హెచ్‌సీయూ భూములు అమ్మితే ఖబడ్దార్
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:08 AM
హెచ్‌సీయూ భూములను అమ్మితే సహించేంది లేదని, ఖబడ్దార్ అంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీజేపీ ఎంపీల నిరసన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): హెచ్‌సీయూ భూములను అమ్మితే సహించేంది లేదని, ఖబడ్దార్ అంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు హెచ్‌సీయూ భూముల అంశంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఈటల సహా తెలంగాణ బీజేపీ ఎంపీలు బుధవారం నిరసన తెలియజేశారు. ఎంపీలు గోడం నగేష్, రఘునందన్‌రావు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. అనంతరం ఈటల విలేకరులతో మాట్లాడుతూ హెచ్‌సీయూ భూమల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
హెచ్‌సీయూకు చెందిన 400 ఎకరాలను రూ.40 వేల కోట్లకు అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనే సిగ్గుమాలిన పనికి రాష్ట్ర ప్రభుత్వం ఒడిగట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, భూముల వేలాన్ని నిలిపివేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. భూముల అమ్మకంపై ప్రభుత్వం ముందుకువెళితే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రఘునందన్‌రావు పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర ఆస్తులను అడ్డగోలుగా అమ్మిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్రాన్ని నడపడానికి భూముల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధపడడం శోచనీయమని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు.