HCU Student Protests: చలో హెచ్‌సీయూ’ ఉద్రిక్తం
ABN , Publish Date - Apr 02 , 2025 | 02:30 AM
హెచ్‌సీయూ భూముల వేలంపై విద్యార్థుల నిరసనలు ఉధృతమయ్యాయి. 400 ఎకరాల భూమిని వేలం వేయకుండా తక్షణం ఉపసంహరించుకోవాలని విద్యార్థులు, రాజకీయ నేతలు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు.

నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్ట్
బీజేఎల్పీ నేత ఏలేటి గృహ నిర్బంధం
హెచ్‌సీయూ ఆక్రమణను అడ్డుకోండి
పచ్చని అటవీ భూములను రక్షించండి
కేంద్ర విద్య, పర్యావరణ మంత్రులకు..
తెలంగాణ బీజేపీ ఎంపీల వినతి
అర్ధరాత్రిళ్లు కబ్జాలు దుర్మార్గం: కిషన్‌రెడ్డి
సర్కార్.. కోర్టు ధిక్కరణ: బండి సంజయ్
హైదరాబాద్/సిటీ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఆందోళనలు ఉధృతరూపం దాల్చుతున్నాయి. జీవరాశులకు ఆలవాలమైన భూమిని వేలం వేసి, పచ్చటి వాతావరణాన్ని దెబ్బతీయొద్దని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. అయితే, ఆ భూమి తమదేనని, వర్సిటీకి సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోంది. మూడు రోజులుగా టీజీఐఐసీ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తుతో భూమిని చదును చేయిస్తుండడంతో విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. పనుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ, విద్యార్థులకు మద్దతుగా మంగళవారం వివిధ పార్టీల నాయకులు తలపెట్టిన ‘చలో హెచ్‌సీయూ’ ఉద్రిక్తంగా మారింది. వర్సిటీ ప్రాంగణానికి వెళ్లేందుకు బయలుదేరిన వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. వర్సిటీలోని 400 ఎకరాల భూముల వేలాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పార్టీ ఎమ్మెల్యేలను, స్థానిక నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసుల బలగాలను మోహరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు పాయల శంకర్, సూర్యనారాయణగుప్తా హెచ్‌సీయూకు వెళ్లేందుకు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వేలం వేయాలనుకుంటున్న 400 ఎకరాలు అటవీ శాఖవేనని స్పష్టం చేశారు. ఈ భూమిపై హైకోర్టులో కేసు నడుస్తోందని, ఈ నెల 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని చెప్పారు. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం భూములను చదును చేయడమంటే కోర్టు ధిక్కరణకు పాల్పడడమేనన్నారు.
సర్కారుది రియల్ ఎస్టేట్ దందా: ఏలేటి
కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. వర్సిటీ భూములను కూడా వదలిపెట్టడం లేదన్నారు. ఏ గుంటనక్క కోసం హెచ్‌సీయూ భూములను చదును చేస్తున్నారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌లోని అహంకారం సీఎం రేవంత్‌లో కనిపిస్తోందని బీజేఎల్పీ ఉపనేత పాయల శంకర్ విమర్శించారు. భూములను అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో ప్రాజెక్టులకు ఎక్కడి నుంచి భూములు తెస్తారని ఎమ్మెల్యే సూర్యనారాయణగుప్తా నిలదీశారు.
యూనివర్సిటీ బంద్‌కు పిలుపు..
పోలీసులు, టీజీఐఐసీ అధికారులు జేసీబీలతో చెట్లను తొలగించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు మంగళవారం హెచ్‌సీయూ బంద్‌కు పిలుపునిచ్చారు. హెచ్‌సీయూ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘హెచ్‌సీయూ మాది.. వర్సిటీ సంపదను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటాం. విద్యార్థులతో పెట్టుకుంటే గద్దె దిగేంతవరకు పోరాడతాం’’ అంటూ వన్యప్రాణులకు నిలయమైన కంచ ప్రాంతం గురించి వర్సిటీ పూర్వ విద్యార్థులైన ప్రస్తుత మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబుకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రధాన గేటు వరకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బీజేవైఎం, సీపీఎం నాయకులు క్యాంప్‌సలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారినీ అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం విద్యార్థులు సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ రాజ్యం పేరుతో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పీఎ్‌సయూ తలపెట్టిన చలో హెచ్‌సీయూ ఉద్రిక్తంగా మారింది. సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రధాన గేటులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని రాజేంద్రనగర్ స్టేషన్‌కు తరలించారు.
బీఆర్‌ఎస్ నేతల ఇళ్ల వద్ద పోలీసులు..
హెచ్‌సీయూ ఆందోళనల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకుల ఇళ్ల వద్ద ఉదయం నుంచి పోలీసులు భారీగా మోహరించారు. వారు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. హెచ్‌సీయూలో విద్యార్థులను అరెస్ట్ చేయడం అమానుషమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
హెచ్‌సీయూ భూమిని నోటిపై చేసేలా చూస్తాం: బల్మూరి
హెచ్‌సీయూ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ టీఎన్‌జీవో కాలనీలోని మైహోం విహంగ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. వర్సిటీ భూమి సుమారు 2500 ఎకరాలు ఉందని, అందులోని ఒక బిట్టులో 20 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే సంస్థకు భూమి కేటాయించిందన్నారు. 2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే కేటీఆర్ బినామీ రామేశ్వరరావుకు అందులో 50 ఎకరాలకు సంబంధించి అన్ని అనుమతులూ ఇచ్చి సహకరించిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ సహకారంతోనే మైహోం విహంగ నిర్మించారన్నారు. గతంలో 50 ఎకరాలు కేటాయించినట్లుగానే 400 ఎకరాలను కూడా మైహోంకు దక్కేలా చూడాలనే బీజేపీ, బీఆర్‌ఎస్ పోరాటం చేస్తున్నాయని ఆరోపించారు. మైహోం విహంగ నిర్మించినప్పుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు అవి వర్సిటీ భూములని, పర్యావరణం దెబ్బతింటుందని గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. విద్యార్థి నాయకుడిగా వర్సిటీ భూమిని ప్రభుత్వం నోటిఫై చేసేలా చూస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News