కొత్త కుర్రాడు పడగొట్టాడు
ABN , Publish Date - Apr 01 , 2025 | 03:06 AM
ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు విజయం రుచి చూసింది. రెండు వరుస ఓటములతో డీలా పడిన ఈ జట్టు సొంత మైదానంలో ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన...

ఐపీఎల్‌లో నేడు
వేదిక లఖ్‌నవూ రా.7.30
లఖ్‌నవూ X పంజాబ్
4 వికెట్లతో సత్తా చాటిన అశ్వని కుమార్
ముంబై బోణీ
కోల్‌కతా చిత్తు
రికెల్టన్ మెరుపు ఇన్నింగ్స్
ముంబై: ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు విజయం రుచి చూసింది. రెండు వరుస ఓటములతో డీలా పడిన ఈ జట్టు సొంత మైదానంలో ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అరంగేట్ర పేసర్ అశ్వని కుమార్ (4/24) చిరస్మరణీయ ప్రదర్శనతో మురిపించాడు. అటు బ్యాటింగ్‌లో ఓపెనర్ రికెల్టన్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 నాటౌట్) చెలరేగడంతో ముంబై మరో 43 బంతులుండగానే 8 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 16.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. రఘువంశి (16 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26), రమణ్‌దీప్ సింగ్ (12 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 22) మాత్రమే ఆకట్టుకున్నారు. ముంబై పేసర్ దీపక్ చాహర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబై 12.5 ఓవర్లలోనే 121/2 స్కోరు చేసి సులువుగా నెగ్గింది. సూర్యకుమార్ (9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 నాటౌట్) వేగంగా ఆడాడు. రస్సెల్‌కు రెండు వికెట్లు లభించాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అశ్వని కుమార్ నిలిచాడు.
రికెల్టన్ జోరు: స్వల్ప ఛేదనను ముంబై అలవోకగా పూర్తి చేసింది. ఓపెనర్ రికెల్టన్ మైదానం నలువైపులా షాట్లతో తుదికంటా నిలిచాడు. తొలి ఓవర్‌లో పేసర్ జాన్సన్ ఒక్క పరుగే ఇచ్చినా.. తర్వాత లయ అందుకున్న రికెల్టన్ ఎక్కడా తగ్గలేదు. మూడో ఓవర్‌లో 4,6.. నాలుగో ఓవర్‌లో 4,6,4తో చెలరేగాడు. రోహిత్ (13)తో తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. పవర్‌ప్లేలోనే 55/1 స్కోరు సాధించిన ముంబైని ఆ తర్వాత కూడా కోలల్‌తా బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. స్పిన్నర్ నరైన్ ఓవర్‌లోనూ రెండు వరుస సిక్సర్లతో ఆకట్టుకున్న రికెల్టన్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. విల్ జాక్స్ (16) తర్వాత బరిలోకి దిగిన సూర్యకుమార్ 4,4,6తో 13వ ఓవర్‌లో మ్యాచ్‌ను ముగించేశాడు.
పేసర్ల ఉచ్చులో..: వాంఖడే అంటేనే బ్యాటింగ్‌కు స్వర్గధామం అంటారు. కానీ అద్భుత బ్యాటింగ్ లైనప్ కలిగిన కోల్‌కతా బ్యాటర్లు.. ముంబై బౌలర్ల ధాటికి తుస్సుమన్నారు. రహానె సేనకు అరంగేట్ర లెఫ్టామ్ పేసర్ అశ్వని కుమార్ చుక్కలు చూపించాడు. అలాగే ఇతర పేసర్లు బౌల్ట్, చాహర్ కట్టుదిట్టమైన బంతులకు కేకేఆర్ బ్యాటర్లకు ఆరంభం నుంచే దిక్కుతోచలేదు. దీంతో పరుగులు కాదు కాదా.. కనీసం వికెట్లు కాపాడుకోలేని పరిస్థితి ఎదురైంది. రఘువంశి మాత్రమే అత్యధికంగా 16 బంతులు ఎదుర్కోగలిగాడు. తొలి ఓవర్‌లోనే అదిరే అవుట్ స్వింగర్‌తో ఓపెనర్ నరైన్‌ను బౌల్ట్ డకౌట్ చేశాడు. ఇక చివరి మ్యాచ్‌లో 97 రన్స్‌తో రాణించిన మరో ఓపెనర్ డికాక్ (1)ను చాహర్ అవుట్ చేయగా 2/2 స్కోరుతో కేకేఆర్ కష్టాలు మొదలయ్యాయి. ఇక అశ్వని తన తొలి బంతికే కెప్టెన్ రహానె (11) పనిబట్టి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. ఈ దశలో రఘువంశి భారీ షాట్లకు వెళ్లి ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ మరో ఎండ్‌లో వెంకటేశ్ అయ్యర్ (3)ను చాహర్ వెనక్కి పంపడంతో కేకేఆర్ పవర్‌ప్లేలో 41/4 స్కోరుతో ఇబ్బందికర స్థితిలో పడింది. రఘువంశిని హార్దిక్ పెవిలియన్ చేర్చాక.. మిగతా బ్యాటర్లు అశ్వనిని ఎదుర్కోవడంలో తడబడ్డారు. ఆరో వికెట్‌కు 29 పరుగులు జోడించి కుదురుకుంటున్న దశలో రింకూ సింగ్ (17), మనీశ్ పాండే (19)లను 11వ ఓవర్‌లో అశ్వని వెనక్కి పంపాడు. అయినా క్రీజులో రస్సెల్ (5), రమణ్‌దీప్ ఉండడంతో భారీ స్కోరుపై కేకేఆర్ ఆశలు వదులుకోలేదు. కానీ అశ్వని తన తర్వాతి ఓవర్‌లోనే ప్రమాదకర రస్సెల్‌ను బౌల్డ్ చేసి ముంబై శిబిరంలో సంతోషం నింపాడు. రమణ్‌దీప్ రెండు సిక్సర్లతో 100 రన్స్ దాటించినా 17వ ఓవర్‌లో అతడిని శాంట్నర్ అవుట్ చేయడంతో కోల్‌కతా ఆట ముగిసింది.
