Share News

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం లభ్యం

ABN , Publish Date - Mar 10 , 2025 | 04:15 AM

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మందిలో.. 16 రోజుల సహాయక చర్యల తర్వాత ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ర్యాబిన్స్‌ ఆపరేటర్‌ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం లభ్యం

  • సొరంగంలో 7 లేయర్ల కింద గుర్తింపు

  • టీబీఎం ఆపరేటర్‌గా గురుప్రీత్‌ విధులు

  • స్వస్థలం.. పంజాబ్‌లోని చీమాకలాన్‌

  • 25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం

  • మిగతా ఏడుగురి కోసం గాలింపు

  • మరో 2 ప్రాంతాల్ని గుర్తించిన జాగిలాలు

మహబూబ్‌నగర్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/దోమలపెంట, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మందిలో.. 16 రోజుల సహాయక చర్యల తర్వాత ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ర్యాబిన్స్‌ ఆపరేటర్‌ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. ఆయన స్వస్థలం పంజాబ్‌లోని చీమాకలాన్‌. కేరళ నుంచి తెప్పించిన క్యాడవర్‌ డాగ్స్‌ గుర్తించిన చోటే.. గురుప్రీత్‌ మృతదేహం లభ్యమైంది. శనివారం రాత్రి సహాయక బృందాలకు ఓ చేయి కనిపించగా.. కాంక్రీట్‌ మాదిరిగా గట్టిపడ్డ మట్టిలోంచి.. దెబ్బతినకుండా మృతదేహాన్ని తీసేందుకు సహాయక బృందాలు సుమారు 12 గంటల పాటు శ్రమించాయి. మృతదేహం నిలువున ఉన్నట్లు గుర్తించి, 12 అడుగుల మేర తవ్వకాలు జరిపాయి. టీబీఎంకు చెందిన వ్యర్థాలను సైతం.. ఏడు లేయర్ల మేర తొలగించాక, గురుప్రీత్‌సింగ్‌ మృతదేహం లభ్యమైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మృతదేహాన్ని తీయగా.. 6 గంటలకు టన్నెల్‌ నుంచి బయటకు తీసుకువచ్చి, పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రే పోస్టుమార్టం ప్రక్రియ పూర్తవ్వగా.. మృతదేహాన్ని పంజాబ్‌కు తరలించారు. గత సోమవారం నుంచి గాలింపును తీవ్రతరం చేయగా.. జీపీఆర్‌ రాడార్లు, ఆక్వా-ఐ యంత్రాలు, స్నిఫర్‌ డాగ్స్‌, కేరళ నుంచి తెప్పించిన క్యాడవర్‌ శునకాలను వినియోగించారు. జీపీఆర్‌ గుర్తించిన ఐదు ప్రాంతాల్లో కొన్ని చోట్ల తవ్వకాలు జరిపినా.. గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. గురువారం రంగంలోకి దిగిన క్యాడవర్‌ డాగ్స్‌ రెండు ప్రాంతాలను గుర్తించాయి. వాటిల్లో ఓ ప్రాంతం ప్రమాద స్థలికి చేరువలో ఉంది. సింగరేణి, ర్యాట్‌ మైనర్లు చెరో ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. శనివారం రాత్రి ఓ చేయి ఉన్నట్లు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ అసిస్టెంట్‌ కమాండెంట్‌ హరీశ్‌ గుర్తించడంతో.. తవ్వకాలు జరిపారు. ఈ ప్రాంతం టన్నెల్‌లో 13.8 కిలోమీటర్ల దూరంలో.. టీబీఎంకు 50 మీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్యాడవర్‌ డాగ్స్‌ గుర్తించిన మరో ప్రాంతం టీబీఎంకు 16 మీటర్ల దూరంలో ఉంది. ఆదివారం ఈ శునకాలు మరో రెండు ప్రాంతాలను గుర్తించాయి. ఈ మూడు చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ ప్రాంతం సున్నితంగా ఉందని సింగరేణి మైనర్లు చెబుతున్నారు. ఈ 3 ప్రాంతాలు టీబీఎం నుంచి 10-16మీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడ ఊట నీటిని తొలగిస్తుండగా.. మిగతా మట్టి కాంక్రీట్‌ మాదిరిగా గట్టిగా తయారవుతూ తవ్వకాలకు ఆటంకంగా మారిందని వివరిస్తున్నారు. దీంతో.. సహాయక బృందాలపై పైనుంచి మట్టి పెళ్లలు కూలకుండా ఉండేందుకు దుంగలను తెప్పించారు. వీటిని సపోర్ట్‌గా వినియోగించి, తవ్వకాలు జరుపుతారు. క్యాడవర్‌ డాగ్స్‌ గుర్తించిన మూడు ప్రాంతాల్లో 15 అడుగుల మేర మట్టిని తవ్వాల్సి ఉందని అధికారులు చెప్పారు.


