Kiran Kumar Reddy: కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విసుర్లు
ABN, Publish Date - Jan 06 , 2025 | 02:29 PM
KIRAN KUMAR REDDY: వరి వేస్తే ఊరి అని నిబంధనలు పెట్టిన బీఆర్ఎస్కు రైతుల గురించి మాట్లాడే అర్హతలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జీవితాంతం అధికారంలో ఉంటామని కేటీఆర్ భావించారని చెప్పారు. ముఖ్యమంత్రి వస్తే మంత్రులు లేవలేదని సోషల్ మీడియా ద్వారా చిల్లర కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు.
ఢిల్లీ: మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు పోతానని చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. దేనికైనా సిద్ధమని కేటీఆర్ చెప్పారు కదా ఇప్పుడేందుకు ఇలా చేస్తున్నారన్నారు. కేటీఆర్ నిజంగానే డ్రామారావులా వ్యవహారిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రిగా చేసి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్, కేసీఆర్ డబ్బులను ఇష్టారీతిగా ట్రాన్స్ఫర్ చేశాడు, దానినే విచారణ అధికారులు ఆడుగుతున్నారని అన్నారు. వాటికి సమాధానం చెప్పకుండా కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. జీవితాంతం అధికారంలో ఉంటామని కేటీఆర్ భావించారని చెప్పారు. ముఖ్యమంత్రి వస్తే మంత్రులు లేవలేదని సోషల్ మీడియా ద్వారా చిల్లర కామెంట్లు చేస్తున్నారన్నారు. కేసీఆర్ లాగా రేవంత్‌రెడ్డి కాళ్లు పట్టించుకోరని చెప్పారు. సీఎం అంటే రాష్టానికి ఓనర్ కాదని తెలిపారు. కేటీఆర్‌ను రాజకీయ నాయకుడిగా చూడటం బంద్ చేయాలన్నారు. రూ. 85 వేల కోట్లు పదేళ్లలో ఖర్చు చేస్తే తాము ఒక్క ఏడాదిలోనే రూ.53 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ నిబద్ధతకు ఇదే నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ ఏడాదికి ఖర్చు చేసింది రూ.7 వేల కోట్లు కూడా కాలేదన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్లకు లబ్ధి చేకూర్చేందుకే కొండలు గుట్టలకు రైతుబంధు వేసి రూ.20 వేల కోట్లు వృథా చేశారన్నారు. హామీల అమలు చేయలేకపోవడానికి బీఆర్ఎస్ చీకటి జీవోలే కారణమన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసేలా బీఆర్ఎస్ పదేళ్ల పాలన సాగిందన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలను గమనించాలన్నారు.
సాగు చేసే రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రూ.6 వేలు మాత్రమేనని చెప్పారు. రైతులపై బీజేపీ నేతలకు ప్రేమ ఉంటే రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలను మోదీని ఒప్పించి దేశమంతా ఇప్పించేలా చూడాలని కోరారు. రాజకీయ నేతలు రాజకీయాలు చేసేందుకు చెప్పే ప్రచారాలను నమ్మకుండా ప్రజలు వాస్తవాలను గమనించాలన్నారు. రూ. 20 వేల కోట్లు రోడ్లకు, పాడవుబడ్డ భూములకు, బిల్డింగ్‌లకు ఎందుకు ఇచ్చారో కేటీఆర్ చెప్పాలన్నారు. ప్రజలే కేటీఆర్‌కు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వరి వేస్తే ఊరి అని నిబంధనలు పెట్టిన బీఆర్ఎస్కు రైతుల గురించి మాట్లాడే అర్హతలేదన్నారు. రూ.55 కోట్లు అక్రమంగా విదేశీ కంపెనీకి పంపిస్తే....ఈడీ ఫార్మూలా ఈ కార్ కేసులో విచారణకు పిలిస్తే కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నిజాం నవాబులా వ్యవహారించడం లేదు, తమ మంత్రులు నిలబడలేదని ఇష్టరీతిన ప్రచారం చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా ద్వారా సీఎంను చిన్నబుచ్చే కుట్ర కేటీఆరే చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని యాంకర్లకు సీఎంలు ఎవరో తెలవని స్థితిలో ఉన్నారా అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
Updated Date - Jan 06 , 2025 | 02:46 PM