CM Chandrababu: ఎమ్మెల్యే కొలికపూడిని పట్టించుకోని సీఎం చంద్రబాబు.. ముప్పాళ్లలో ఆసక్తికర ఘటన..
ABN , Publish Date - Apr 05 , 2025 | 09:25 PM
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నందిగామ హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున చేరుకున్నారు.

ఎన్టీఆర్ జిల్లా: 2029 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకుల కంటే కార్యకర్తలపైనే తనకు అభిమానం ఎక్కువని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా హెలీకాప్టర్ ద్వారా నందిగామ హెలీ ప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం ముప్పాళ్ల గ్రామానికి రోడ్డుమార్గాన చేరుకుని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీ-4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల ఇళ్లకు వెళ్లారు. స్వయంగా టీ కాచి వారికి ఇచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.."తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని సందర్భాల్లో నాయకులు కొంచెం అటు ఇటు మారినా కార్యకర్తలు మారలేదు. 2024 ఎన్నికల్లో 100 శాతం తప్పు జరగకుండా పనిచేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే ఉద్దేశంతో అందరూ కలిసి పనిచేయడంతో మంచి విజయం సాధించాం. కార్యకర్తల మనోభావాలపై పార్టీని నడిపించే బాధ్యత నాది. బూత్ లెవెల్‌లో పని చేసే వారందరూ ఎన్నికల సమయంలో బాగా పని చేశారు. గెలిచిన తర్వాత కొద్దిగా పని చేయడం తగ్గించారని అనిపిస్తోంది. అధికారం వచ్చిందన్న ధీమాతో నాయకులు, కార్యకర్తలు ఉంటున్నారు. పని చేసిన కార్యకర్తలను నేను విస్మరించను, అందరినీ గుర్తుంచుకుని తగిన ప్రాధాన్యత కల్పిస్తా. నాయకులు తరచూ స్థానిక నేతలను, కార్యకర్తలను కలుపుకుని క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని" చెప్పారు.
అయితే సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నందిగామ హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున చేరుకున్నారు. వారితోపాటు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సైతం హెలిప్యాడ్ వద్దకు వచ్చారు. పార్టీ అధినేతను కలిసే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కొలికపూడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రజావేదిక సభ వద్దకు కొలికపూడి చేరుకున్నారు. అయితే ముఖ్యమంత్రి సభ వద్దకు రాకముందే అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఇప్పటికే తిరువూరు టీడీపీ పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. కొలికపూడి వ్యాఖ్యలు, వివాదాలపై అధిష్ఠానం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను చంద్రబాబు పట్టించుకోలేదని తెలుస్తోంది. కాగా, పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి బయలుదేరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
SAAP Chairman Ravi Naidu: కంగారు పడకు రోజా.. త్వరలోనే అరెస్టు అవుతావ్: శాప్ ఛైర్మన్ రవి నాయుడు..
BJP MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఆ మూడు పార్టీలు ఒక్కటే: ఎంపీ లక్ష్మణ్..
Bus Conductor Problems: అత్యంత ఎత్తైన బస్ కండక్టర్ ఇతనే.. అతని ఇబ్బందులు చూస్తే బాబోయ్..