sircilla : కాయ్ రాజా కాయ్
ABN , Publish Date - Mar 31 , 2025 | 01:12 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) ఐపీఎల్ క్రికెట్ క్రేజ్ కొనసాగుతోంది. మరో రెండు నెలల పాటు సాగే ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ భూతం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు పాకింది.

- జోరుగా ఐపీఎల్ బెట్టింగ్
- పల్లెలకు పాకిన మహమ్మారి
- హోటళ్లు... అద్దె ఇళ్లలో బెట్టింగ్‌లు
- ఇతర రాష్ట్రాల నుంచి బుకింగ్‌లు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఐపీఎల్ క్రికెట్ క్రేజ్ కొనసాగుతోంది. మరో రెండు నెలల పాటు సాగే ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ భూతం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు పాకింది. బంతిబంతికి ఉత్కంఠగా బెట్టింగ్‌లు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఫలానా బ్యాట్స్‌మెన్ సెంచరీ కొడతాడా, బాల్ ఫోర్ పోతుందా.. ఇలా జోరుగా యువత బెట్టింగ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో కేవలం నగరాలకే పరిమితమైన బెట్టింగ్‌లు ఇంటర్ నెట్ సౌకర్యం గ్రామ గ్రామాన రావడంతో పాటు మొబైల్ ఫోన్‌లు, సోషల్ మీడియాలో ఆసక్తికరంగా ప్రమోషన్లతో అరకొర డబ్బులతో ఈజీగా మనీ సంపాదించవచ్చు అనే ఆశతో యువకులు బెట్టింగ్‌కల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. పోలీస్ యంత్రాంగం బెట్టింగ్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించడం సినీనటి, సెలబ్రిటీలపై కేసులు నమోదు చేయడంతో యువత ఇబ్బంది పడుతున్న తీరు కూడా కనిపిస్తుంది.
ఎల్లలు దాటిన బుకింగ్‌లు...
జిల్లాలో కొందరు స్థానికంగానే బెట్టింగ్‌లు కొనసాగిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్, కర్ణాటక, చెన్నయ్, బెంగుళూరు ముంబయి తదితర నగరాల్లో ఉన్నవారు సైతం జిల్లాలో సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఏజెంట్లను నియమించుకొని ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో సైతం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలు అద్దె ఇళ్లలో టీవీతో పాటు మద్యం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌ల ద్వారా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. యువకుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ బెట్టింగ్‌లు కట్టడానికి ప్రొత్సహిస్తున్నారు. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఏ క్రికెటర్ ఎన్ని వికెట్లు తీశారనే వివరాలను అందిస్తూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. బంతి, ఓవర్, టాస్ వేసిన దగ్గరి నుంచి బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.
అప్పుల పాలవుతున్న యువకులు...
బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ గేమ్‌లతో జిల్లాలో యువకులు, విద్యార్థులు అప్పులపాలై ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌కు అలవాటు పడడం, గేమ్‌ల కోసం లోన్ యాప్‌ల్లో రుణాలు పొందుతున్నారు. జిల్లాలో ఆన్‌లైన్ గేమ్‌లు, బెట్టింగ్‌లతో పలువురు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు ఉన్నాయి. అప్పులు పెరిగి వడ్డీలు కట్టలేక రోడ్డున పడ్డ వారు ఉన్నారు.
ఆగని దందా
బెట్టింగ్, గేమింగ్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై జిల్లా పోలీసులు పటిష్ట నిఘా ఉంచినా దందామాత్రం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచే పోలీసులు నిఘాను ఉంచినా స్మార్ట్ ఫోన్‌లలో బెట్టింగ్‌లు కొనసాగిస్తున్నారు. బెట్టింగ్‌లకు తోడుగా గంజాయి అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. పోలీసులు యాంటీ డ్రగ్స్ క్లబ్‌లు ఏర్పాటు చేసి ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2021లో 22 కేసుల్లో 71 మందిని అరెస్ట్ చేసి 56.36 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2022లో 16 కేసుల్లో 51 మందిని ఆరెస్ట్ చేసి 35 కిలోలు, 2023లో 61 కేస్లుల్లో 141 మందిని ఆరెస్ట్ చేసి 74 కిలోలు 2024లో 93 కేసుల్లో 241 మందని ఆరెస్ట్ చేసి 41 కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ నిఘా పెరిగినా బెట్టింగ్‌లు అక్రమ దందాలు మాత్రం కొత్తదారులు తొక్కుతున్నాయి.