Meenakshi Natarajan: కంచ గచ్చిబౌలిలో ఏం జరుగుతోంది?
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:05 AM
కంచ గచ్చిబౌలి భూముల వివాదం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధుల ఆందోళనల అంశంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది.

మంత్రుల కమిటీతో టీపీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ భేటీ
వివిధ అంశాలపై ఆరా.. సంతృప్తి వ్యక్తం చేసిన నేత !
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల వివాదం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధుల ఆందోళనల అంశంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి వచ్చిన టీపీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్.. కంచగచ్చిబౌలి భూముల అంశంపై ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో సచివాలయంలో శనివారం సమావేశమయ్యారు. ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. అసలు ఏం జరిగింది ? ఆ భూములు ఎవరివి? విద్యార్థులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? తదితర అంశాలపై మంత్రులను ప్రశ్నించారు. అలాగే, భూములు చదును చేసే క్రమంలో నెమళ్లు. జింకలు ఇబ్బందికి గురైనట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపైనా అడిగారు. ఇందుకు స్పందించిన కమిటీ సభ్యులు.. కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో ఉన్న 400 ఎకరాల భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధం లేదని తెలిపారు. ఆ భూములు పూర్తిగా ప్రభుత్వానివేనని స్పష్టంచేశారు. ఇక, నెమళ్లు, జింకలు ఇబ్బంది పడు తున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఏఐ సాయంతో ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని వివరించారు. ఆయా ఫొటోలు, వీడియోలు కల్పితాలని సైబర్ క్రైమ్ వర్గాలు తేల్చాయని తెలిపారు. సంబంధిత నివేదికను కూడా ఆమె ముందు ఉంచినట్టు సమాచారం. అదే విఽధంగా భూముల వివాదంపై సుప్రీంకోర్టు అడిగిన సమాచారాన్ని గడువులోగా పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి త్రిసభ్య కమిటీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. కమిటీ ఇచ్చిన వివరణకు మీనాక్షి నటరాజన్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కమిటీ చెప్పిన వివరాలను అమె అధిష్ఠానానికి నివేదించనున్నారు.
ఎవరికీ నష్టం లేకుండా పరిష్కారం
కంచ గచ్చిబౌలి భూముల వివాదాన్ని ఎవరికి నష్టం కలగకుండా పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనని యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎ్‌సయూఐ నేతలతో మీనాక్షి నటరాజన్ అన్నారు. మంత్రులతో భేటీ అనంతరం ఎన్‌ఎ్‌సయూఐ, యూత్ కాంగ్రెస్ నేతలతో గాంధీభవన్‌లో ఆమె వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూముల వివాదం పరిష్కారానికి వేసిన కమిటీతో అన్ని విషయాలు చర్చించినట్టు తెలిపారు. విద్యార్ధుల లేఖలపైనా సమాచారాన్ని సేకరిస్తామని.. ఎప్పుడు ఎవరితో మాట్లాడాలనే వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. అదే విధంగా ప్రతిపక్షాల ఆరోపణలపైనా వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంపై మీనాక్షి .. ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలతో ఆదివారం సమావేశమవుతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here