ఎస్సారెస్పీ నీటి విడుదల నిలిపివేత
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:06 AM
జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన శ్రీరాంసాగర్ కింద సాగు అవసరాలకు నీటి విడుదల ప్రక్రియ ముగిసింది. మిగిలిన నీటిని తాగునీటి అవసరాలకు పక్కన బెట్టారు. ఆయకట్టుకు నీటి విడుదల ప్రణాళిక ముగిసినప్పటికీ కాకతీయ కాలువ నీటి ఆధారంగా సాగవుతున్న వరి పంటలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కోతకు రాలేదు.

జగిత్యాల, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన శ్రీరాంసాగర్ కింద సాగు అవసరాలకు నీటి విడుదల ప్రక్రియ ముగిసింది. మిగిలిన నీటిని తాగునీటి అవసరాలకు పక్కన బెట్టారు. ఆయకట్టుకు నీటి విడుదల ప్రణాళిక ముగిసినప్పటికీ కాకతీయ కాలువ నీటి ఆధారంగా సాగవుతున్న వరి పంటలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కోతకు రాలేదు. కనీసం మరో వారం రోజుల పాటు మరో తడి నీరందిస్తే పంటలు చేతికందుతాయని ఆయకట్టు రైతులు అంటున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 12.904 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కానీ అందులో 5 టీఎంసీల డెడ్ స్టోరేజీ, 5 టీఎంసీలు తాగునీటి అవసరాలకు పోతుంది. ఆవిరి రూపంలో 2 టీఎంసీల నీరు పోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరు కచ్చితంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో కాకతీయ కాలువ ద్వారా మరో తడి ఇచ్చే అవకాశం లేదని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. నీటి సరఫరా లేకపోతే పంటలు ఎండిపోతాయని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫగత యేడాది డిసెంబరు 25 నుంచి నీటి విడుదల
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గత యేడాది డిసెంబరు 25వ తేదీ నుంచి నీటి విడుదలను చేపట్టారు. ఈనెల 9వ తేదీతో వారబందీ పద్ధతిలో నీటి సరఫరా పూర్తవుతుంది. వారబందీ ప్రకారం వారం రోజులు 3,500 క్యూసెక్కులు, ఎనిమిది రోజులు 7,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. యాసంగి సీజన్‌కు సంబంధించి నీటి విడుదల ప్రారంభమైన సమయంలో ప్రాజెక్టులో 80.501 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 12.904 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుత సీజన్‌లో ఎల్లంపల్లి నుంచి వరద కాలువలోకి నీటిని ఎత్తిపోయనందున ఎస్సారెస్పీ నీటినే వరద కాలువలోకి వదలడం, స్టేజ్-2 ఆయకట్టుకు కొంత నీటిని తరలించడంతో ప్రస్తుతం డ్యామ్‌లో నీటి నిల్వలు అడుగంటాయి. మరోవైపు ఎండల తీవ్రత పెరగడం, భూగర్భ జలాలు తగ్గడంతో పంటలకు నీరు అందడం కష్టంగా మారుతోంది. యాసంగి సీజన్‌లో వరద కాలువకు శ్రీరాంసాగర్ నీటిని అధికారులు విడుదల చేశారు. కాగా వరి పొలాలు, నువ్వు తదితర పంటలు, మామిడి తోటలకు నీటి తడులు సరిగా అందక రైతులు ఇక్కట్ల పాలయ్యారు. ప్రస్తుతం మరో తడికి నీరు అందకపోతే ఇక్కట్లు ఏర్పడుతాయని రైతులు వాపోతున్నారు.
ఫప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ..
ఎస్సారెస్పీలో నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12.904 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత యేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 9.715 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మిషన్ భగీరథ, సాగు నీటి కాలువలకు కలిపి ప్రాజెక్టు నుంచి 5,797 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇందులో కాకతీయ కాలువకు 3,500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 250 క్యూసెక్కులు, అల్లీసాగర్ ఎత్తిపోతల పథకానికి 231 క్యూసెక్కులు, గుత్పా ఎత్తిపోతల పథకానికి 231 క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 700 క్యూసెక్కులు, నిజామాబాద్, నిర్మల్ టీఎస్‌ఐడీసీకి 312 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల అవుతుండగా 341 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. ఇదిలా ఉండగా గత యేడాది జూన్ 1వ తేది నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 288.037 టీఎంసీల వరద నీరు వచ్చి చేరగా, 282.742 టీఎంసీల నీటిని వివిధ అవసరాల నిమిత్తం వినియోగించారు.
ఫజూలై దాకా తాగునీటికి ఢోకా లేనట్టే..
ఎస్సారెస్పీలో ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిని జూలై వరకు తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. ఆగస్టు నుంచి సహజ ప్రవాహాలు మొదలయ్యే వరకు ఈ నీటిని సర్దుబాటు చేయనున్నారు. మిషన్ భగీరథతో పాటు స్థానిక తాగునీటి అవసరాలకు ఈ నీటిని పక్కకు పెట్టాలన్న నిర్ణయం మేరకు నీటి నిల్వలు లభ్యతగా ఉంచారు. ఒకవేళ ఆ తదుపరి సహజ ప్రవాహాలు కరువైనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ పథకాలకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో కోరుట్ల, జగిత్యాల ప్రాంతాలకు 61 క్యూసెక్కులు, ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలకు 63 క్యూసెక్కులు, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలకు 107 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే విదంగా వచ్చే జూలై మాసాంతం వరకు తాగునీటిని అందించడానికి అనుగుణంగా శ్రీరాంసాగర్‌లో నీటి నిల్వలను ఉంచుతున్నారు.
ఫజిల్లాలో 3.5 లక్షల ఎకరాల సాగు
జిల్లాలో యాసంగి సీజన్‌లో సుమారు 3.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. జిల్లాలో ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. ఇబ్రహీంపట్నం మండలం నుంచి పెగడపల్లి మండలం వరకు సుమారు 91 కిలో మీటర్ల మేర కాకతీయ కాలువ ప్రవహిస్తోంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు విడుదల చేస్తున్న నీరు 25వ కిలో మీటరు వద్ద జగిత్యాల జిల్లాలో ప్రవహిస్తోంది. 116వ కిలోమీటరు వద్ద ముగుస్తోంది. జిల్లాలోని వివిధ గ్రామాలకు కాకతీయ కాలువకు అనుబంధంగా ఉప కాలువలను నిర్మించి నీరు సరఫరా చేశారు. జిల్లాలో డీ-21 ఉప కాలువ నుంచి డీ-83 వరకు 62 డిస్ట్రిబ్యూటర్ కాలువలు ఉన్నాయి. ఒక్కో డిస్ట్రిబ్యూటరీకి ఆయకట్టును బట్టి ఎడమ, కుడి వైపులకు మరో 50 వరకు కాలువలు ఉంటాయి. సంబంధిత మైనర్ కాలువల ద్వారా సాగునీరు పంట పొలాలకు అందించారు. జిల్లాలో ఎస్సారెస్పీ ద్వారా 1.70 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారన్న అంచనా ఉంది.