బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి
ABN , Publish Date - Feb 21 , 2025 | 11:23 PM
రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కార్యకర్తలంతా తమ పౌరుషాన్ని, దమ్ము చూపాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ పచ్చీస్ ప్రభారీ సమావేశంలో మాట్లాడారు.

పెద్దపల్లి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కార్యకర్తలంతా తమ పౌరుషాన్ని, దమ్ము చూపాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ పచ్చీస్ ప్రభారీ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీని ఒక్కసారైనా అధికారంలోకి తీసుకు రావాలనేది లక్షలాది మంది కార్యకర్తల ఆశయమన్నారు. మావోయిస్టుల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ నాయకులకే ఉందని, పెద్దపల్లి జిల్లాలోనూ గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, కాసిపేట లింగయ్య, కోమల అంజనేయులు వంటి నేతలను చంపాలని మావోయిస్టులు పోస్టర్లు సైతం అంటించారని గుర్తు చేశారు. అయినా భయపడకుండా కాషాయ జెండాను రెపరెపలాడించిన చరిత్ర తమదని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. మన సంప్రదాయాలు వేరని అలాంటి సందర్భంలో హిందువుల జాబితాలో ముస్లింలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఒకవైపు బీసీ జనాభాను తగ్గించి చూపుతున్నారని, ఇంకోవైపు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అందులో 10 శాతం ముస్లింలకు కేటాయించడం కాంగ్రెస్ పార్టీ కుఠిలనీతికి నిదర్శనమన్నారు. బీసీలకు ద్రోహం చేస్తుంటే ఎట్లా ఊరుకుంటామని, బీసీ జాబితాలో ముస్లింలను కలిపి బిల్లు పంపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదని బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కాసిపేట లింగయ్య, టీచర్, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు మల్క కొమరయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.