Tummla: ఎకరం వరకున్న రైతుల ఖాతాల్లో ‘భరోసా’ జమ
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:14 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఒక ఎకరం వరకు భూమి ఉన్న మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

17.03 లక్షల మందికి రూ.1,126.54 కోట్లు
నిర్ణీత కాల వ్యవధిలో రైతులందరికీ భరోసా ఇస్తాం
గిట్టుబాటు ధరకు ప్రత్యేక చర్యలు
ఈ యాసంగిలోనూ సన్నాలకు
బోనస్ చెల్లింపు: మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఒక ఎకరం వరకు భూమి ఉన్న మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో రైతు భరోసా నిధులను జమ చేయడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో విడుదల చేసిన నిధులతో కలిపి బుధవారం వరకు మొత్తం రూ.1,126.54 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని ఓ ప్రకటనలో వివరించారు. ఇప్పటికే రైతుబంధు కింద రూ.7,625 కోట్లు, రుణమాఫీ పథకం కింద రూ.20,616.89 కోట్లు, రైతు భీమా కింద రూ.3,000 కోట్లు వ్యయం చేశామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరతో సేకరించామన్నారు.
పత్తి పంటను పూర్తిగా సేకరించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరామని తెలిపారు. మరో రూ.406.24 కోట్లతో సోయాబీన్, పెసళ్లు, కందులు వంటి పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరలకు సేకరించామని వివరించారు. ఈసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అయిందని, ఈ ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే సేకరిస్తున్నామన్నారు. గత యాసంగిలో రూ.10,547 కోట్లతో 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, ఖరీఫ్ సీజన్‌లో రూ.12,178.97 కోట్లతో 52.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని పేర్కొన్నారు. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చి కొనుగోలు చేశామని, దీనికి రూ.1,154 కోట్లు వ్యయం చేశామని తెలిపారు. ఈ యాసంగిలో కూడా సన్నాలకు బోనస్ కొనసాగిస్తామని వివరించారు. పసుపు, మిరప పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా, విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎరువుల కేటాయింపు విషయంలో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. తమ ప్రభుత్వానికి రైతే మొదటి ప్రాధాన్యమని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..
Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..