Share News

ఉగాది నుంచి సన్నబియ్యం

ABN , Publish Date - Mar 29 , 2025 | 01:12 AM

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం నుంచి ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఈ ఉగాది నుంచి అమలు చేస్తున్నది. రేషన్‌కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం సరఫరా చేయనున్నారు.

ఉగాది నుంచి సన్నబియ్యం

- పంపిణీకి సిద్ధం చేసిన అధికారులు

- జిల్లాలో 2,76,908 రేషన్‌కార్డులు

- సన్నబియ్యం లబ్ధిదారులు 8,04,968 మంది

- నెలకు 5,135.60 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం అవసరం

- జిల్లాలో ఏడు నెలలకు సరిపడా నిల్వలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం నుంచి ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఈ ఉగాది నుంచి అమలు చేస్తున్నది. రేషన్‌కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం సరఫరా చేయనున్నారు. జిల్లాకు ప్రతినెలా 5,135.60 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం అవసరం కాగా ఏడు నెలలకు సరిపడా బియ్యం నిల్వలను జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచింది. జిల్లాలో పౌరసరఫరాలశాఖ 566 చౌకధరల దుకాణాల ద్వారా 2,76,908 కుటుంబాలకు రేషన్‌కార్డుల ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు. ఈ కుటుంబాలలో 8,04,968 మంది నెలనెలా బియ్యం పొందుతున్నారు. జిల్లాలో 2,61,164 ఆహారభద్రతా కార్టులు ఉండగా ఆయా కుటుంబాల్లోని 7,64,122 మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 45,847 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. 15,730 అంత్యోదయ ఆహారభద్రతా కార్డుల ద్వారా ఒక్కో కుటుంబానికి 35 కిలోల చొప్పున 35 అన్నపూర్ణకార్డుల ద్వారా 35 మందికి ఒక్కో కుటుంబానికి 10 కిలోల చొప్పున నెలనెలా ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నారు. వీరందరికీ నెలనెలా 5,135.60 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం అవుతుంది.

ఫ 35వేల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం నిల్వలు

జిల్లాలో ప్రస్తుతం 35వేల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం నిల్వలు ఉన్నాయి. ఏడు నెలలకు సరిపడా బియ్యం అందుబాటులో ఉండగా కస్టమ్‌ మిల్లింగ్‌ నుంచి రావలసిన బియ్యంతోపాటు యాసంగి సీజన్‌ కొనుగోలు చేసే ధాన్యంతో సమకూర్చుకునే బియ్యం కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రజా పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూసేందుకు ఈ-పాస్‌ మిషన్‌ ద్వారా ఆన్‌లైన్‌కు అనుసంధానం చేశారు. వీటి ద్వారానే బియ్యం సరఫరా చేస్తున్నారు. ఒకే దేశం ఒకే కార్డు విధానం కింద దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఎక్కడ ఉంటే అక్కడే బియ్యం తీసుకోవడానికి వీలుకలుగుతున్నది. జిల్లాలో మన రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన వారే కాకుండా ఏపీ, గుజరాత్‌, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నారు. వారంతా ఆయా రాష్ట్రాలలో పొందిన రేషన్‌కార్డుల ద్వారా అలాగే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంంటూ ఇక్కడి రేషన్‌కార్డులు పొంది ఇక్కడ రేషన్‌బియ్యం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దొడ్డుబియ్యం పంపిణీ చేయడంతో చాలా మంది ఆ బియ్యాన్ని మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే కారణంతో సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీతో రేషన్‌కార్డులు కలిగి ఉన్నవారందరికీ ప్రయోజనం కలుగనున్నది. అయితే చాలా ఏళ్లుగా కొత్త రేషన్‌కార్డులు జారీ చేయక పోవడంతో వారికి సన్నబియ్యం పొందే అవకాశం లేకుండా పోయింది. సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసిన వారందరికీ కొత్తగా రేషన్‌కార్డులు జారీ చేసి సన్నబియ్యం అందించాలని కోరుతున్నారు.

Updated Date - Mar 29 , 2025 | 01:12 AM