‘ఓటీఎస్’కు భారీ స్పందన
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:10 AM
ఆస్తిపన్ను బకాయిలన్నింటిని ఒకేసారి చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీంకు (ఓటీఎస్) కరీంనగర్ నగరపాలక సంస్థలో భారీ స్పందన లభించింది.

- ఒక్క రోజే రూ. 1.9 కోట్ల ఆస్తి పన్ను వసూలు
- ముగిసిన 90 శాతం వడ్డీ మాఫీ
- అర్ధరాత్రి వరకు చెల్లింపులకు అవకాశం
కరీంనగర్ టౌన్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఆస్తిపన్ను బకాయిలన్నింటిని ఒకేసారి చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీంకు (ఓటీఎస్) కరీంనగర్ నగరపాలక సంస్థలో భారీ స్పందన లభించింది. చివరి రోజైన సోమవారం భారీగా ఆస్తిపన్ను బకాయిలు వసూలయ్యాయి. మార్చి 31తో 90శాతం వడ్డీ మాఫీ పథకం ముగియడంతో ఆది, సోమవారాలు ఉగాది, రంజాన్ సెలవు దినాలు అయినప్పటికీ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణితోపాటు రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉదయం ఆరు గంటలకే బకాయిదారుల ఇళ్లకు వెళ్లి ఆస్తి పన్ను వసూలు చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సోమవారం అర్దరాత్రి వరకు పన్నులు చెల్లించే అవకాశం కల్పించారు.
బకాయిదారులకు కమిషనర్ ఫోన్
మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ 50 వేలకు పైన బకాయి ఉన్న యజమానులందరికీ ఫోన్ చేసి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఈనెల 31లోగా చెల్లించి వడ్డీ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యల్లో భాగంగా ఆస్తులను జప్తుచేస్తామంటూ హెచ్చరించారు. 90 శాతం వడ్డీ మాఫీ పథకం చివరి రోజు సోమవారం రాత్రి 9 గంటల వరకు కోటి 90 లక్షల పన్నులను చెల్లించారు. అర్థరాత్రి వరకు రెండు కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనున్ననేపథ్యంలో ఆస్తిపన్నులు 70శాతానికి పైక వసూలు చేయనిపక్షంలో 15వ ఆర్థిక సంఘం నిలిపివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తోపాటు రెవెన్యూ అధికారయంత్రాంగమంతా 15 రోజులుగా ప్రత్యేక దృష్టి పెట్టి పన్నులు వసూలు చేస్తున్నారు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్‌కు ఆస్తిపన్ను లక్ష్యం 52 కోట్లు కాగా సోమవారం రాత్రి వరకు 39.27 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా 13 కోట్ల మేరకు ఆస్తి పన్నులు రావలసి ఉంది. వాటిలో దాదాపు 50 లక్షల వరకు అర్థరాత్రి వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు.