Share News

Revanth Reddy: అప్పులపై తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:40 AM

ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు రూ.1,53,359 కోట్ల అప్పులు చేసిందని, కానీ.. ఇందులో ఎక్కువ మొత్తం గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు, వాటి వడ్డీలు చెల్లించేందుకే ఖర్చు చేశామని తెలిపారు.

Revanth Reddy: అప్పులపై తప్పుడు ప్రచారం

మేం చేసిన అప్పు 1,58,041 కోట్లు.. పాత అప్పులు, వడ్డీలకే 1,53,359 కోట్లు చెల్లించాం

  • నికరంగా మేం చేసిన అప్పు 4,682 కోట్లే

  • ఢిల్లీకి వెళ్లి ఆర్‌ఆర్‌ఆర్‌, మామునూరు విమానాశ్రయం, రక్షణ భూములు సాఽధించా

  • ప్రాజెక్టుల సాక్షిగా తెలంగాణ ప్రజలకు మరణశాసనం రాసిన కేసీఆర్‌

  • మార్చురీకి వెళ్తుందన్నది బీఆర్‌ఎ్‌సనే

  • కేసీఆర్‌ ఆరోగ్యంగా ప్రతిపక్షంలో ఉండాలి

  • అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు రూ.1,53,359 కోట్ల అప్పులు చేసిందని, కానీ.. ఇందులో ఎక్కువ మొత్తం గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు, వాటి వడ్డీలు చెల్లించేందుకే ఖర్చు చేశామని తెలిపారు. అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని తాము నడపదలుచుకోలేదని, చేసింది చేసినట్లు చెబుతామని, చేయనిది ఏదైనా ఉంటే ఎలా చేస్తామో చెబుతామని స్పష్టం చేశారు. శనివారం శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపై తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల గురించి వివరిస్తూ, ‘‘2023 డిసెంబరు 1 నాటికి అప్పులు రూ.6,69,257 కోట్ల అప్పులు ఉన్నాయి. చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులు రూ.40,154 కోట్లు, ఇతర పెండింగ్‌ బిల్లులు రూ.1,09,740 కోట్లు ఉన్నాయి. ఇవి మొత్తం కలిపితే మాజీ సీఎం కేసీఆర్‌ 2023 డిసెంబరు 7న అధికారాన్ని బదలాయించిన నాటికి అప్పులు రూ.8,19 ,151 కోట్లు అయ్యాయి. గత ప్రభుత్వం ఆస్తులు సృష్టించిందంటున్నారు. ఆస్తులతోపాటు పెండింగ్‌లో పెట్టిన కాంట్రాక్లర్ల బిల్లులు, విద్యుత్తు బిల్లులు ఇతరత్రా ఉన్నాయి. మేం రూ.1,52,000 కోట్లు అప్పు తెచ్చామంటున్నారు. కానీ, అది తప్పు. 2023 డిసెంబరు 1 నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు మేం తెచ్చింది రూ.1,58,041 కోట్ల అప్పు. ఇందులో కేసీఆర్‌ చేసిపెట్టిన అప్పునకు చెల్లించింది రూ.88,591 కోట్లు. 2023 డిసెంబరు 1 నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు చెల్లించిన మిత్తీలు రూ.64,768 వేల కోట్లు. అసలు, మిత్తి కలిపి దాదాపు రూ.1,53,359 కోట్లు 15 నెలల్లో చెల్లించాం. నికరంగా మా ప్రభుత్వం చేసిన అప్పు రూ.4,682 కోట్లు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లించేందుకు మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని సీఎం రేవంత్‌ వివరించారు.


లెక్క పక్కాగా ఉంది..

అప్పుల విషయంలో బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావుకు కన్‌ఫ్యూజన్‌ అవసరం లేదని సీఎం రేవంత్‌ అన్నారు. తమ వద్ద లెక్కా పక్కాగా ఉందన్నారు. హరీశ్‌రావు వాదన కరెక్ట్‌ అయితే రూ.6,69,257 కోట్ల గత అప్పునకు.. తాము చేసిన అప్పు రూ.1,58,41 కోట్లు కలిపి మొత్తం అప్పు రూ.8,27,298 కోట్లు ఉండాలన్నారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ.7,38,707 కోట్లు ఉందని తెలిపారు. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మడుగులో దాక్కుంటే శ్రీకృష్ణుడు బయటకు తెచ్చాడని, అదేవిధంగా ఓటమి భయంతో ఫాంహౌ్‌సలో దాక్కున్న కేసీఆర్‌ను అవసరమైనప్పుడు తాము బయటకు రప్పిస్తామని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ వెళ్లింది గోళీలాడేందుకు కాదు..

