వరి కోతలు షురూ..
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:07 AM
యాసంగిలో భారీగా అన్నదాతలు వరిసాగు వైపు మొగ్గు చూపారు. ఇంట్లో సిరులు కురిపిస్తుందని ఎంతో ఆశపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో 1.82 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
యాసంగిలో భారీగా అన్నదాతలు వరిసాగు వైపు మొగ్గు చూపారు. ఇంట్లో సిరులు కురిపిస్తుందని ఎంతో ఆశపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో 1.82 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా 1.78 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. పౌరసరఫరాల శాఖ ఒకవైపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ధాన్యం సేకరణకు సన్నద్ధం చేస్తున్నారు. ఇదేక్రమంలో రైతులు హార్వెస్టర్లతో వేగంగా కోతలు ప్రారంభించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వరికోతలు, కొనుగోలు కేంద్రాల సందడితో రైతులు బిజీబిజీగా మారిపోయారు.
ఫ అకాల వర్షం.. దిగుబడి దిగాలు
యాసంగిలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతూ వరి పంటను దక్కించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో రోజురోజుకు నీటిమట్టాలు తగ్గిపోవడంతో చివరి దశలో వరి పంటను దక్కించుకోవడానికి ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీటిని అందిస్తూ కాపాడుకుంటున్నారు. బీటలు వారుతున్న పొలాలతో రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో అకాల వర్షాలు భయపెడుతున్నాయి. వడగండ్ల వర్షాలు, దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో యాసంగి సాగు 1.82 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేసుకున్నారు. ఇందులో వరి 1.78 లక్షల ఎకరాలు, గోధుమ 109 ఎకరాలు, జొన్నలు 3.13 ఎకరాలు, మొక్కజొన్న 1975 ఎకరాలు, పెసర్లు 4324 ఎకరాలు, కందులు 300 ఎకరాలు, పల్లి 26 ఎకరాలు, పొద్దు తిరుగుడు 350 ఎకరాలు సాగు చేశారు. పంటలు చేతికి వచ్చే దశలో భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలో సరాసరి 11.27 మీటర్ల లోతుల్లోకి జలాలు పడిపోయాయి. మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లో 27.55 టీఎంసీల సామర్థ్యానికి 8.011 టీఎంసీలకు నీటి నిల్వలు పడిపోయాయి. జిల్లాలో మార్చినెల నాటికి బోయినపల్లిలో 8.17 మీటర్ల లోతులో నీటి నిల్వలు పడిపోగా, చందుర్తిలో 7.25, గంభీరావుపేటలో 12.90, ఇల్లంతకుంటలో 7.53, కోనరావుపేటలో 11.91, ముస్తాబాద్‌లో 13.42, రుద్రంగిలో 8.50, సిరిసిల్లలో 14.28, తంగళ్లపల్లిలో 9.88, వీర్నపల్లిలో 15.22, వేములవాడ రూరల్‌లో 5.84, వేములవాడ అర్భన్‌లో 16.52, ఎల్లారెడ్డిపేటలో 17.84 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు పడిపోయాయి.
ఫ జిల్లాలో 238 కొనుగోలు కేంద్రాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ రెండవ వారం నుంచి ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అంచనాతో అందుకు అనుగుణంగానే కొనుగోళ్లు చేసే దిశగా అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇప్పటికే 34 కేంద్రాలు ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలుకు ధాన్యం ధర ఏ గ్రేడ్ రూ.2320, బి గ్రేడ్ రూ.2300 చొప్పున కొనుగోలు చేయనున్నారు. జిల్లాలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని గ్రామాల్లోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేశారు. జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు ఉండగా 238 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. ఐకేపీ ద్వారా 191 కేంద్రాలు, సింగిల్ విండోల ద్వారా 42 కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా ఒక కేంద్రం, మెప్మా ద్వారా 4 కేంద్రాల ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఉపయోగించడానికి గన్నీ బ్యాగులు కొత్తవి 18.70 లక్షలు, ఇప్పటికే ఉపయోగించినవి 15.90 లక్షలు అందుబాటులో ఉన్నాయి. కొనుగోళ్ల కోసం టార్ఫాలిన్లు, ఇన్నోవింగ్ మిషన్లు, పాడీ క్లీనర్‌లు, మాయిశ్చరైజ్ మీటర్లు, వేయింగ్ మిషన్లు, అస్క్ రిమూవర్స్ వంటి పరికరాలు అందుబాటులో ఉంచారు.
ఫ పౌరసరఫరాల ద్వారా 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సీజనల్‌లో 1.78 లక్షల వరి సాగు ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలు వేశారు. 2.92 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం, 8 వేల మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఇందులో 67 వేల మెట్రిక్ టన్నులు మిల్లర్లు నేరుగా కొనుగోలు చేస్తారని అంచనా వేశారు. పౌర సరఫరాల శాఖ ద్వారా 3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల రెండవ వారంలో లక్ష మెట్రిక్ టన్నులు, మేలో 1.88 లక్షల మెట్రిక్ టన్నులు, జూన్‌లో 79 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌లోకి వస్తుందని అంచనాలు వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ ఏప్రిల్‌లో 75 వేలు, మేలో 1.68 లక్షలు, జూన్‌లో 63 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు.
జిల్లాలో వరి సాగు(ఎకరాల్లో)..
మండలం వరి
గంభీరావుపేట 18,000
ఇల్లంతకుంట 24,000
ముస్తాబాద్ 20,000
సిరిసిల్ల 4,800
తంగళ్లపల్లి 19,000
వీర్నపల్లి 9,100
ఎల్లారెడ్డిపేట 16,850
బోయినపల్లి 12,500
చందుర్తి 16,000
కోనరావుపేట 17,800
రుద్రంగి 4,700
వేములవాడ 5,150
వేములవాడ రూరల్ 10,450
--------------------------------------------------------------
మొత్తం 1,78,350
--------------------------------------------------------------