Share News

జోరుగా ‘జూదం’

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:18 AM

కమిషనరేట్‌ వ్యాప్తంగా ‘పేకాట’ జోరుగా నడుస్తున్నది.

జోరుగా ‘జూదం’

- అపార్ట్‌మెంట్లు, అద్దె ఇళ్లు, హోటళ్లు, లాడ్జీల్లో అడ్డాలు

- ఏడాదిలో 91 కేసులు, 593 మంది అరెస్టు

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): కమిషనరేట్‌ వ్యాప్తంగా ‘పేకాట’ జోరుగా నడుస్తున్నది. నిర్వాహకులకు కొందరి అండదండలు ఉన్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. కమిషనరేట్‌ వ్యాప్తంగా పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు గ్రామాల శివారు ప్రాంతాల్లోని నివాస గృహాల్లో గుట్టుచప్పుడు కాకుండా అద్దెకు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్స్‌, ఇళ్లు తీసుకున్న కొందరు జూదగృహాలను నడుపుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్‌కమిషనరేట్‌ వ్యాప్తంగా 2024 సంవత్సరంలో 91 కేసులు నమోదుచేసి, 593 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుకున్న నగదు, సెల్‌ఫోన్‌లను కోర్టులో డిపాజిట్‌ చేశారు. జిల్లా కేంద్రంతోతోపాటు ద్వితీయశ్రేణి పట్టణాలు, మండల కేంద్రాల్లో, ప్రముఖ లాడ్జిలు, హోటళ్లలో కూడా బడా బాబులు పేకాట ఆడుతున్నారు. లాడ్జిలు, హోటళ్లలో పేకాట ఆడుతున్న జూదరులు పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి తనిఖీల్లో చిక్కకుండా తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఫ అడ్డాల్లో సకల సౌకర్యాలు

జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు పేకాట కోసం వందలాది మంది వస్తున్నట్లు సమాచారం. పేకాట అడ్డాల్లో నిర్వాహకులు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజనం, మద్యం ఇతర వసతులు కల్పిస్తున్నట్లు సమాచారం. ఒక్క్మో ఆటకు వెయ్యి నుంచి 50 వేల వరకు జూదం నడుస్తున్నట్లు తెలిసింది. నగరశివారుల్లోని కోళ్ల ఫాంలు, మామిడితోటల్లో పలువురు పేకాట ఆడుతున్నారు. పోలీసులు తనిఖీలకు వచ్చిన సమయాల్లో దూరం నుంచే గమనించే అవకాశముండడంతో పేకాటరాయుళ్లు కూడా ఈ స్థావరాలు క్షేమంగా ఉంటాయని భావిస్తున్నారు. పోలీసులు ఇటీవల డ్రోన్‌ కెమెరాద్వారా పేకాట స్థావరాలను గుర్తించి దాడులు నిర్వహిస్తున్నారు. నగరశివారులోని రేకుర్తి తాళ్లలో, బొమ్మకల్‌ బైపాస్‌ రోడ్డు, ఫాంహౌస్‌లు, వాగుల తీరాన ఉన్న చెట్ల వద్ద పేకాట జోరుగా నడుస్తున్నట్లు సమాచారం. వేసవి కాలంలో పేకాట మరింత జోరందుకున్నది. గతంలో నగరశివారులోని ఒక బార్‌లో యదేచ్ఛగా జూదం ఆడుతున్నట్లు సమాచారంతో అప్పటి సీపీ దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయించారు. అనంతరం ఆ బార్‌లో సీసీ కెమెరాలు బిగించి పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అనుసంధానం చేశారు.

ఫ ఆస్తులు కోల్పోయి.. అప్పుల పాలవుతున్నా..

జూదం ఒక వ్యసనంగా మారిన కొందరు పేకాట ఆడుతూ తమ ఆస్తులను కోల్పోతున్నారు. దీంతో దివాళాతీసి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. గతంలో కరీంనగర్‌కు చెందిన ఒక వ్యాపారి పేకాట కోసం పలువురి వద్ద దాదాపు 30 లక్షలు అప్పు చేశాడు. ఈ అప్పులు చెల్లించలేని పరిస్థితిలో హైదరాబాద్‌లోని ఒక లాడ్జిలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌కు చెందిన మరొక వ్యాపారి జూదం వ్యసనంగా మారి తన వ్యాపారంపై దృష్టిపెట్టలేక నష్టాలు రావడంతో కొంతకాలం క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరానికి చెందిన పలువురు మధ్య తరగతికి చెందిన వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు ఎవరిస్థాయిలో వారు పేకాట వ్యసనపరులుగా మారి ఆస్తులను తెగనమ్ముకుంటూ దివాళా తీస్తున్నారు. ఈ పేకాట వ్యసనం నుంచి దూరం చేసేందుకు పోలీసులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ గోవా, శ్రీలంక టూర్‌లు.

పెద్ద స్థాయిలో పేకాట ఆడేవారు ఒక గ్రూపుగా ఏర్పడి శ్రీలంక, గోవా, మలేషియా వంటి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ జూదం ఆడుతున్నారు. కొన్ని దేశాల్లో జూదం చట్టబద్ధం కావడంతో ఇక్కడి జూదరులు అక్కడికి వెళ్లి ఆడుతున్నారు. పైగా విదేశాల్లో పేకాటకు వెళ్లేవారికి అక్కడి నిర్వాహకులు విమానచార్జిలతోపాటు భోజనం, మద్యం, బస తదితర ఉచిత సౌకర్యాలను కల్పిస్తూ ఆకర్శిస్తున్నారు. లక్ష నుంచి మూడు లక్షల వరకు గ్రేడ్‌లవారీగా డబ్బులు డిపాజిట్‌ చేసుకుని అదే స్థాయిలో సకల సౌకర్యాలు కల్పిస్తుండటంతో జూదరులు గోవాతోపాటు, విదేశాలకు క్యూకడుతున్నారు. ఇలా నెలకు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. మరో వైపున ఆన్‌లైన్‌ రమ్మీ ఆటను స్మార్ట్‌ ఫోన్లలో ఆడుతున్నారు. ఇటీవల జిల్లాలో ఆన్‌లైన్‌ రమ్మీ, ఇతర గేమింగ్‌ యాప్‌లలో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుని ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చేతిలో స్మార్ట్‌ఫోన్‌, బ్యాంక్‌ బాలెన్స్‌ ఉంటే చాలు ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్‌ గుట్టుచప్పుడు కాకుండా ఆడేయొచ్చు. ఆన్‌లైన్‌ గేమ్‌ రమ్మీ ఆటలో డబ్బులు నష్టపోవడం తప్ప సంపాదించిన దాఖలాలు అతి తక్కువ. అయినా జూదానికి బానిసగా మారినవారు డబ్బులు వస్తాయనే ఆశతో బంధువులు, స్నేహితుల వద్ద అప్పులుచేసి ఆడుతూ లక్షలు నష్టపోతున్నారు. స్తోమతకు మించి అప్పులు కావటంతో తీర్చేదారిలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 01:18 AM