స్కోరుబోర్డు
కోల్‌కతా: డికాక్ (సి) అశ్వని కుమార్ (బి) చాహర్ 1, నరైన్ (బి) బౌల్ట్ 0, రహానె (సి) తిలక్ (బి) అశ్వని కుమార్ 11, రఘువంశి (సి) నమన్ ధిర్ (బి) హార్దిక్ 26, వెంకటేశ్ (సి) రికెల్టన్ (బి) చాహర్ 3, రింకూ (సి) నమన్ ధిర్ (బి) అశ్వని కుమార్ 17, మనీష్ పాండే (బి) అశ్వని కుమార్ 19, రస్సెల్ (బి) అశ్వని కుమార్ 5, రమణ్‌దీప్ (సి) హార్దిక్ (బి) శాంట్నర్ 22, హర్షిత్ (సి) నమన్ ధిర్ (బి) విఘ్నేశ్ 4, జాన్సన్ (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 16.2 ఓవర్లలో 116 ఆటౌట్; వికెట్ల పతనం: 1-1, 2-2, 3-25, 4-41, 5-45, 6-74, 7-80, 8-88, 9-99, 10-116; బౌలింగ్: బౌల్ట్ 4-0-23-1, దీపక్ చాహర్ 2-0-19-2, అశ్వని కుమార్ 3-0-24-4, హార్దిక్ 2-0-10-1, విఘ్నేశ్ 2-0-21-1, శాంట్నర్ 3.2-0-17-1.
ముంబై: రోహిత్ (సి) హర్షిత్ (బి) రస్సెల్ 13, రికెల్టన్(నాటౌట్) 62, విల్ జాక్స్ (సి) రహానె (బి) రస్సెల్ 16, సూర్యకుమార్ (నాటౌట్) 27, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 12.5 ఓవర్లలో 121/2; వికెట్ల పతనం: 1-46, 2-91; బౌలింగ్: జాన్సన్ 2-0-14-0, హర్షిత్ 2-0-28-0, వరుణ్ 3-0-12-0, రస్సెల్ 2.5-0-35-2, నరైన్ 3-0-32-0.
ఎవరీ అశ్వని కుమార్?
ఈ సీజన్‌లో ముంబై పరిచయం చేసిన మరో సంచలనం 23 ఏళ్ల లెఫ్టామ్ పేసర్ అశ్వని కుమార్. ఈ పంజాబ్ కుర్రాడు తన అరంగేట్ర మ్యాచ్‌లోనే పదునైన పేస్‌తో రహానె, రింకూ, మనీష్, రస్సెల్‌ల వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. వాస్తవానికి అశ్వని డెత్ బౌలర్ స్పెషలిస్టు. 2023-24 షేర్ ఏ పంజాబ్ టీ20 టోర్నీలో అతను ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో అశ్వని నైపుణ్యాన్ని పసిగట్టిన ముంబై ఇండియన్స్ జట్టు వేలంలో రూ.30 లక్షలకే అతడిని దక్కించుకుంది. అయితే చివరి సీజన్‌లో అశ్వనిని పంజాబ్ కింగ్స్ జట్టులోకి తీసుకున్నా బెంచ్‌కే పరిమితం చేయడం గమనార్హం.
1
ఐపీఎల్ అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్వని కుమార్. అలాగే ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో తన మొదటి బంతికే వికెట్ తీసిన నాలుగో బౌలర్‌గానూ నిలిచాడు.
1
ఒకే ప్రత్యర్థి (కోల్‌కతా)పై ఒక వేదికలో ఎక్కువ విజయాలు (10) సాధించిన జట్టుగా ముంబై
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
బెంగళూరు 2 2 0 0 4 2.266
ఢిల్లీ 2 2 0 0 4 1.320
లఖ్‌నవూ 2 1 1 0 2 0.963
గుజరాత్ 2 1 1 0 2 0.625
పంజాబ్ 1 1 0 0 2 0.550
ముంబై 3 1 2 0 2 0.309
చెన్నై 3 1 2 0 2 -0.771
హైదరాబాద్ 3 1 2 0 2 -0.871
రాజస్థాన్ 3 1 2 0 2 -1.112
కోల్‌కతా 3 1 2 0 2 -1.428
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
ఇవి కూడా చదవండి..
MS Dhoni: కీలక సమయంలో ధోనీ అవుట్.. చెన్నై అభిమాని రియాక్షన్ చూస్తే
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..