Share News

గుజరాత్‌ అదుర్స్‌

ABN , Publish Date - Apr 03 , 2025 | 02:44 AM

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. డాషింగ్‌ బ్యాటర్‌ జోష్‌ బట్లర్‌ (39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతోపాటు...

గుజరాత్‌ అదుర్స్‌

ఐపీఎల్‌లో నేడు

వేదిక కోల్‌కతా

కోల్‌కతా X హైదరాబాద్‌, రా.7.30

  • మెరిసిన బట్లర్‌, సిరాజ్‌

  • బెంగళూరు చిత్తు

బెంగళూరు: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. డాషింగ్‌ బ్యాటర్‌ జోష్‌ బట్లర్‌ (39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతోపాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సిరాజ్‌ (3/19) విజృంభించడంతో.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 8 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)ని చిత్తు చేసింది. తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 169/8 స్కోరు చేసింది. లివింగ్‌స్టోన్‌ (54), జితేష్‌ శర్మ (33), టిమ్‌ డేవిడ్‌ (32) పోరాడారు. సాయి కిశోర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో గుజరాత్‌ 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి గెలిచింది. సాయి సుదర్శన్‌ (49) రాణించాడు. హాజెల్‌వుడ్‌, భువనేశ్వర్‌ చెరో వికెట్‌ దక్కించుకొన్నారు.


రాణించిన బ్యాటర్లు: బట్లర్‌ అర్ధ శతకంతో రాణించడంతో.. గుజరాత్‌ అలవోకగా నెగ్గింది. సుదర్శన్‌తో కలసి రెండో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన బట్లర్‌.. రూథర్‌ఫోర్డ్‌ (30 నాటౌట్‌)తో కలసి మూడో వికెట్‌కు అజేయంగా 63 పరుగులు జోడించాడు. దీంతో టైటాన్స్‌ మరో 13 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకొంది. ఛేదనలో ఓపెనర్లు సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ (14) తొలి వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యంతో నిలకడైన ఆరంభాన్నిచ్చారు. పవర్‌ప్లేలో గుజరాత్‌ 42/1 స్కోరు చేసింది. ఐదో ఓవర్లో గిల్‌ అవుటైన తర్వాత వచ్చిన బట్లర్‌ తొలుత ఆచితూచి ఆడినా తర్వాత చెలరేగిపోయాడు. అయితే, 13వ ఓవర్‌లో బంతి మార్చడంతో చాలెంజర్స్‌కు బ్రేక్‌ దక్కింది. అర్ధ శతకానికి పరుగు దూరంలో ఉన్న సుదర్శన్‌ను హాజెల్‌వుడ్‌ క్యాచవుట్‌ చేశాడు. కానీ, బట్లర్‌ 4,6తో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. మరో ఎండ్‌లో రూథర్‌ఫోర్డ్‌ కూడా ధాటిగా ఆడాడు. విజయానికి 18 బంతుల్లో 20 పరుగులు కావల్సి ఉండగా.. బట్లర్‌ మూడు సిక్స్‌లతో మ్యాచ్‌ను ముగించాడు.


చెలరేగిన సిరాజ్‌: సిరాజ్‌ నిప్పులు చెరగడంతో.. పవర్‌ప్లేలోనే మూడు టాపార్డర్‌ వికెట్లను కోల్పోయిన బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే గట్టిదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ కోహ్లీ (7)ని అర్షద్‌ క్యాచవుట్‌ చేయగా.. ఆ తర్వాతి ఓవర్‌లో దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (4)ను సిరాజ్‌ బౌల్డ్‌ చేసి షాకిచ్చాడు. సిక్స్‌తో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసిన మరో ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (14)ను కూడా సిరాజ్‌ పెవిలియన్‌ చేర్చడంతో.. ఆరు ఓవర్లకు బెంగళూరు 38/3తో కష్టాల్లో పడింది. కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ (12)ను ఇషాంత్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్నాడు. ఈ దశలో లివింగ్‌ స్టోన్‌కు జత కలసిన జితేష్‌ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి ఆర్‌సీబీ 73/4 స్కోరు చేసింది. కానీ, జితే్‌షను కిశోర్‌ అవుట్‌ చేయడంతో.. ఐదో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన క్రునాల్‌ పాండ్యా (5)ను కూడా కిశోర్‌ రిటర్న్‌ క్యాచ్‌తో వెనక్కిపంపాడు. అయితే, డెత్‌ ఓవర్లలో లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ ధాటిగా ఆడుతూ ఏడో వికెట్‌కు 24 బంతుల్లో 46 పరుగులు జోడించారు. రషీద్‌ వేసిన 18వ ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాదిన లివింగ్‌స్టోన్‌ అర్ధ శతకం పూర్తి చేసుకొన్నాడు. కానీ, ఆవెంటనే సిరాజ్‌ బౌలింగ్‌లో క్యాచవుట్‌ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో డేవిడ్‌ రెండు ఫోర్లు, సిక్స్‌తో టీమ్‌ స్కోరును 160 మార్క్‌ దాటించాడు. మొత్తంగా చివరి 5 ఓవర్లలో బెంగళూరు 64 పరుగులు రాబట్టింది.


స్కోరుబోర్డు

బెంగళూరు: సాల్ట్‌ (బి) సిరాజ్‌ 14, కోహ్లీ (సి) ప్రసిద్ధ్‌ (బి) అర్షద్‌ 7, పడిక్కళ్‌ (బి) సిరాజ్‌ 4, పటీదార్‌ (ఎల్బీ) ఇషాంత్‌ 12, లివింగ్‌స్టోన్‌ (సి) బట్లర్‌ (బి) సిరాజ్‌ 54, జితేశ్‌ (సి) తెవాటియా (బి) సాయి కిషోర్‌ 33, క్రునాల్‌ (సి అండ్‌ బి) సాయి కిషోర్‌ 5, టిమ్‌ డేవిడ్‌ (బి) ప్రసిద్ధ్‌ 32, భువనేశ్వర్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 169/8; వికెట్ల పతనం: 1-8, 2-13, 3-35, 4-42, 5-94, 6-104, 7-150, 8-169. బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-19-3, అర్షద్‌ 2-0-17-1, ప్రసిద్ధ్‌ 4-0-26-1, ఇషాంత్‌ 2-0-27-1, సాయి కిషోర్‌ 4-0-22-2, రషీద్‌ 4-0-54-0.

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) ఇషాంత్‌ (బి) హాజెల్‌వుడ్‌ 49, గిల్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) భువనేశ్వర్‌ 14, బట్లర్‌ (నాటౌట్‌) 73, రూథర్‌ఫర్డ్‌ (నాటౌట్‌) 30, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 17.5 ఓవర్లలో 170/2; వికెట్ల పతనం: 1-32, 2-107; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-23-1, హాజెల్‌వుడ్‌ 3.5-0-43-1, యశ్‌ 3-0-20-0, రసిఖ్‌ 3-0-35-0, క్రునాల్‌ 3-0-34-0, లివింగ్‌స్టోన్‌ 1-0-12-0.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

పంజాబ్‌ 2 2 0 0 4 1.485

ఢిల్లీ 2 2 0 0 4 1.320

బెంగళూరు 3 2 1 0 4 1.149

గుజరాత్‌ 3 2 1 0 4 0.807

ముంబై 3 1 2 0 2 0.309

లఖ్‌నవూ 3 1 2 0 2 -0.150

చెన్నై 3 1 2 0 2 -0.771

హైదరాబాద్‌ 3 1 2 0 2 -0.871

రాజస్థాన్‌ 3 1 2 0 2 -1.112

కోల్‌కతా 3 1 2 0 2 -1.428

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2025 | 02:45 AM