CM Revanth BC Bill Demand: మాపై ఆధిపత్యం వద్దు.. గల్లీలోకి రావాల్సిందే.. ప్రధానిపై రేవంత్ కామెంట్స్
ABN , Publish Date - Apr 02 , 2025 | 02:54 PM
CM Revanth BC Bill Demand: తెలంగాణలో కులగణన చేసి బీసీల లెక్క 56.36 శాతం అని తేల్చిందని.. గుజరాత్ సహా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కులగణన చేయలేదని సీఎం రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీ మాట ప్రకారం తెలంగాణ మొట్టమొదటి సారి కులగణన చేసిందన్నారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: బీసీ బిల్లు ఆలోచనకు స్పూర్తి రాహుల్ గాంధీ (Rahul Gandhi) అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బుధవారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ బీసీ పోరు గర్జనలో సీఎం పాల్గొని ప్రసంగించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని బీసీల లెక్కలు అడిగారని తెలిపారు. ఎక్కడ అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తామని పాదయాత్రలో రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు. పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తెలంగాణలో నిలబెట్టానని తెలిపారు. తండ్రి కొడుకు ఉద్యోగం ఊడకొట్టండి మీకు ఉద్యోగాలు వస్తాయని ఎన్నికల సమయంలో పాదయాత్రలో చెప్పానన్నారు. అన్న ప్రకారమే ఏడాదిలో 59 వేల ఉద్యోగాలు నియమించామని తెలిపారు. బీసీలది ధర్మబద్ధ కోరిక అది నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. బీజేపీ అందుకు సిద్ధంగా లేదని విమర్శించారు. మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా బీజేపీ యాత్ర చేసిందన్నారు. ఇందిరాగాంధీ దళిత్ కాదని.. కానీ ఆమె అందరికీ భూములు ఇచ్చారని.. ఇల్లు కట్టించారని అన్నారు. అసైన్డ్ భూములు ఇందిరాగాంధీ ఇచ్చారన్నారు.
రాహుల్ మాట ప్రకారం
బీసీలకు 42% రిజర్వేషన్ల తీర్మానం ఆమోదించిన తేదీ ఫిబ్రవరి 4 అని.. ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డే గా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. జనగణనలో కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారన్నారు. అందుకే బీజేపీ కుట్రపూరితంగా జనగణన వాయిదా వేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో కులగణన చేసి బీసీల లెక్క 56.36 శాతం అని తేల్చిందని.. గుజరాత్ సహా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కులగణన చేయలేదన్నారు. రాహుల్ గాంధీ మాట ప్రకారం తెలంగాణ మొట్టమొదటి సారి కులగణన చేసిందన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచమన్న డిమాండ్ మాత్రమే కాదు, ఉద్యోగ, విద్య రంగంలో కూడా ఈ పెంపు ఉండాలని నిర్ణయించామన్నారు. రిజర్వేషన్ల పెంపు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వ్యవహారమని.. అందుకే మేము తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని తెలిపారు.
అయిననూ హస్తిన పోయి రావలె
‘మేము మా రాష్ట్రంలో పెంచుకుంటాం అన్నాం. మీ (మోదీ) రాష్ట్రంలో చేయమని మేము అడగలేదు. మా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచితే నరేంద్ర మోదీకి వచ్చిన కష్టమేంటి? మా పిల్లల చదువులు, ఉద్యోగాలు, రాజకీయ అవకాశాల కోసం 42 శాతం ఇవ్వాలని మేం ప్రయత్నం చేస్తుంటే.. మీకు ఏం కష్టం వచ్చింది? మా తీర్మానం ప్రకారం రిజర్వేషన్లు పెంచమని కోరుతూ బీజేపీ నేతలను బీసీ సంఘాలు కలిశాయి. అయినా ఉలుకు లేదు. పలుకు లేదు. అందుకే ఢిల్లీలో బీసీ మహా ధర్నా చేపట్టాల్సిన పరిస్థితి బీసీ సంఘాలకు ఏర్పడింది. కురుక్షేత్ర యుద్ధంలో చెప్పినట్టు ‘అయిననూ హస్తిన పోయి రావలె’.. అన్నట్లు ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మా మీద ఆధిపత్యం చెలాయించాలని చూడొద్దు. నిజాం పాలకులకు ఏ గతి పట్టిందో చూశారు. ఆంధ్రా పాలకులకు ఏం జరిగిందో చూశారు. మీరెప్పుడూ ఢిల్లీలో ఉండరు. గల్లీలోకి రావాల్సిందే. చిన్న సాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు మా బీసీ జాతులు. ఈ జాతులకు అన్యాయం చేస్తే ఎలా మర్చిపోతారు? దేశమంతటా మీరు అమలు చేస్తారా లేదా అని నేను అడగడం లేదు. మా తెలంగాణలో తీర్మానం చేసిన ప్రకారం పెంచమని మాత్రమే అడుగుతున్నాను’ అని రేవంత్ అన్నారు. రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించినా సరే అనేక బిల్లులు తెచ్చి చట్టాలు చేశారన్నారు. ట్రిపుల్ తలాఖ్ తెచ్చారని.. ఆర్టికల్ 370 రద్దు చేశారని... వ్యవసాయంపై నల్ల చట్టాలు తెచ్చారని తెలిపారు. మరి రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఏం సమస్య వచ్చిందని ప్రశ్నించారు. బీసీల కోసం ప్రాణాలు ఇస్తామని బండి సంజయ్ అంటారని.. ‘మాకు మీ ప్రాణాలు వద్దు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వండి చాలు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ గర్జన మహా ధర్నాకు వివిధ పార్టీల ఎంపీలు మద్దు తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ, డీఎంకే కనిమొలి, ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే మహాధర్నాకు మద్దతు ఇస్తూ ధర్నాలో పాల్గొన్నారు. అలాగే ఈ ధర్నాకు ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండ సురేఖ, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శ్రీహరి ముద్దిరాజు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, బిర్లా ఐలయ్య, వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం, విహెచ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
Ameenpur Case Twist: అమీన్‌పూర్ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం
Shravan Rao SIT Investigation: మరోసారి సిట్ విచారణకు శ్రవణ్ రావు
Read Latest Telangana News And Telugu News