క్యాడవర్‌ డాగ్స్‌ రాక

టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు 16 రోజులుగా 12 ఏజెన్సీలకు చెందిన బృందాలు శ్రమిస్తున్నాయి. జీపీఆర్‌ రాడార్‌, ఆక్వా-ఐ పరికరాలను గుర్తించినా.. గల్లంతైన వారిని గుర్తించడం సాధ్యం కాలేదు. దీంతో.. కేరళ పోలీసులు వినియోగించే క్యాడవర్‌ డాగ్స్‌ను రప్పించారు. బెల్జియం మెలినోయిస్‌ జాతికి చెందిన మాయ, మార్ఫి అనే శునకాలను కేరళ బృందాలు రంగంలోకి దింపాయి. కేరళలో ప్రకృతి వైపరీత్యాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు ఎక్కువగా ఉండడంతో.. సుమారు 17 శునకాలను కొనుగోలు చేసి, వాటికి మానవ అవశేషాలను గుర్తించడంలో శిక్షణనిచ్చారు. ఇవి మానవ, జంతు కళేబరాల అవశేషాలను వేర్వేరుగా గుర్తిస్తాయి. నెలలు, సంవత్సరాలు దాటి.. ఎముకలు మాత్రమే భూగర్భంలో ఉన్నా.. ఇవి గుర్తిస్తాయి.


25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం

హైదరాబాద్‌, మార్చి 9(ఆంధ్రజ్యోతి): గురుప్రీత్‌సింగ్‌ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఆయన మృతిపట్ల సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతాపం తెలిపారు. మృతదేహాన్ని పంజాబ్‌కు తరలించామని చెప్పారు. రెవెన్యూ అధికారి రూ.25 లక్షల చెక్కును సిద్ధం చేసి, పంజాబ్‌లోని గురుప్రీత్‌సింగ్‌ కుటుంబానికి అందజేసేందుకు ఇద్దరు సహాయకులను మృతదేహంతో పాటు పంపించామన్నారు. కాగా.. సహాయక చర్యల్లో సీఎం వైఫల్యం, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం జరిగిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థ చెరో రూ.50 లక్షల చొప్పున రూ.కోటి పరిహారం అందించి, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.


మొదటిరోజు చేయి కనిపించిన చోటే..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం జరిగిన మొదటిరోజు లభించిన ఫొటోల్లోనే ఒక చేయి కనిపించింది. ‘ఆంధ్రజ్యోతి’లో ఆ ఫొటో ప్రచురితమైంది. ప్రమాద సమయంలో భయంతో పరుగులు పెట్టిన కార్మికుల్లో ఒకరు తీసిన ఫొటో అది. అందులో ఒక చేయి ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత మరోసారి పైకప్పు కూలడంతో ఆ చేయి ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం సాధ్యం కాలేదు. తాజాగా జీపీఆర్‌తోపాటు క్యాడవర్‌ డాగ్స్‌ ఆ ప్రాంతాన్ని గుర్తించడంతో అక్కడ తవ్వకాలు చేపట్టి, గుర్‌ప్రీత్‌సింగ్‌ మృతదేహాన్ని వెలికి తీశారు.


ఇవి కూడా చదవండి

BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..

TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 10 , 2025 | 04:15 AM