Share News

గంజాయి రాకెట్‌ను ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - Feb 21 , 2025 | 12:10 AM

రాష్ట్రంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో రామగుండం కమిషరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గంజాయి రవాణా, అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టాయి. పకడ్బందీ సమాచారంతో ఒకే రోజు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో దాడులు నిర్వహించి 1.2 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. 15 మంది నిందితులను అరెస్టు చేసి రెండు కార్లు, ఐదు మోటార్‌ సైకిళ్లు, 17సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి రాకెట్‌ను ఛేదించిన పోలీసులు

కోల్‌సిటీ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో రామగుండం కమిషరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గంజాయి రవాణా, అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టాయి. పకడ్బందీ సమాచారంతో ఒకే రోజు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో దాడులు నిర్వహించి 1.2 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. 15 మంది నిందితులను అరెస్టు చేసి రెండు కార్లు, ఐదు మోటార్‌ సైకిళ్లు, 17సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం కమిషరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీ శ్రీనివాస్‌ అరెస్టు వివరాలను వెల్లడించారు. మంచిర్యాల పట్టణంలోని ఎస్‌బీఐ కాంప్లెక్స్‌ సెల్లార్‌లో సోమ ప్రవీణ్‌ సీసీ కెమెరాల షాపు పేర గంజాయి అమ్మకాలు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు దందాను గుట్టు రట్టు చేశారు. సోమ ప్రవీణ్‌, అతని స్నేహితుడు సతీష్‌, మరికొందరు సీలేరు నుంచి గంజాయి తీసుకువచ్చి సీసీ కెమెరాల గోడౌన్‌లో నిల్వ చేసేవారు. అనుమానం రాకుండా ప్యాక్‌ చేసి ఈ కామర్స్‌ డెలివరీ ఏజెన్సీల ద్వారా కస్టమర్లకు పార్సిళ్ల రూపంలో చేరవేసేవారు. అనుమానం వచ్చిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దీనిపై నిఘా పెట్టారు. గురువారం గోడౌన్‌పై టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. బాల నేరస్థుడితో పాటు 11మందిని అరెస్టు చేయగా మరో 11మంది పరారీలో ఉన్నారు. అప్పటికే సోమ ప్రవీణ్‌, రాజు అనే వ్యక్తులు బయటకు వెళ్లగా ఇరుగురాళ్ల సతీష్‌ కుమార్‌(34), మహ్మద్‌ సమీర్‌(19), భీమ అనుదీప్‌(21), మహ్మద్‌ అబ్దుల్‌ ఉబేద్‌(22), అర్జున్‌ బాబురావు చౌహాన్‌(26), మహ్మద్‌ అజీజ్‌(19), జాడి రాఘవేంద్రస్వామి(23), గూడూరు రాము(20), ఎస్‌కే అతహర్‌(18), ఎస్‌కే సమీర్‌(25)లను పట్టుకున్నారు. ప్రధాన సూత్రదారి సోమ ప్రవీణ్‌, తగరపు రాజు, అతని భార్య శృతి, తరగపు వినయ్‌, రామారపు రాకేష్‌, శ్రీధర్‌, మున్ని, ఆల్‌ మేకర్‌ శ్యామ్‌, క్వార్టర్‌ సాయి, సోహెల్‌, చింటు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి 23.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 11ఫోన్లు, ఐదు బైక్‌లు, ఎలక్ర్టానిక్‌ వెయింగ్‌ మిషన్లు సీజ్‌ చేశారు.

గోదావరిఖని టుటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 11ఏ క్రాస్‌ వద్ద గురువారం ఛత్తీస్‌గఢ్‌ నుంచి గంజాయిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు గురువారం కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, టుటౌన్‌ పోలీసులు తనిఖీలు జరిపారు. మహారాష్ట్రకు వెళుతున్న రెండు కార్లను తనిఖీ చేయగా కారు డిక్కి కింది భాగంలో ప్రత్యేక బాక్స్‌లు ఏర్పాటు చేసి రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు. 96.7కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉదయ్‌ వీర్‌(32), ఒడిశాకు చెందిన కేశవ్‌ కర, సోమనాథ్‌ కర, రాజస్థాన్‌కు చెందిన రాజు లోథి సంజు ఒక ముఠాగా ఏర్పడి గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు సూరజ్‌, అర్జున్‌ బోరిలు పరారీలో ఉన్నట్టు సీపీ తెలిపారు. రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న 1.2 క్వింటాళ్ల గంజాయి విలువ మార్కెట్‌లో రూ.60లక్షలు ఉంటుందని సీపీ శ్రీనివాస్‌ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పట్టుబడిన నిందితులపై పీడీ యాక్టు నమోదు చేయడమే కాకుండా, వారి ఆస్తులను జప్తు చేస్తామని సీపీ హెచ్చరించారు. గంజాయిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్‌బీ, టాస్క్‌ఫోర్స్‌, మంచిర్యాల, గోదావరిఖని టుటౌన్‌ పోలీసులను సీపీ అభినందించారు. విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) రాజు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజ్‌కుమార్‌, టుటౌన్‌ సీఐ ప్రసాద్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 12:10 AM

News Hub