగా, కవలల గ్రామంగా ప్రాముఖ్యంలోకి వచ్చింది. ఆ ఊరు ఎక్కడుందో.., ఆ ఊరి ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వార్తను చదవాల్సిందే మరి. మరి ఆలస్యం ఎందుకు.. చదివేద్దాం పదండి.

పిల్లలు పుట్టకపోతే కోటి దేవుళ్లకు మొక్కుతారు. టెస్ట్‌ట్యూబ్ బేబీల కోసం లక్షలు ఖర్చు పెడతారు. అదేం అదృష్టమో కానీ తూర్పుగోదావరి జిల్లాలోని పెద్ద దొడ్డిగుంట వాసులు మాత్రం కడుపునిండా బావినీళ్లు తాగి.. కవల పిల్లలను కంటున్నారు. నూటాయాభై ఏళ్ల నుంచీ ఊర్లోని ఆ నూతి నీళ్ల వల్లే కవలలు జన్మిస్తున్నారని గ్రామస్థులు నమ్ముతున్నారు. ఇప్పుడా ఊర్లో 120 కవల జంటలున్నాయి. దేశంలో కేరళలోని కోడిన్హి తర్వాత అత్యధిక కవలల గ్రామంగా ప్రసిద్ధికెక్కింది పెద్ద దొడ్డిగుంట..
‘
‘ఒరే రాముడూ ఇలారా. మీ నాన్నగారు బాగున్నారా? నువ్వెన్నో క్లాసురా..? శ్రద్ధగానే చదువుతున్నావా?’’
ఊర్లో కనిపించిన ఓ విద్యార్థిని కుశలప్రశ్నలు అడిగాడు దూరపు బంధువు.
‘‘మావయ్యా.. మీరు పొరబడ్డారు. నేను రాముడిని కాదు.. వాడు మా అన్నయ్య. నేను చిన్నోడైన లక్ష్మణున్ని. మీరు ప్రతిసారీ కన్ఫ్యూజ్ అవుతున్నారు...’’
ఈ వార్తను కూడా చదవండి: పెద్దవాళ్లతో ప్రయాణాలా.. అయితే ఒక్కసారి..
ముసిముసి నవ్వులతో చెప్పేశాడా విద్యార్థి.
‘‘ఓర్నీ.. నేనెప్పుడూ కనుక్కోలేకపోతున్నా మిమ్మల్ని. మొన్న కూడా ఇలాగే పొరబడ్డాను కవల పిల్లలతో ఇదే ఇబ్బంది’’ అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడా పెద్దాయన.
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం, రంగంపేట మండలంలోని ‘పెద్ద దొడ్డిగుంట’ గ్రామంలో కనిపించిన దృశ్యం అది. సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతుంటారు పెద్దలు.. కానీ వారు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు. జంటలైన కవలపిల్లలు మాత్రం ఈ ఊరి నిండా ఉన్నారు. అదే వింత!.
ఒకే రూపం, ఒకటే ఎత్తు, ఒకటే బరువు.. అస్సలు కనుక్కోలేరు. ఒకేరకమైన దుస్తులు వేసుకుంటే.. తల్లిదండ్రులు సైతం పట్టిచూస్తే కానీ కనుక్కోలేని పరిస్థితి. సాధారణంగా ఒక ఊరికి ఒక కవలపిల్లల జంట కనిపించడమే అరుదు. పెద్ద్ద దొడ్డిగుంటలో మాత్రం ఏకంగా నూటా ఇరవై కవల పిల్లలు ఉండటంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
ఒకే పోలికతో ఉన్న సమరూప, సహజాత కవలలు ఇంటింటికీ ఉండటం విశేషం. ఒకే పోలికతో అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెళ్లు బోలెడంత మంది ఉన్నారు. ఇంతమంది కవలపిల్లలున్న ఊరు మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. తరాల నుంచీ తమ ఊర్లో కవలపిల్లలు పుడుతున్నారని స్థానికులు చెప్పుకొచ్చారు. రాజమహేంద్రవరానికి ముప్పయి కి.మీ. దూరంలో ఉందీ గ్రామం.
అంతా ఆ నీళ్ల మహత్యమేనా..?
తూర్పుగోదావరి జిల్లాలోని పెద్ద దొడ్డిగుంట నాలుగువేల జనాభా కలిగిన పచ్చటి పల్లెటూరు. ఆ ఊర్లో ఒక నుయ్యి ఉంది. ఆ చిన్న బావి నీళ్లే ఊరికి దాహం తీరుస్తోంది. ఏంటీ బావి మహత్యం? ఆ నీళ్లలో ఏముంది? వంటి విషయాలేవీ శాస్త్రీయంగా నిరూపితం కాలేదు కానీ.. ఆ నీళ్లు తాగడం వల్లే కవలపిల్లలు పుడుతున్నారన్నది గ్రామస్థుల విశ్వాసం.
‘‘మా ఊరి నిండా కవలలు ఉన్నారంటే ఇంతకంటే శాస్త్రీయ రుజువు ఏం కావాలి? చుట్టుపక్కల ఏ ఊరిలోనూ లేనంతమంది కవలలు మా ఊర్లో ఉండటం విశేషమే కదా!. వందేళ్లకు పైబడిన చరిత్ర కలిగిన మా ఊరి బావిలోని నీళ్లు తాగడం వల్లే కవలలు పుడుతున్నారని మా పెద్దలు చెబితే తెలిసింది. ఇప్పుడు అదే విషయాన్ని మా పిల్లలకు చెబుతున్నాము..’’ అన్నాడు పెద్ద్ద దొడ్డిగుంట గ్రామానికి చెందిన ఒక పెద్దాయన.
అసలీ బావిలోని నీళ్లకు అంత మహత్యం ఉందా? సంతాన సాఫల్యానికి సంబంధించి.. అత్యాధునిక శాస్త్ర సాంకేతికతలతో దూసుకెళుతున్న వైద్య ప్రపంచానికి సాధ్యం కానిది.. ఈ బావి నీళ్లకు సాధ్యమా? ఇది కేవలం నమ్మకమేనా? శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అనే చర్చ కూడా జరిగింది. కొందరు ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు బావిలోని నీటిని తీసుకెళ్లి ల్యాబ్‌లలో పరీక్షించారు కూడా. ఇంకా సంపూర్ణ పరిశోధనలు జరగాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
పుడుతూనే ఉన్నారు..
పెద్ద దొడ్డిగుంట వ్యవసాయ గ్రామం. పచ్చటి పొలాల మధ్య ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా ఉంటుంది. ఊరంతా అనురాగాప్యాయతలతో ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ పల్లె ఉభయగోదావరి జిల్లాల్లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందింది. కేవలం కవలల గ్రామంగా గుర్తింపు లభించింది. ఊర్లో నూటా యాభై ఏళ్ల క్రితం తవ్విన మంచినీటి బావి నీళ్ల వల్లే కవలలు జన్మిస్తున్నారని చరిత్ర చెబుతోంది. ఈ గ్రామంలో 1915లో కొండేపూడి యేసుదాసు, వెంకాయమ్మ దంపతులకు కవలలు (రామాయమ్మ, లక్ష్మమ్మ) పుట్టారు. చూడముచ్చటైన ఆ ఇద్దరు ఆడపిల్లల్ని చూసి ఆ తల్లిదండ్రులు అప్పట్లో మురిసిపోయారు. ఊర్లో కూడా వాళ్లు కవలలు కావడంతో గుర్తింపు లభించింది. ఆ తర్వాత 1952లో వెలమర్తి సూర్యనారాయణ, సూర్యకాంతం దంపతులకు రాముడు, లక్ష్మణుడు అనే కవలలు జన్మించారు.
అప్పటికైతే కవలలు తక్కువే!. ఆ తర్వాత 1969లో ఆడబాల నరసింహమూర్తి, సూర్యవతి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కవలలుగా జన్మించారు. ఇక, అక్కడి నుంచీ ఊర్లో చర్చ మొదలైంది. జంట పిల్లలు పుడుతున్నారని గ్రామస్థులు తెలుసుకున్నారు. 2011లో కస్తూరి ప్రకాశరావు, లక్ష్మి దంపతులకు సత్యప్రకాష్, సూర్యప్రకాష్ అనే ఇద్దరు మగపిల్లలు పుట్టడంతో ఊరికి ఏదో విశేషముందని అర్థమైంది. అలాగే మడికి చిన్నోడు, మేరి దంపతులకు అరుణ్‌కుమార్, ప్రేమ్ కుమార్‌లు కలిగారు. ఇక, అప్పటి నుంచీ కవలల పుట్టుక ఆగలేదు. వరుసపెట్టి ఊర్లోని భార్యాభర్తలకు కవలపిల్లలు పుడుతూనే ఉన్నారు. అసలు ఒక దశలో ఎవరింట్లో ట్విన్స్ ఉన్నారో తెలుసుకోలేనంతగా విస్తరించిందీ ధోరణి. ప్రస్తుతం లెక్కిస్తే సుమారు 120 కవల జంటలు ఉన్నాయని తేలింది.
ఈ కుటుంబాల్లోని పురుషులు, మహిళలు అందరూ ఊర్లో ఉన్న బావిలో నీళ్లు తాగినవాళ్లే! అందుకే ఆ నూతి నీళ్లతోనే కవలలు పుడుతున్నారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం పెద్ద దొడ్డిగుంటలో ఆరేళ్ల పిల్లల నుంచీ అరవై ఏళ్ల వృద్ధుల వరకు కవలలు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది.
‘‘మా ఊరి నూతిలోని నీళ్లలో అరుదైన ఔషధగుణాలు ఉన్నాయనిపిస్తుంది. లేకపోతే ఇంతమంది కవలలు జన్మించరు కదా!. దీని మీద సమగ్రమైన పరిశోధనలు జరగాలి. అప్పుడే శాస్త్రీయ ఆధారాలు లభిస్తాయి. వందమందికి పైగా కవలలున్న ఊరుగా ప్రసిద్ధి చెందడం మాకు గర్వకారణం’’ అంటున్నారు స్థానిక యువతీయువకులు.
వెలుగులోకి తెచ్చిన టీచర్..
కవలపిల్లల ఊరు గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది ఒక ఉపాధ్యాయుడు. ఆయన పేరు బండి శ్రీనివాస్‌రావు. ఇరవై ఏళ్లక్రితం... ఆయన జనాభా లెక్కలు రాసుకోవడానికి ఆ ఊరికి వచ్చారు. చాలా ఇళ్లలో కవలలు ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయాడు. ‘‘ఇదేంటి? ఎక్కడాలేదే ఈ వింత? ఒకే ఊర్లో ఇంతమంది కవల పిల్లలా..? ఇది కచ్చితంగా పరిశోధించదగ్గ విషయమే’’ అనిపించింది. ఊర్లోని పెద్దలు, మహిళలను ఆరాతీశాడు. ‘‘మాస్టారు.. మేమంతా ఊర్లో ఉన్న బావిలోని నీళ్లనే తాగుతున్నాం. అందువల్లే కవలలు పుడుతున్నారు..’’ అని జవాబు చెప్పారు. కానీ, పల్లె ప్రజలు చెప్పిన మాట ఉపాధ్యాయునికి రుచించలేదు. ఆధారాల్లేకుండా ఎలా చెప్పగలం? అన్నది ఆయన ఆలోచన. అందుకే తనూ నమ్మలేదు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు బదిలీపైన అదే ఊరికి వచ్చారు టీచర్ శ్రీనివాస్.
ఆయన కుటుంబం అక్కడే నివాసం ఉండాల్సి వచ్చింది. అప్పటికే వారికి ఒక బాబు. పెద్ద దొడ్డిగుంటకు వచ్చాక స్థానిక బావి నీళ్లే తాగారు. కొన్నాళ్లకు ఆ ఉపాధ్యాయ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. దాంతో ఆయన అభిప్రాయం మారింది. ఇక్కడి నీళ్లలో ఏదో మహత్యం ఉందని భావించారు. ఎప్పుడైతే టీచర్ ఇంట కవల పిల్లలు పుట్టారో.. అప్పటి నుంచీ ఆ ఊరి పేరు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది. కవలల ఊరుగా ప్రసారసాధనాల్లో మార్మోగింది. ఆ టీచర్ వల్లే తమ ఊరికి అంత పేరొచ్చిందంటున్నారు గ్రామస్థులు. మొత్తానికి మన దేశంలో అత్యధిక కవలలున్న రెండో గ్రామంగా ప్రసిద్ధికెక్కిన పెద్ద దొడ్డిగుంట.. ఇప్పుడో చిన్న టూరిస్టు ప్లేస్‌గా మారింది. ఈ రకంగానైనా మా ఊరికి పేరొచ్చిందని సంబరపడుతున్నారు గ్రామస్థులు.
- బత్తిన వెంకటేశ్వర్లు
ఆంధ్రజ్యోతి, రంగంపేట
‘‘కవల పిల్లలు జన్మించడం ఒక ప్రత్యేక అనుభవం. ఇలా జంట పిల్లల పుట్టుక అనేది వంశపారంపర్యంగా వస్తుంది. కొంతమందిలో ఎలాంటి జన్యుకారణాలు లేకపోయినా.. అరుదుగా కవలలు పుడతారు. వైద్య పరిజ్ఞానం ప్రకారం కవలలు జన్మించాలంటే.. తల్లి గర్భంలో రెండు అండాలు ఒకే సమయంలో శుక్ర కణంతో ఫలదీకరణం చెందితే కవలలు పుడతారు. ఇక, పెద్ద దొడ్డికుంట గ్రామంలోని బావి నీరు తాగితే కవలలు పుడతారన్నది స్థానికుల విశ్వాసం. నిజంగానే ఈ ఊర్లో చాలామంది కవలలు ఉన్నారు. బావిలోని నీటిని అన్ని కోణాల్లో లోతుగా పరీక్షిస్తే కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది.’’