ప్రతిపక్షాలు తాను పదేపదే ఢిల్లీ వెళ్తున్నానంటూ ప్రచారం చేస్తున్నాయని, అయితే తాను ఢిల్లీ వెళ్లేది గోళీలు ఆడేందుకు కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 15 నెలల్లో 32 సార్లు ఢిల్లీ వెళ్లానని, భవిష్యత్తులో 300 సార్లు వెళ్తానని చెప్పారు. 32 సార్లు ఢిల్లీ పర్యటనలో మూడుసార్లు ప్రధాన మంత్రిని కలిశానని, అందరు కేంద్ర మంత్రుల్ని కలిశానని తెలిపారు. ప్రధాన మంత్రిని కలిసి నివేదిక ఇచ్చి... సంబంధిత మంత్రులకు ఫైల్‌ పంపించి, మంత్రులతో ఫాలోఅప్‌ చేసి ఐఏఎస్‌ ఆఫీసర్‌, క్లర్క్‌ కంటే ఎక్కువగా ప్రతి టేబుల్‌ వద్దకు వెళ్లి తెలంగాణకోసం ప్రయత్నం చేశానని వివరించారు. వరంగల్‌ ఎయిర్‌పోర్టు, కంటోన్మెంట్‌లో డిఫెన్స్‌ ల్యాండ్స్‌ విషయంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి పరిష్కరించానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సత్సంబంధాలు మరిచిపోతే ఎలా? అని ప్రశ్నించారు. దేశ ప్రధాన మంత్రిని గౌరవించే సంస్కృతి తనకు ఉందన్నారు. ‘‘బడేబాయ్‌ అంటున్నారు.. దేశ ప్రధాని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్నలాంటివారే. రాష్ట్రాల కూడికనే కేంద్రం. ప్రధాన మంత్రి తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాలకు ఉపయోగపడతాయి. ఇందులో రాజకీయం ఏముంది? పార్టీ వేదిక పైకి వచ్చినప్పుడు నా పార్టీ విధానాలు మాట్లాడతాను. ఏప్రిల్‌లో జరిగే భారత్‌ సమ్మిట్‌లో ప్రపంచంలో 100 దేశాల ప్రతినిధుల్ని ఆహ్వానించామని, అందుకు కేంద్రం సహకారం కోరామని తెలిపారు. మే 7 నుంచి 31 వరకు మిస్‌ వరల్డ్‌ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నామని చెప్పారు. 140 దేశాల ప్రతినిధులు, 3 వేల టీవీ చానళ్ల ప్రతినిధులు నెల రోజులు తెలంగాణలో ఉంటారని, వాటికి సంబంధించిన క్లియరెన్స్‌లు తీసుకునేందుకు వెళ్లానని అన్నారు.


ప్రాజెక్టుల సాక్షిగా మరణశాసనం..

కృష్ణా జలాల సాక్షిగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరణశాసనం రాసిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీల నీటి వాటా ఉందని గుర్తుచేశారు. అయితే అప్పటి సీఎం కేసీఆర్‌, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కలిసి.. నాటి కేంద్రమంత్రి ఉమాభారతి, ఏపీ సీఎం చంద్రబాబు వద్ద మోకరిల్లి నీటి వాటాల్లో 512 టీఎంసీలను ఏపీకి ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణకు మాత్రం 292 టీఎంసీలు చాలునని సంతకం పెట్టారని తెలిపారు. కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని లెక్కగడితే.. 68 శాతం నీళ్లు తెలంగాణకు, 32 శాతం నీళ్లు ఏపీకి దక్కాలని, ఈ మేరకు గతంలో చేసిన ఒప్పందాలను తిరగరాయాల్సిందేనని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ‘‘2004లో వైఎస్సార్‌ సీఎంగా ఉన్న సమయంలో కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి ఉన్నారు, హరీశ్‌రావు ఎమ్మెల్యే కాకపోయినా మంత్రి అయ్యారు. కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే 4వేల క్యూసెక్కులుగా ఉన్న పోతిరెడ్డిపాడులో 44 వేల క్యూసెక్కులకు పెంచిన మాట వాస్తవం కాదా? అప్పుడు కేసీఆర్‌, హరీశ్‌రావు పోతిరెడ్డిపాడును అడ్డుకుని ఉంటే తెలంగాణకు అన్యాయం జరిగేది కాదు’’ అని రేవంత్‌ అన్నారు.


కిరణ్‌కుమార్‌రెడ్డిని అడ్డుకున్నది కాంగ్రెస్‌ వారే..

2011-12లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం, నిధులతోపాటు జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించడం కోసం నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై అప్పుడు కాంగ్రె్‌సలో ఉన్న డీకే అరుణ, చిన్నారెడ్డి, మల్లు రవి ఒత్తిడి చేశారని సీఎం రేవంత్‌ తెలిపారు. కృష్ణా పరీవాహకంలో ఉమ్మడి ఏపీ హయాంలో అనుమతులు వచ్చిన ప్రాజెక్టులు పూర్తికాలేదు. లిఫ్టులు, పంపులు, మోటార్ల కోసం కాంట్రాక్టులు, కమీషన్లకు కక్కుర్తిపడి.. జూరాల నుంచి తీసుకోవాల్సిన నీటిని శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌కు తరలించడంతో ప్రాజెక్టు వ్యయం అంచనా రూ.16 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లకు పెరిగింది. 2020లో ఏపీ సీఎం జగన్‌ను ప్రగతిభవన్‌కు పిలుచుకుని, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు అనుమతినిచ్చింది కేసీఆర్‌ కాదా? పోతిరెడ్దిపాడు, మాల్యాల, ముచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి 600 టీఎంసీలు తరలించుకోవడానికి అవకాశం ఇవ్వడంతో మనకు అన్యాయం జరిగింది’’ అని ముఖ్యమంత్రి వివరించారు. కేసీఆర్‌ ఏపీ మంత్రి రోజా ఇంటికి వెళ్లి.. రొయ్యల పులుసు తిని వచ్చి పాలమూరు గుండెల మీద కొట్టారని ఆరోపించారు. వైఎస్సార్‌ హయాంలో ఎస్‌ఎల్‌బీసీని రూ.2వేల కోట్లతో ప్రారంభించి, 20 కిలోమీటర్ల మేర టన్నెల్‌ తవ్వారని తెలిపారు. కానీ, తెలంగాణ వచ్చిన తరువాత టన్నెల్‌ను పక్కనపెట్టి నల్లగొండ జిల్లా రైతుల మరణాలకు కేసీఆర్‌ కారణమయ్యారని ధ్వజమెత్తారు. ఇపుడు టన్నెలలో జరిగిన ప్రమాదానికీ బీఆర్‌ఎస్సే కారణమన్నారు.

కేసీఆర్‌ వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి..

తెలంగాణలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా తండ్రి, కొడుకు, అల్లుడు పైశాచికానందం పొందుతున్నారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. ఇది మంచిపద్ధతి కాదన్నారు. ‘‘బీఆర్‌ఎ్‌సను స్థాపించి 25 ఏళ్లు అయుంది. అప్పటి పాలకులు బీఆర్‌ఎ్‌సను ఓడించాలనుకున్నా.. ప్రజలు గెలిపించారు. మొన్నటి ఎన్నికల్లో ఓడించారన్న కారణంగా ఇప్పుడు ప్రజలను తిడుతున్నారు. ప్రజలు విజ్ఞలు.. ఎప్పుడు ఎవరికి ఎలా చెప్పాలో వారికి బాగా తెలుసు. వారికి స్టేచర్‌ పట్ల ఉన్న ఆలోచన స్టేట్‌ ఫ్యూచర్‌ పట్ల లేదు. ప్రజలు వారికి 2014లో అధికార పార్టీ స్టేచర్‌, 2023 డిసెంబరులో ప్రతిపక్ష స్టేచర్‌, 2024 పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. అందుకే బీఆర్‌ఎస్‌ మార్చురీలో ఉందన్నాను. దానిని ఎవరినో ఉద్దేశించి అన్నట్టుగా కేటీఆర్‌, హరీశ్‌ చిత్రీకరిస్తున్నారు. ప్రజలు నన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు, కేసీఆర్‌ దగ్గరున్న ప్రతిపక్ష కుర్చీ కోసం నేనెందుకు వెళ్తాను? ఆ కుర్చీ కేటీఆర్‌కు, హరీశ్‌కు కావాలి. దాని కోసం వారింట్లోనే నలుగురు పోటీ పడుతున్నారు. వందేళ్లు కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రతిపక్షంలో ఉండాలి. నేను ఇక్కడే ఉండాలి’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.


రూ.57 లక్షల జీతం తీసుకున్న కేసీఆర్‌..

ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ శాసనసభకు రెండుసార్లు మాత్రమే వచ్చారని, కానీ ఇప్పటివరకు 15 నెలల పాటు ఆయన రూ.57,84,124 జీతం తీసుకున్నారని సీఎం రేవంత్‌ తెలిపారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటూ ప్రధాన ప్రతిపక్ష నేత, ప్రజలను గాలికి వదిలేసి, తెలంగాణ రాష్ట్రాన్ని ఖర్మకు వదిలేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ సెక్యూరిటీ గురించి కాంగ్రెస్‌ సభ్యులు ప్రస్తావించగా.. ఆయనకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, అందుకే సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని, చుట్టూ పోలీసు పహారాలో దూరంగా ఉంటున్నారని అన్నారు. ఇక కాంగ్రెస్‌ కార్యాలయంలో గవర్నర్‌ ప్రసంగాన్ని రూపొందించారన్న బీఆర్‌ఎస్‌ సభ్యుల వాఖ్యలపై సీఎం స్పందిస్తూ, మంత్రివర్గంలో చేసిన తీర్మానం మేరకే గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని తెలిపారు. కేంద్రంలో కూడా క్యాబినెట్‌ ఆమోదించిన దానినే పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగిస్తారని గుర్తుచేశారు.

Updated Date - Mar 16 , 2025 | 03:40 AM