Dharani Portal: కోడలికి ‘గిఫ్ట్’ ఇవ్వడం కుదరదు!
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:42 AM
ధరణి పోర్టల్‌ని అడ్డుపెట్టుకుని జరుగుతున్న మోసాలు అన్ని ఇన్ని కావు..! నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని పలుచోట్ల ధరణి ఆపరేటర్ల ద్వారా తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.

ధరణి గిఫ్ట్ డీడ్లలో లోపాయికారి ఒప్పందాలు
రుసుం తగ్గించేలా సిబ్బంది చేతి వాటం
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ని అడ్డుపెట్టుకుని జరుగుతున్న మోసాలు అన్ని ఇన్ని కావు..! నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని పలుచోట్ల ధరణి ఆపరేటర్ల ద్వారా తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. గిఫ్ట్ డీడ్ విషయంలోనూ చేతివాటం చూపి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. భారత స్టాంపుల చట్టంలో ఆర్టికల్ 49 ప్రకారం కుటుంబం అంటే ఎవరు అనే దానిపై స్పష్టత ఇచ్చారు. తండ్రి, తల్లి, భర్త, భార్య, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, తాత, అమ్మమ్మ, నానమ్మ, మనవడు, మనవరాలు, పెంపుడు తండ్రి, పెంపుడు తల్లి, దత్త పుత్రుడు, దత్తకుమార్తె.. వీరు మాత్రమే వారసులుగా, కుటుంబం కింద పరిగణించాలని చట్టంలో ఉంది. వీరికి మాత్రమే గిఫ్ట్ డీడ్, గిఫ్ట్‌సెటిల్‌మెంట్ డీడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో కోడలును ఈ జాబితాలో వారసురాలిగా పరిగణించడానికి అవకాశం లేదు.
ఒకవేళ అలా చేయాలి అనుకుంటే ధరణి పోర్టల్‌లో ‘ఇన్ ఫేవర్ ఆఫ్ అదర్స్’ అనే కాలమ్‌లో మాత్రమే నమోదు చేయాలి. గిఫ్ట్ డీడ్‌కు, కుటుంబ సభ్యుల పేరుతో చేసే గిఫ్ట్ సెటిల్‌మెంట్ డీడ్‌కు, ఇతరుల పేరుతో చేసే గిఫ్ట్ డీడ్‌లకు చలానాలో వ్యత్యాసాలున్నాయి. ఇందులో ఇతరుల పేరుతో జరిగే గిఫ్ట్ డీడ్‌లకు మార్కెట్ విలువ మీద 7ు, అదే కుటుంబ సభ్యుల పేరుతో అయితే 3ు చలానా మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఇతరుల పేరు మీద గిఫ్ట్ సెటిల్‌మెంట్ డీడ్ రిజిస్ట్రేషన్‌కు 4ు, అదే కుటుంబసభ్యుల పేరుతో అయితే 3ు చెల్లించాలి. అయితే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో సరైన ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేశారా లేదా అనే విషయాన్ని అధికారులు గుర్తించకపోయినా, ఐచ్ఛికాలు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నాలు చేసినా ఖజానాకు గండి కొట్టినట్లే అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా సగటున గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు రోజుకు 150కిపైగా జరుగుతున్నాయి. అయితే 7 శాతం చలానాను తప్పించేందుకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్లలో క్షేత్రస్థాయిలో రిజిస్టార్లు అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. వీటిపై ఆడిటింగ్ జరిగితే అధికారులు దొరికిపోయే అవకాశం ఉంటుంది. అయినా అటువంటి చర్యలు తీసుకోవట్లేదు.