- బి.వేణుశ్రీ లక్ష్మి, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి, రంగంపేట
‘‘మా ఊరి బావిలోని నీళ్లు తాగితే కవలలు పుడతారన్నది పూర్వం నుంచి వస్తున్న నమ్మకం. అందులో ఎంత శాస్త్రీయత ఉందో మాకు తెలియదు. నేటి ప్రభుత్వాలు కూడా పిల్లల్ని ఎక్కువగా కనమంటున్నాయి. జనాభా ఎక్కువైతే మన దేశ సంపద కూడా పెరుగుతుంది. పిల్లలు ఉంటే భవిష్యత్తులో కుటుంబానికి అండ లభిస్తుంది. మా ఊరికి ఇంత పేరొచ్చింది కాబట్టి... అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక్కడికి పలు జిల్లాలు, రాష్ట్రాల దంపతులు నీళ్లు తీసుకెళ్లేందుకు వస్తుంటారు. వారికి వసతి ఏర్పాటు చేస్తే మంచిది.
- అడబాల మరిడియ్య, పెద్దదొడ్డిగుంట
ప్రపంచమంతా ఉన్నారు..
ఆంధ్రప్రదేశ్‌లోని పెద్ద దొడ్డిగుంటలో 120 కవలలు ఉన్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల ఉన్నారు. భారత్‌లో అయితే కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న మారుమూల గ్రామం కోడిన్హి ఇలాంటిదే!. ఇక్కడ సుమారు 400 కవలలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అంతర్జాతీయ జన్యుపరిశోధనల బృందం సైతం ఈ ఊరికి వచ్చి కవలల లాలాజలం, వెంట్రుకలను తీసుకెళ్లి జన్యు పరిశోధనలు చేపట్టింది. రెండు వేల జనాభా ఉన్న కోడిన్హి ట్విన్స్ విలేజ్‌గా ప్రసిద్ధి చెందింది. కవల పిల్లల జననంలో జాతీయ సగటు వెయ్యికి తొమ్మిది మందే ఉండగా.. అదే కేరళ గ్రామంలో 45 మంది పుడుతున్నారు.
ఈ అరుదైన విషయాన్ని అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ పరిశోధన బృందం కొన్నేళ్ల కిందట జన్యుపరిశోధనలు చేపట్టింది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కేరళలోని యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్, ఇంగ్లండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ లండన్, జర్మనీ పరిశోధకులు అప్పట్లో కోడిన్హి వెళ్లారు. కవలలపై జన్యుపరిశోధనలకు అవసరమైనవన్నీ సేకరించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కవలలు అధికంగా జన్మిస్తున్నారు. దక్షిణ వియత్నాంలోని హంగ్‌హైప్‌లో ఉన్న హంగ్‌లాక్ కమ్యూన్, నైజీరియాలోని ఇగ్బో-ఓరా, బ్రెజిల్‌లోని కాండిడో గోడోయి వంటివి కూడా కవలల పల్లెలే!. కేరళ సహా వీటన్నిటినీ కలిపి అంతర్జాతీయ జన్యు పరిశోధన బృందం పరిశోధనలు చేస్తోంది.
తెలంగాణలో కూడా..
ఆంధ్రప్రదేశ్‌లో కవల పిల్లల గ్రామం ఉన్నట్లే.. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో కూడా అలాంటి పల్లెటూరే ఉందొకటి. తాంసీ మండలంలోని ఆ గ్రామం పేరు ‘వడ్డాడి’. ఈ ఊర్లో పది కవల జంటలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా ట్విన్స్ పెరిగే అవకాశం ఉందని గ్రామస్థులు భావిస్తున్నారు. ఊరి ప్రజలకు ఇష్టదైవమైన లక్ష్మీనరసింహస్వామి కృపతోనే కవలలు జన్మిస్తున్నారని గ్రామస్థులు విశ్వసిస్తున్నారు. ఊర్లో చాలామంది కవల పిల్లలకు కావ్య-దివ్య, గౌతమి-గాయత్రి, విశాల్-విరాట్, వర్షిత్-హర్షిత్ ... ఇలా పేర్లు పెట్టుకున్నారు. వడ్డాడి అంటే కవలల పల్లెగా చుట్టుపక్కల గ్రామాల్లో పేరుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
పోస్టల్ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తారట..!
కేంద్ర పెట్టుబడి సాయం రూ.18 వేలకు పెంచాలి
మెట్రో రైల్‌పై బెట్టింగ్ యాప్‌ల ప్రచారం ఆపండి
Read Latest Telangana News and National News