Financial Tips For Newly Weds: కొత్తగా పెళ్లైన వాళ్లు ఫాలో కావాల్సిన ఆర్థిక సూత్రాలు
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:58 PM
కొత్తగా పెళ్లైన వారు ఆర్థిక అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వివాదాలు తలెత్తి బంధానికి బీటలు ఏర్పడతాయి. కాబట్టి ఆర్థిక అంశాల్లో యువ దంపతులు పాటించాల్సిన సూత్రాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: ఆలూమగల మధ్య ఆర్థిక వివాదాలు కామన్. విడాకులకు ప్రధాన కారణాల్లో ఆర్థిక ఆంశాలు మూడో స్థానంలో ఉన్నాయంటే ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇట్టే అర్థం చేసుకోవద్దు. దంపతుల మధ్య డబ్బు ఓ సమస్యగా మారకూడదంటే కొన్ని పద్ధతులు కచ్చితంగా పాటించాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు. పెళ్లైన నాటి నుంచే ఈ సూచనలు అమల్లో పెట్టాలని చెబుతున్నారు.
వాస్తవానికి పెళ్లికి ముందే యువతీయువకులు తమ ఆర్థిక దృక్పథం గురించి కాబోయే భాగస్వామితో స్పష్టంగా పంచుకోవాలి. అప్పులు, ఆస్తులు, సంపాదన వంటివన్నీ నిర్మొహమాటంగా వెల్లడించాలి. అభిప్రాయాలు కలిశాకే పెళ్లిపీటలెక్కాలి.
పొదుపు, ఖర్చుల గురించి ఎవరి అభిప్రాయం వారిది. జీవిత భాగస్వామితో ఈ విషయంలో పొసగనప్పుడు మధ్యేమార్గం కోసం ఇద్దరూ అన్వేషించాలి. ఖర్చులకు ఓ పరిమితి విధించుకోవాలి. తమ కంటూ ఖర్చుల కోసం ఓ ప్రత్యేక అకౌంట్ కేటాయించుకోవడం మంచిది.
Also Read: ఈ బాస్ నిజంగా గ్రేట్.. 70 ఉద్యోగులను తీసేశాక..
డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు క్రెడిట్ కార్డులు, ఇతరత్రా అప్పులు చేయడకంటే చేతిలో ఉన్న డబ్బు ఖర్చుపెట్టడం మంచిది. దీంతో, ఖర్చులపై కొంత వరకూ అదుపు ఉంటుంది. భార్యాభర్తలు తమ శాలరీలో కుటుంబం కోసం ఎంత ఇచ్చేది ముందుగానే ఓ నిర్ణయానికి రావాలి. దానికి కట్టుబడి ఉండాలి. దీంతో, డబ్బు వ్యవహారాల్లో పారదర్శకత ఉంటుంది.
దీర్ఝకాలిక, స్వల్ప కాలిక లక్ష్యాలు ఏమిటో ముందుగా నిర్దేశించుకోవాలి. రిటైర్మెంట్ నిధి, అత్యవసర నిధికి ఎంత కేటాయించాలో ఓ నిర్ణయానికి రావాలి. పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రుల సంరక్షణ ఖర్చులకు ఎవరెంత కేటాయించేదీ కూలంకషంగా చర్చించాలి. ఈ లక్ష్యాలను ప్రతి ఏటా సమీక్షించుకోవాలి. అవసరమనుకుంటే, ఫైనాన్షియల్ ప్లానర్స్ సలహాలు కూడా తీసుకోవాలి.
తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో మరింత స్పష్టంగా ఉండాలి. అత్తమామలు, లేదా తల్లిదండ్రుల ఆరోగ్య ఖర్చులు వంటివాటికి ఎవరెంత ఇవ్వగలరో ఓపెన్‌గా చర్చించుకోవాలి. కుటుంబసభ్యులకు ఇచ్చే బహుమతుల ఖర్చుల విషయంలో కూడా అంచనాకు రావాలి.
Also Read: ఏఐ ఎఫెక్ట్.. నెలకు రూ.1.5 లక్షలు ఆర్జిస్తున్న పదో తరగతి కుర్రాడు
భార్య లేదా భర్తకు ఉద్యోగం లేని సందర్భాల్లో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. ముఖ్యంగా మహిళలు పిల్లల పెంపకం కోసం కెరీర్‌ను త్యాగం చేయాల్సి రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఇంటిపట్టునే ఉన్నప్పుడు ఆదాయ మార్గాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి.
రాబడి ఖర్చులను ప్రతి నెల సమీక్షించుకోవాలి. పొదుపు, పెట్టుబడుల లక్ష్యాల దిశగా పురోగమిస్తున్నదీ లేనిదీ చెక్ చేసుకోవాలి. దారి మళ్లుతున్నట్టు అనిపిస్తే వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగాలి.
ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి వద్ద గోప్యత అస్సలు ఉండకూడదు. ఇది అపార్థాలకు తావిస్తుంది. అలా కాకుండా పాదర్శకంగా ఉంటే భార్యాభర్తల మధ్య నమ్మకం పెరిగి కాపురం సజావుగా సాగుతుంది.
ఇవి కూడా చదవండి:
రోజూ ఉదయం 10 గంటల లోపు ఇవన్నీ చేస్తే లైఫ్‌లో ఊహించని మార్పులు!
జీవితంలో సంతోషం ఉచ్ఛస్థితికి చేరేది ఈ ఏజ్‌లోనే అంటున్న శాస్రవేత్తలు
ఈ మార్పులు కనిపిస్తే మీ జీవ క్రియలు నెమ్మదిస్తున్నట్టే!