జానారెడ్డిపై అసత్యప్రచారం
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:31 AM
మాజీ మంత్రి జానారెడ్డి ఏఐసీసీకి రాసిన లేఖ వల్లే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రిపదవి రాకుండా ఆగిందనడం అసత్య ప్రచారమని, మంత్రి పదవి ఇవ్వవద్దని జానారెడ్డి ఎక్కడా, ఎవరికీ చెప్పలేదని, ఏ లేఖలోనూ రాయలేదని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌శంకర్‌నాయక్ స్పష్టం చేశారు.

ఆయన లేఖతో రాజగోపాల్‌రెడ్డికి మంత్రిపదవి రాలేదనడం సరికాదు
ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్
నల్లగొండ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): మాజీ మంత్రి జానారెడ్డి ఏఐసీసీకి రాసిన లేఖ వల్లే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రిపదవి రాకుండా ఆగిందనడం అసత్య ప్రచారమని, మంత్రి పదవి ఇవ్వవద్దని జానారెడ్డి ఎక్కడా, ఎవరికీ చెప్పలేదని, ఏ లేఖలోనూ రాయలేదని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌శంకర్‌నాయక్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. జానారెడ్డి ఎవరి పదవులకూ అడ్డుపడేవ్యక్తి కాదని, రాజగోపాల్‌రెడ్డికి అధిష్ఠానం మంత్రిగా అవకాశం కల్పిస్తే సంతోషపడే వ్యక్తి అన్నారు. అధిష్ఠానం రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే జానారెడ్డిగానీ, పీసీసీ అధ్యక్షుడుగానీ, తాను గానీ ఎవరూ అడ్డుచెప్పరన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేనందున, అక్కడి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు జానారెడ్డివద్దకు వచ్చి గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో మంత్రి పదవి అవసరమని,రానున్న గ్రేటర్ ఎన్నికలు, అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని అధిష్ఠానానికి తెలియజేయాలని కోరారన్నారు. ఆ రెండు జిల్లాలకు క్యాబినెట్‌లో అవకాశం కల్పించాలని కోరుతూ జానారెడ్డి లేఖ రాశారని వివరించారు. ధర్మరాజులా పార్టీకి జానారెడ్డి మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రిపదవి ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిన విషయంపై స్పంది స్తూ, ఆ అంశం రాజగోపాల్‌రెడ్డికి, అధిష్ఠానానికి మాత్రమే సంబంధమని, తన పరిధికి మించిన అంశమని, తాను వ్యాఖ్యానించలేనని తెలిపారు. అధిష్ఠానం మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.