Nirmal: డ్రోన్లతో అడవిని జల్లెడ పట్టి... తప్పిపోయిన మహిళల గుర్తింపు!
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:28 AM
తునికాకు సేకరణకు వెళ్లిన నలుగురు మహిళలు సాయంత్రం వేళ అడవిలో దారి తప్పారు.. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో రాత్రంగా అడవిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు.. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ స్వయంగా రంగలోకి దిగారు.

తునికాకు సేకరణకు వెళ్లి రాత్రంతా అడవిలోనే చిక్కుకుపోయిన మహిళలు
నిర్మల్ ఎస్పీ జానకి ఆధ్వర్యంలో గాలింపు
2 గంటల్లోనే వారి జాడ కనుగొన్న బృందాలు
సురక్షితంగా ఇంటికి చేరిన నలుగురు మహిళలు
పోలీసులను ఘనంగా సన్మానించిన గ్రామస్థులు
మామడ, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : తునికాకు సేకరణకు వెళ్లిన నలుగురు మహిళలు సాయంత్రం వేళ అడవిలో దారి తప్పారు.. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో రాత్రంగా అడవిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు.. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ స్వయంగా రంగలోకి దిగారు. డ్రోన్లతో అడవిని జల్లెడ పట్టి.. వారి జాడను కనిపెట్టారు.. నిర్మల్ జిల్లాలోని మామడ మండలం కప్పన్‌పల్లి గ్రామ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం తూనికాకు కోసేందుకు గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి నలుగురు మహిళలు వెళ్లారు. అయితే రాత్రి కావడంతో అడవిలోకి వెళ్లిన వారు తప్పిపోయి అక్కడే చిక్కుకుపోయారు.
శుక్రవారం ఉదయం వరకు కూడా వారు ఇంటికి రాలేదు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనా స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయాన్నే మూడు ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతానికి వెళ్లారు. అధునాతన డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటల తర్వాత తప్పిపోయిన నలుగురు మహిళలను గుర్తించి.. సురక్షితంగా వారి ఇంటికి చేర్చారు. తప్పిపోయిన మహిళలను సురక్షితంగా ఇంటికి చేర్చిన ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనాతో పాటు పోలీస్ బృందాలను గ్రామస్థులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. మహిళలను రక్షించడంలో పాల్గొన్న పోలీస్ బృందాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.