Share News

Nalgonda: బత్తాయి పడిపోయి.. నల్లగొండ జిల్లాలో క్షీణించిన పండ్ల సాగు

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:49 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2010 వరకు ప్రఽధాన పంటగా ఉన్న బత్తాయి పండ్ల తోటల సాగు క్రమంగా క్షీణిస్తోంది.

Nalgonda: బత్తాయి పడిపోయి.. నల్లగొండ జిల్లాలో క్షీణించిన పండ్ల సాగు

  • 3.1 లక్షల ఎకరాల నుంచి 45వేల ఎకరాలకు తగ్గుదల

నల్లగొండ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2010 వరకు ప్రఽధాన పంటగా ఉన్న బత్తాయి పండ్ల తోటల సాగు క్రమంగా క్షీణిస్తోంది. స్థానికంగా మార్కెట్‌ సదుపాయం లేకపోవడం, మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గిపోవడం, బత్తాయి ప్రాసెసింగ్‌ చేసి ఉత్పత్తులు విక్రయించే టెక్నాలజీ లేకపోవడం వంటి కారణాలతో బత్తాయి సాగు బాగా తగ్గిపోయింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉన్న పంట అయినప్పటికీ దీనిని కాపాడుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చొరవ తీసుకోకపోవడంతో రైతులు ఈ పంటను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 2010 ప్రాంతంలో అత్యధికంగా 3.1 లక్ష ల ఎకరాల్లో బత్తాయి సాగైతే, ప్రస్తుతం అది 45వేల ఎకరాలకు పరిమితమవడం బత్తాయి సాగు క్షీణతను సూచిస్తోంది. కేంద్రం 2020లో ప్రవేశపెట్టిన వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ప్రొడక్ట్‌ కింద కూడా నల్లగొండ జిల్లాలో బత్తాయి ఉత్పత్తులను గుర్తించినా, ఆ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన టెక్నాలజీ లేకపోవడంతో ఈ పథకాన్ని ఎవరూ వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలోనే బత్తాయి సాగుకు నల్లగొండ జిల్లా పెట్టింది పేరు. 2010లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 3.10లక్షల ఎకరాల్లో బత్తాయి పంటలు సాగయ్యాయి. ఏపీ, మహారాష్ట్రలో బత్తాయి సాగు పెరగడం.. మన రాష్ట్రంలో బత్తాయికి నిల్వ సామర్థ్యం లేకపోవడం, పండ్ల రూపంలో గరిష్ఠంగా పది రోజులకు మించి నిల్వ ఉంటే చేదుగా మారుతుండటం, జ్యూస్‌ రూపంలోకి మార్చాక కనీసం రెండు, మూడు రోజుల పాటు కూడా చేదు రాకుండా ఉండని పరిస్థితి బత్తాయి సాగుకు పెద్ద ఆటంకంగా మారింది. గత అయిదారేళ్లుగా కొత్తగా రైతులెవరూ బత్తాయి సాగు చేపట్టడం లేదు. దీంతో వచ్చే 15 ఏళ్లలో బత్తాయి సాగు కనుమరగయ్యే పరిస్థితి జిల్లాలో నెలకొంది.


ప్రాసెసింగ్‌కు పరిశోధనలు చేయడం లేదు: కేంద్రం

బత్తాయి జ్యూస్‌ తయారుచేసిన తర్వాత అది ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు అవసరమైన పరిశోధనలకు, బత్తాయి పండ్ల ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు అవసరమైన సాంకేతికత వృద్ధికి ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. బత్తాయి ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు, జ్యూస్‌ నిల్వలకు అవసరమైన సాంకేతిక సహకారానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టత ఇవ్వాలని తాజాగా లోక్‌సభలో నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆహార ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 06 , 2025 | 04:49 AM