ఎసెస్సీ స్పాట్‌లో నిబంధనలు బేఖాతరు
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:05 AM
జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబుపత్రాల మూల్యంకనం (స్పాట్)లో నిబంధనలను పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా విద్యాధికారి సీహెచ్‌వీఎస్ జనార్ధన్‌రావు వైఖరితో మూల్యంకన కేంద్రం గందరగోళంగా మారిందని, స్పాట్‌లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు మనోవేదనకు గురువుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబుపత్రాల మూల్యంకనం (స్పాట్)లో నిబంధనలను పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా విద్యాధికారి సీహెచ్‌వీఎస్ జనార్ధన్‌రావు వైఖరితో మూల్యంకన కేంద్రం గందరగోళంగా మారిందని, స్పాట్‌లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు మనోవేదనకు గురువుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కరీంనగర్ స్పాట్ కేంద్రానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2,13,461 జవాబుపత్రాలను మూల్యంకనం కోసం వచ్చాయి. వీటిని ఈనెల 7 నుంచి 15వ తేదీ వరకు తొమ్మిది రోజుల్లో మూల్యంకనం చేయాల్సి ఉంది. ఇందుకు 99 మంది చీఫ్ ఎగ్జామినర్స్ (సీఈ), 593 మంది ఏఈలు, స్పెషల్ అసిస్టెంట్స్ 198 మంది అవసరం. డీఈవో 139 మంది సీఈలు, 732 మంది ఏఈలు, మొత్తం 971 మందిని, ప్రతి మండలం నుంచి 20 మంది చొప్పున 300 మందిని స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించినట్లు తెలిసింది. 30 నుంచి 40 శాతం అధికంగా సిబ్బందిని నియమించినట్లు సమాచారం.
అర్హత లేకున్నా..
బార్ కోడ్ స్కానింగ్‌ను నాన్ టీచింగ్ సిబ్బందితో చేయించుకోవలసి ఉండగా పదుల సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించారు. దీంతో వారికి వేసవి సెలవుల్లో ఆర్జిత సెలవులు జమవుతాయి. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. అయిదారుగురు హెడ్మాస్టర్లకు స్పాట్‌లో లేని పోస్టులు లైజనింగ్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్స్ నియమించారని, ఇది కూడా సరికాదని చెబుతున్నారు. మూడు సంవత్సరాలు వరుసగా పదోతరగతికి బోధించని ఉపాధ్యాయులను ఈఈలు, సీఈలుగా నియమించారని విమర్శిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు, దివ్యాంగులకు కూడా స్పాట్ డ్యూటీలను వేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మినహాయింపు కోరినా విడుదల చేయకుండా నాలుగైదు రోజులుగా స్పాట్ సెంటర్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అనారోగ్యం కారణంగా విధులకు హాజరుకానీ వారికి మెమోలు, షోకాజు నోటీసులు, జీతాల్లో కోత విధించాలని హెచ్‌ఎంలకు ఆదేశాలు ఇస్తూ డీఈవో ఉపాధ్యాయులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
డీఈవోపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
డీటీఎఫ్
నిబంధనలకు పాటించకుండా ఇష్టారాజ్యంగా స్పాట్‌ను నిర్వహిస్తూ ఉపాధ్యాయులను తీవ్ర మనోవేధనకు గురిచేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ జనార్ధన్‌రావు చర్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీటీఎఫ్ జిల్లాశాఖ కలెక్టర్‌కు, రాష్ట్ర పరీక్షల డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డీఈవో అవగాహన రాహిత్యం, అహంకార ధోరణతో వ్యవహరిస్తూ ఉపాధ్యాయులను భయబ్రాంతులకు గురిచేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని డీటీఎప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్యుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి, ప్రధాన కార్యదర్శి తూముల తిరుపతి ఆరోపించారు. అనారోగ్యం, దివ్యాంగులు విధులు నిర్వహించలేక రిలీవింగ్ కోసం స్పాట్ కేంద్రంలో వేచి ఉన్నవారిని వెంటనే రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు.